ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారాన  వైకుంఠనాథుడు | Explanation of Vaikuntha Ekadashi | Sakshi
Sakshi News home page

ముక్కోటి ఏకాదశి: ఉత్తర ద్వారాన  వైకుంఠనాథుడు

Dec 29 2025 4:00 AM | Updated on Dec 29 2025 4:00 AM

Explanation of Vaikuntha Ekadashi

ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రలోకి వెళ్లిన శ్రీమహా విష్ణువు, కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొని, శ్రీదేవి – భూదేవి సమేతంగా ఈ ఏకాదశి రోజున వైకుంఠానికి తిరిగి వచ్చాడట. అప్పుడు ముక్కోటి దేవతలు ఉత్తరద్వారం చెంత నిలిచి స్వామి దర్శనం 

చేసుకున్నారని, ఈ కారణంగానే దీనిని ముక్కోటి ఏకాదశిగా పిలుస్తుంటారని పెద్దలు చెబుతారు. ఈ రోజున స్వామివారిని ఉత్తరద్వారం గుండా దర్శించుకోవడం వలన మోక్షం లభిస్తుందని విశ్వాసం. అందుకే తిరుమలతో సహా అన్ని వైష్ణవ క్షేత్రాలలోనూ భక్తుల సందర్శనకు వీలుగా ఈరోజున తెల్లవారు జాము నుంచే ఉత్తర ద్వారాలు తెరచి ఉంచుతారు. 

ఏకాదశి అంటే తిథులలో పదకొండవది. ఇది సాక్షాత్తూ శ్రీ మహావిష్ణువుతో ముడిపడిన తిథి. అందుకే ఏకాదశిని హరితిథి అని, వైకుంఠదినమనీ అంటారు. ఇటువంటి ఏకాదశులు మాసానికి రెండు చొప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు వస్తాయి. అధికమాసం వచ్చిన సంవత్సరంలో ఇరవై ఆరు వస్తాయి. (చాంద్రమానం ప్రకారం ప్రతి మూడు సంవత్సరాలకూ ఒక అధికమాసం వస్తుంది). వీటిలో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగానూ, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగానూ మనం పండుగలాగ జరుపుకుంటాం. 

ఉత్తరాయన ప్రారంభదినం కావడం మూలాన ఇది అత్యంత విశిష్ఠమైనది. ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించింది. అప్పటినుంచి మూసి ఉన్న స్వర్గ ద్వారాలు  ఈధనుర్మాసారంభం నుంచి తెరుచుకుంటాయని పురాణ వచనం. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తరద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం  దేవతలందరూ ఈ రోజున దివినుంచి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. 

మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ వైకుంఠ ఏకాదశినాడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రినుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఇవాళ ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.

ఉత్తర ద్వారమే వైకుంఠ ద్వారం. ఈ వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తర ద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. శ్రీరంగం, తిరుపతి, అన్నవరం, భద్రాద్రి, మంగళగిరి, యాదగిరి గుట్ట, స్వర్ణగిరి వంటి అన్ని క్షేత్రాలలో ఈ ముక్కోటి ఏకాదశిని మహోత్సవంగా జరుపుకుంటారు. 

ముక్కోటి ఏకాదశిని అత్యంత మహిమాన్వితమైన రోజుగా పురాణాలు వర్ణిస్తున్నాయి. అందుకే ఈనాడు ఉపవాసం, విష్ణుపూజ విశేష ఫలాలనిస్తాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలమంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే సర్వపాపాలు హరించి అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.            

– డి.వి.ఆర్, 
(మంగళవారం ముక్కోటి)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement