తిరుమల ఆలయంలో పుష్పాలంకరణ
తిరుమలలో వైభవంగా వైకుంఠ ద్వార దర్శనాలు
నేత్రపర్వంగా శ్రీవారి స్వర్ణ రథోత్సవం
నేడు స్వామి వారికి చక్రస్నానం
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు మంగళవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమలలో స్వర్ణరథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఉదయం 9 నుంచి 10.30 గంటల నడుమ శ్రీవారి రథరంగ డోలోత్సవాన్ని పురమాడ వీధుల్లో నేత్రపర్వంగా నిర్వహించారు.
అలాగే, శ్రీవారి ఆలయంలో ఏర్పాటు చేసిన పుష్పాలంకరణలు విశేషంగా ఆకట్టుకున్నాయి. శ్రీవారి ఆలయం వద్ద టీటీడీ ఉద్యానవన విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసులు పర్యవేక్షణలో ఓ దాత ఏర్పాటు చేసిన శ్రీరంగనాథ స్వామి ఆలయ సెట్టింగు భక్తులను ఆకట్టుకుంది. కాగా, వైకుంఠ ద్వాదశిని పురస్కరించుకుని బుధవారం సుదర్శన చక్రత్తాళ్వార్ల చక్రస్నాన మహోత్సవం వైభవంగా జరుగనుంది.
రామతీర్థంలో వైభవంగా గిరి ప్రదక్షిణ
నెల్లిమర్ల రూరల్: ఆంధ్రా రెండో భద్రాద్రిగా పేరొందిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మంగళవారం వైభవంగా జరిగింది. ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులు వేలాదిగా తరలివచ్చి శ్రీరామ నామస్మరణతో బోడికొండ (నీలాచల పర్వతం) చుట్టూ 8 కిలోమీటర్ల మేర నడిచి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజామున స్వామివారికి బాల¿ోగం, సుప్రభాత సేవ అనంతరం ఉత్తరద్వారం నుంచి శ్రీ సీతా సమేత లక్ష్మణ స్వామివారి దర్శనాన్ని కల్పించారు.
అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకువెళ్లి తిరువీధి ఉత్సవం నిర్వహించారు. కోదండరామ స్వామివారి మెట్లను పసుపు, కుంకుమలతో అలంకరించి మెట్లోత్సవాన్ని జరిపించారు. ప్రత్యేక పూజల అనంతరం గిరి ప్రదక్షిణ చేపట్టి 1,500 అడుగులు ఎత్తులో బోదికొండపై కొలువైన శ్రీ కోదండరామ స్వామి వారిని దర్శించుకున్నారు.
వీఐపీల సేవలో తరించిన టీటీడీ
» సామాన్య భక్తులను పక్కనపెట్టి..
» 6 గంటలకుపైగా వీఐపీలకే అవకాశం
» వైకుంఠ ద్వార దర్శనానికి భారీగా విచ్చేసిన సినీ నటులు
సాక్షి టాస్క్ ఫోర్స్: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వీఐపీల సేవలో తరించారు. మొదటి నుంచి సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని చెబుతూ వచి్చన టీటీడీ అధికారులు.. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా చేశారు. 6 గంటల పాటు వీఐపీల సేవలో తరించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. టీటీడీ చరిత్రలో తొలిసారిగా వైకుంఠ ద్వార దర్శనం కోసం మొదటి మూడురోజులు కేవలం ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న భక్తులకు మాత్రమే లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి అవకాశం కల్పించడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తిరుమలలో సోమవారం అర్ధరాత్రి దాటాక మంగళవారం వేకువజామున ప్రారంభ సమయం 12.05 గంటలకు ఉత్తర ద్వారా దర్శనం ప్రారంభం కాగా.. 1.15 గంటలకు వీఐపీలను అనుమతించారు. సాధారణంగా అయితే వీఐపీలకు తెల్లవారుజామున 4.30 గంటల వరకు మాత్రమే సమయం కేటాయిస్తారు. కానీ మంగళవారం నాటికి ఏకంగా 6,800 మంది వీఐపీలకు టికెట్లు కేటాయించడంతో ఉదయం 7.30 గంటలు వరకు వారే దర్శనాలు చేసుకున్నారు. టీటీడీ చర్యలతో విసుగు చెందిన అనేకమంది భక్తులు, స్థానిక తిరుపతి వాసులు టీటీడీ అనుబంధ ఆలయాలకు వెళ్లి దర్శనం చేసుకున్నారు.
