మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పని చేయండి! | Art Therapy Stress Relief Mental Health | Sakshi
Sakshi News home page

మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఈ పని చేయండి!

Oct 24 2026 11:11 AM | Updated on Oct 24 2026 11:11 AM

Art Therapy Stress Relief Mental Health

హెల్త్‌

ఆర్ట్‌ థెరపీ

స్ట్రెస్‌ టూ స్కెచ్‌

మనసులో బాధ ఉన్నా, ఎవరిమీదో కోపం వచ్చినా, ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరైనా.. వాటిని మాటల్లో చెప్పడం ఒక్కోసారి సాధ్యం కాదు. అలాంటప్పుడు ఓ కాగితం, కొన్ని రంగులు చేతిలో ఉంటే చాలు.. మనసులోని భావాలను బొమ్మల రూపంలో బయటపెట్టవచ్చు. దీనినే ఆర్ట్‌ థెరపీగా పిలుస్తుంటారు.

2015 ముందు వరకు ఉన్న ఈ ట్రెండ్‌ ఇపుడు సోషల్‌ మీడియాలోనూ డూడ్లింగ్, సెన్సరీ డ్రాయింగ్, ఆర్ట్‌ థెరపీ వంటి పేర్లతో పాపులర్‌ అయిపోయింది. బొమ్మలు గీయడం, రంగులు నింపడం, మట్టితో బొమ్మలు చేయడం వంటి పనులు మనసును ప్రశాంతంగా ఉంచడానికే కాదు.. భావాలను అర్థం  చేసుకోవడంలోనూ సహాయపడుతాయి. అయితే ఇక్కడ బొమ్మ ఎంత అందంగా గీశామన్నది కాదు. మనసులోని భావాలకు రంగులు అద్దడమే అసలు విషయం!

పదేళ్ల క్రితం ‘ఒత్తిడి’ అనేది చాలా తక్కువ మంది నోటి నుంచి, తక్కువగా వచ్చే మాట. కానీ నేడు చిన్నా పెద్దా అనే తేడా లేదు... చేస్తున్న పనితో సంబంధం లేదు. ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో ఒత్తిడిని ఎదుర్కోక తప్పడం లేదు. అందుకే మళ్లీ వెనకటి రోజులకే ప్రయాణం మొదలు పెడుతున్నారు. బొమ్మలు గీయడం, రంగులు వేయడం వంటి వాటివైపు మళ్లుతున్నారు.

మనసు గందరగోళంగా ఉన్నపుడు ఓ కాగితం, ఓ పెన్సిల్‌ తీసుకోండి.. నచ్చినట్లు గీతలు గీయండి, రంగులు నింపండి, చిన్న చిన్న ఆకారాలు వేయండి. బొమ్మ అందంగా రావాలన్న నియమం లేదు.. మీ మనసు అందులో లీనమైతే చాలు. ఇలా రోజులో కొద్దిసమయం డ్రాయింగ్‌కు కేటాయించడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, ఆలోచనల హడావిడి నుంచి బయటపడటానికి ఓ చక్కని మార్గం కావచ్చునంటున్నారు మానసిక నిపుణులు.

కుటుంబం, ఆఫీస్‌లో సాధించాల్సిన టార్గెట్‌లు చాలామందిని ఆందోళనకు, ఒత్తిడికి గురిచేస్తుంటాయి. దీనికి తోడు స్మార్ట్‌ఫోన్లు మన మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. పదే పదే వచ్చే నోటిఫికేషన్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, పలు సోషల్‌ మీడియా వేదికలు మన దృష్టి్టని ఆకర్షిస్తుంటాయి. కొన్ని యాప్‌లు మనల్ని గంటల తరబడి వాటికే అంకితమైపోయేలా చేస్తాయి.

ఈ డిజిటల్‌ అలవాట్లు మన మెదడుకు తగినంత విశ్రాంతి లేకుండా చేయడమే కాకుండా.. మనసులో అలజడికి, ఆందోళనకు కారణమవుతుంటాయి. అలాంటపుడే ఓ పది నిమిషాలపాటు స్క్రీన్‌కి దూరంగా ఉండేలా ఏదయినా నచ్చిన పనిచేయడం వల్ల మనసును ఒత్తిడి నుంచి మళ్లించవచ్చు.

మనసులోని భావాలే బొమ్మలుగా!
మనసులోని భావాలను ప్రతిసారీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. బాధ, కోపం, భయం, అయోమయం వంటి భావాలను రంగులు, ఆకారాలు, గీతలు, గుర్తుల రూపంలో వ్యక్తపరచడమే బొమ్మల భాష. ఇలా మదిలోని భావాలను బొమ్మల రూపంలో బయట పెట్టడం వల్ల సమస్యను అర్థం చేసుకోవడానికి, వాటిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచించడానికి అవకాశం దొరుకుతుంది.

