కథానీతి
‘మన ఏవ మనుష్యాణాం కారణం బంధ మోక్షయోః’ ప్రాపంచిక బంధాలలో చిక్కుకోవడానికిగానీ, వాటినుండి విడుదల పొందడానికి కానీ; మన సు ఖానికిగానీ, దుఃఖానికి కానీ; అభ్యున్నతికిగానీ, పతనానికి కానీ – ఇలా దేనికైనా మన మనసు, అందులో ఎగిసిపడే ఆలోచనలే కారణాలని చెబుతూ శ్రీ రామకృష్ణ పరమహంస ఒకరోజు తమ శిష్యులకు మనిషి మనసులోని కోరికలు, ఆశలు అతనిని ఎలా పతనం చేస్తాయో వివరించడానికి ఈ కథను చెప్పారు.
ఒక వర్తకుడు వ్యా΄ార నిమిత్తం తన గ్రామం నుండి పట్టణానికి నడిచి వెడుతున్నాడు. ఆ కాలంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఇప్పటిలాగా రవాణా సౌకర్యాలు ఉండేవి కాదు కాబట్టి తెల్లవారు జాము నుంచి మధ్యాహ్నం దాకా నడిచేసరికి బాగా అలసిపోయాడు. మరొక నాలుగైదు గంటలు నడిస్తే కానీ గమ్యం చేరలేడు. కనుక ఎక్కడైనా తగిన చోటు దొరికితే కాసేపు ఆగి బడలిక తీర్చుకొందామనుకొన్నాడు. అతని అదృష్టం కొద్దీ ఒక పెద్ద చెట్టు, దాని చుట్టూ అరుగు కనిపించాయి. పరమానందంగా ఆ చెట్టు నీడన ఆ అరుగుపై కాళ్ళు చాచి పడుకొన్నాడు.
చల్లగా వీస్తున్న గాలి అతని మార్గాయాసాన్ని కాస్త ఉపశమింపజేసింది. అప్పుడతనికి తన దాహం తెలిసింది. ‘తాగడానికి నీరు లభిస్తే ఎంత బాగుంటుందో’ అనుకొన్నాడు. వెంటనే అతని పక్కన ఒక ΄ాత్రలో చల్లని నీరు ప్రత్యక్షమైంది. ఆశ్చర్యపోతూ అమృత తుల్యంగా ఉన్న ఆ నీటిని తాగి దాహం తీర్చుకొన్నాడు. దాహం తీరగానే అతని మనసు భోజనం పైకి మళ్ళింది. ‘బాగా ఆకలి వేస్తోంది. తినడానికి మంచి భోజనం లభిస్తే బాగుండు’ అని అనుకుంటూండగానే అతని ఎదుట పంచభక్ష్య పరమాన్నాలు వడ్డించబడిన విందు భోజనం అరిటాకులో సిద్ధంగా కన్పించింది.
ఎంతో సంబరంగా కడుపునిండా భోంచేశాడు. కాసేపు కునుకు తీస్తేగానీ భుక్తాయాసం తీరి నడక ముందుకు సాగదు. ఈ అరుగు పైన మెత్తటి పరుపు, తలగడ అమరితే బాగుండు అని మనసులో అనుకొన్నాడో లేదో తక్షణం అతని ఎదుట హంసతూలికా తల్పం ప్రత్యక్షమైంది. దానిపై పడుకొని ‘ఇప్పుడెవరైనా నా కాళ్ళు పడితే బ్రహ్మాండంగా నిద్ర పోవచ్చు’ అని అనుకొన్న మరుక్షణం ఇద్దరు అపురూపమైన అందగత్తెలు అతని కాళ్ళు పట్టడం మొదలు పెట్టారు. తాను ఏ చెట్టు నీడన కూర్చున్నాడో అది కల్పవృక్షమనీ, అతడు మనసులో ఏది కోరుకొన్నా దానిని వెంటనే ప్రసాదిస్తుందనీ అతనికి తెలియదు.
ఇప్పుడు అతనికి ఒక అనుమానం మొదలైంది. ‘ఈ అడవిలో నేను గనుక గాఢంగా నిద్రపోతే, ఒంటరిగా, నిరాయుధుడుగా ఉన్న నన్ను ఏ పెద్దపులో వచ్చి చూసిందంటే నా గతి ఏమౌతుందో’ అనుకొంటూండగానే ఎక్కణ్ణుంచో గాండ్రుమంటూ ఒక పెద్దపులి వచ్చి, అతనిపై భీకరంగా దాడిచేసి చంపేసింది. అంతటితో ఆతని కోరికలన్నీ అంతమైపోయాయి. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు మన మనసులో మంచి భావనలు ఉంటే మనకు మంచే జరుగుతుంది. లేకపోతే మన గతి అథోగతే అన్నది శ్రీ రామకృష్ణులు ఈ కథ ద్వారా మనకు అందించిన సందేశం.
– డాక్టర్ గొల్లాపిన్ని సీతారామ శాస్త్రి
నిర్వహణ : డి.వి.ఆర్