ఈసారి వైకుంఠ దర్శనానికి మాజీ ఎమ్మెల్యేలను తిరస్కరించడంతో టీటీడీ తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎలాంటి ప్రోటోకాల్ లేని అనేకమంది సినీనటులు మంగళవారం వేకువజామున వైకుంఠ ద్వారదర్శనం చేసుకోవడం గమనార్హం. మరోవైపు తిరుమలలో కూటమి నేతల హవా కనిపించింది. ఎమ్మెల్యేలు కాని వారికి సైతం వైకుంఠ ద్వారదర్శనం లభించింది.
సింహగిరీశా..శరణు శరణు
ముక్కోటి ఏకాదశి సందర్భంగా సింహగిరిపై కొలువుదీరిన శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి శ్రీదేవి, భూదేవి సమేతుడై ఆలయ ఉత్తర రాజగోపురంలో వైకుంఠవాసుడిగా శేషతల్పంపై వేంజేసి భక్తులకు దర్శనమిచ్చారు. పాంచరాత్ర ఆగమశాస్త్రాన్ని అనుసరించి రాత్రి ఒంటి గంట నుంచి వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ఉత్తర రాజగోపురంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించారు. – సింహాచలం
చిన వెంకన్న నమోస్తుతే!
ఏలూరు జిల్లా ద్వారకాతిరుమలలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం చిన వెంకన్న ఆలయంలో స్వామివారి ఉత్తర ద్వార దర్శనం భక్తులకు నేత్రపర్వమైంది. తెల్లవారుజామున 4.15 గంటలకు అర్చకులు ఆలయ ఉత్తర ద్వారాలను తెరచి, వెండి గరుడ వాహనంపై కొలువైన స్వామి, అమ్మవార్లకు పూజలు చేసి హారతులిచ్చారు. అనంతరం భక్తులకు శ్రీవారి ఉత్తర ద్వార దర్శనంతో పాటు, స్వామివారి నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పించారు. – ద్వారకాతిరుమల
కైలాసవాసా.. పాప వినాశ
ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామివార్లకు మంగళవారం ప్రత్యేక ఉత్సవం నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ ముఖమండపంలో ఉత్తర ముఖంగా ఆశీనులను చేసి విశేష పూజాదికాలు జరిపించారు.
అనంతరం విశేషపూజాదికాలు, రావణవాహన సేవ చేపట్టారు. ఉత్సవమూర్తులను ఉత్తరద్వారమైన శివాజీగోపురం నుంచి వెలుపలకి తీసుకువచ్చి గ్రామోత్సవం జరిపించారు. ఆ తర్వాత ఉత్సవమూర్తులను తిరిగి ఆలయ ముఖమండపం ఉత్తరం వైపున (బలిపీఠం సమీపంలో) ఆశీనులను చేయించారు. గ్రామోత్సవం ప్రారంభమైన తరువాత భక్తులను దర్శనానికి, ఆర్జితసేవలకు అనుమతించారు. – శ్రీశైలం టెంపుల్
శ్రీవారి సేవలో ప్రముఖులు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా మంగళవారం పలువురు ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అరవింద్ కుమార్, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మణీంద్ర మోహన్ శ్రీవాత్సవ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పలువురు ఏపీ, తెలంగాణ, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులు ఉన్నారు. – తిరుమల