బొమ్మలు గీసేటప్పుడు కళ్లతో ఆకారాలను గమనించడం, చేతితో గీతలు గీయడం, రంగులను ఎంచుకోవడం, ఏం గీయాలో నిర్ణయించుకోవడం వంటి పనులు ఒకేసారి జరుగుతాయి. ఇందుకోసం మెదడులోని పలు వ్యవస్థలు సమన్వయంతో పనిచేస్తాయి. గీతలు, ఆకారాలు, రంగులపై దృష్టి్ట పెట్టడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఒకే పనిపై కొంతసేపు దృష్టి నిలపడం వల్ల పదేపదే వచ్చే ఆందోళనకరమైన ఆలోచనల నుంచి విరామం లభిస్తుంది.

కళాకారులే కానక్కర్లేదు!
బొమ్మలు గీయాలంటే గొప్ప కళాకారులై ఉండాల్సిన అవసరం లేదు. అద్భుతమైన చిత్రాల్నే గీయాల్సిన అవసరం లేదు. మనసుకు నచ్చినట్టు గీతలు గీసినా ఉపశమనం పొందవచ్చు. అయితే దీనికోసం గంటల సమయం కేటాయించక్కర్లేదు. పరిశోధనల ప్రకారం తొలినాళ్లలో 20 నిమిషాల పాటు బొమ్మలు గీసినా వేగంగా సాగుతున్న ఆందోళనకరమైన ఆలోచనల నుంచి మనసుకు విరామం దొరుకుతుంది.

అందరికీ బొమ్మలు గీయడం నచ్చకపోవచ్చు. అలాంటివారు మట్టితో బొమ్మలు చేయడం, రంగులతో చిత్రాలు వేయడం వంటివి కూడా ప్రయత్నించవచ్చు. కొందరికి మట్టితో పని చేయడం ప్రశాంతతను ఇస్తే, మరికొందరికి రంగులతో చిత్రాలు వేయడం నచ్చుతుంది. ఇక్కడ మీరు ఏది ఎంచుకుంటారనేది ముఖ్యం కాదు.. ఏది ప్రశాంతతను ఇస్తుందో దాన్ని సెలెక్ట్‌ చేసుకోవడమే అత్యంత ప్రధానం.

ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌
సాధారణంగా మనకు ఒత్తిడి కలిగినపుడు శరీరంలోని సింపథటిక్‌ నాడీ వ్యవస్థ చురుగ్గా మారుతుంది. అంటే ప్రమాదం రాబోతుందని భావించినపుడు మనకు తెలియకుండానే గుండె వేగంగా కొట్టుకోవడం, కండరాలు బిగుసుకుపోవడం, బీపీ పెరగడం, అలాగే ఒత్తిడిని పెంచే కార్టిసాల్‌ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. అంటే సమస్యతో పోరాడటమో లేదంటే ఆ సమస్య నుంచి పారి΄÷మ్మనో మన మెదడు చెబుతుంటుంది. దీనినే ఫైట్‌ ఆర్‌ ఫ్లైట్‌ అంటుంటారు.

ఇలాంటి సమయంలోనే మన మనసుకు నచ్చిన బొమ్మలు గీయడం ద్వారా మన దృష్టిని ఒత్తిడితో కూడిన ఆలోచనల నుంచి మరోవైపు మళ్లించవచ్చు. దీనివల్ల శరీరంలో విశ్రాంతికి తోడ్పడే పారాసింపథటిక్‌ నెర్వస్‌ సిస్టమ్‌ చురుగ్గా మారి.. గుండె వేగాన్ని తగ్గిస్తుంది. కండరాల ఒత్తిడిని సడలించి, శరీరం తిరిగి ప్రశాంత స్థితికి చేరుకోవడంలో సహాయపడుతుంది.

బొమ్మల్లో భావాలు!
బాధగా ఉన్నప్పుడు మనసు దేనిపైనా నిలవదు. కోపంగా ఉన్నప్పుడు ఆలోచనలు మరింత వేగంగా సాగుతుంటాయి. ఇలాంటి ప్రతికూల భావోద్వేగాలను కంట్రోల్‌ చేయడంలో డ్రాయింగ్‌ పాత్రను చైనాకు చెందిన పరిశోధకులు అధ్యయనం చేశారు.

ఈ పరిశోధనలో.. బొమ్మలు గీయడం వల్ల బాధ, విచారం, నిరాశతో కూడిన భావోద్వేగాలు.. సానుకూలంగా మారినట్లు గుర్తించారు. బొమ్మలు గీసే సమయంలో మెదడులో జరిగే కొన్ని మార్పులను కూడా వారు గుర్తించారు. డ్రాయింగ్‌ అనేది మనసును ప్రతికూల ఆలోచనల నుంచి మళ్లించడమే కాకుండా, భావాలను వ్యక్తపరచడానికి కూడా తోడ్పడుతుందని ఈ పరిశోధన సూచిస్తోంది.

– నిర్వహణ : రమా జంబుల

ఇదీ చదవండి: ఆసియా శాస్త్రవేత్తల్లో ఆశాభావం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement