breaking news
Sri Maha Vishnu
-
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్‌కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది. -
పాక్‌లో 1300 ఏళ్లనాటి హిందూ దేవాలయం!
ఇస్లామాబాద్: దాయాది దేశాలైన పాకిస్తాన్-భారత్‌లు ఒకప్పుడు ఒకే భూభాగంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు దేశాలుగా విడిపోక ముందు భారత్‌కు వాయువ్యంలో ఉన్న కరాచి కొంత భాగం పాకిస్తాన్, మరికొంత భాగం భారత్‌లో ఉండేది. ఈ నేపథ్యంలో తాజాగా పాకిస్తాన్‌లోని కరాచి జిల్లాకు సమీపంలో ఇటీవల జరిపిన తవ్వకాల్లో అత్యంత పురాతనమైన హిందూ దేవాలయం బయటపడింది. పాకిస్తాన్, ఇటాలీయన్ పురావస్తు శాఖ స్వాత్ జిల్లాలోని బరీకోట్ ఘుండాయ్ ప్రాంతంలో ఈ తవ్వకాలను చేపట్టింది. ఈ క్రమంలో గురువారం 1300 ఏళ్ల నాటి పురాతన హిందూ దేవాలయం వెలుగు చూసినట్లు పాక్ పురావస్తు శాఖ చీఫ్ ఫజల్ ఖాలిక్ తెలిపారు. అయితే ఇది శ్రీమహావిష్ణువు ఆలయంగా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ ఆలయం దాదాపు 1300 ఏళ్ల నాటిదని, హిందూషాహి రాజ్యంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. (చదవండి: ఆరేళ్లుగా వీడని మిస్టరీ.. తనను మిస్సవుతున్నా!) క్రీ.శ. 850-1026 మధ్య కాలంలో హిందూషాహి పాలకులు వాయువ్య భారత ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర కూడా చెబుతోంది. వీరిని హిందూషాహీలు లేదా కాబూల్ షాహీలు అని పిలుస్తారంట. దీన్ని ఒక హిందూ రాజ్యవంశంగా పిలుచుకునేవారని, ఈ రాజ్యవంశీయులే మహావిష్ణువు ఆలయాన్ని నిర్మించి ఉంటారని అధికారులు తెలిపారు. అంతేగాక ఈ ఆలయానికి మరోవైపు పరిసర ప్రాంతాల్లో కంటోన్మెంట్, వాచ్ టవర్ వంటి జాడలను కూడా పురావస్తు శాఖ కనుగొంది. అయితే స్వాట్ జిల్లాలో వెయ్యేళ్ల కిందటి పురావస్తు ప్రదేశాలు ఉన్నాయని.. ఇప్పటి వరకు ఎన్నో పురావస్తు వస్తువుల బయటపడ్డాయని ఫజల్ ఖాలిక్ అన్నారు. అయితే హిందూషాహీల నాటి జాడలు మాత్రం మొదటిసారిగా బయటపడ్డాయని ఆయన స్పష్టం చేశారు. (చదవండి: సౌదీ నోటుపై భారత్ సరిహద్దు వివాదం పరిష్కారం) -
బద్రినాథ్ గుడిలో కొత్త బంగారు గొడుగు
గోపేశ్వర: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బద్రినాథ్‌లోని విష్ణు భగవానుడి విగ్రహంపై కొత్త బంగారు గొడుగును ఏర్పాటుచేశారు. నాలుగు కేజీల బరువున్న ఈ గొడుగును లూధియానాకు చెందిన సూద్ కుటుంబం కానుకగా సమర్పించింది. ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో దాన్ని దేవాలయానికి తీసుకొచ్చి ప్రత్యేక ప్రార్థనల నడుమ గర్భగుడిలో ప్రతిష్టించారు. సూద్ కుటుంబీకులు, దేవాలయ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 600 ఏళ్ల కిత్రం గ్వాలియర్ రాచకుటుంబానికి చెందిన మహరాణి అహల్యా బాయ్ సోల్కర్ సమర్పించిన గొడుగు స్థానంలో కొత్త గొడుగును అమర్చారు. -
గరుడ పురాణంలో ఏముంటుంది?
గరుడపురాణం అనేది మనిషిని సన్మార్గంలో నడిపించడానికి మన పెద్దలు రాసిన ఒక మహత్తరమైన గ్రంథం. మరణానంతర జీవితంపై గరుత్మంతుడికి తలెత్తిన పలు సందేహాలకు శ్రీ మహావిష్ణువు వివరంగా సమాధానాలు చెప్పాడు. అదే గరుడ పురాణం. దీనిని చదవడం వల్ల మనిషి తన జీవితాన్ని మంచిమార్గంలోకి మలచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇందులో స్వర్గం అంటే ఏమిటి, నరకమంటే ఏమిటి, ఏ పాపం చేసిన వారు నరకానికి పోతారు, ఏ పుణ్యకార్యం చేసిన వారికి స్వర్గార్హత లభిస్తుంది, వైతరణి అంటే ఏమిటి, వైతరణకి ఎవరు పోతారు? నరక బాధలు తప్పించు కోవాలంటే ఏం చేయాలి... వంటి అనేక సందేహాలకు విష్ణుమూర్తి గరుడునికి సమాధానాలు చెప్పాడు.. ఎవరైనా మరణించినప్పుడు పురోహితుడు లేదా ఎవరైనా పెద్దవాళ్లు గరుడ పురాణాన్ని పారాయణ చేస్తారు. అయితే ఎందువల్లో ఏమో, గరుడపురాణం అంటే కేవలం ఎవరైనా పోయినప్పుడు మాత్రమే చదువుకునేది అనే ఒక అపప్రధ ఉంది. మనిషి మనిషిగా బతకడానికి చదవవలసిన గ్రంథం కాబట్టి దీనిని ఎప్పుడైనా చదవవచ్చునని కొందరు ఆధ్యాత్మికవేత్తలు చెబుతున్నారు. అయితే, మనసు బలహీనంగా ఉన్నవారు మాత్రం ఇది చదవకపోవడమే మంచిదని మరికొందరు చెబుతారు. -
పర్వదినాలకు శుభారంభం కార్తిక మాసం
పున్నమి చంద్రుడు కృత్తికానక్షత్రంలో సంచరిస్తాడు కనుక ఈ మాసానికి కార్తికమాసం అని పేరు. ఈ మాసంలో చేసే ఆలయ సందర్శనం, అర్చనలు, అభిషేకాలతోపాటు, స్నానదానాదులు కూడా అత్యంత విశిష్ఠమైనవే. అలాగే నదీస్నానం, ఉపవాసం, దీపారాధన, దీపదానం, సాలగ్రామ పూజ, వన సమారాధనలు ఆచరించదగ్గ విధులు. కార్తికమాసంలో శ్రీ మహావిష్ణువు చెరువులలో, దిగుడు బావులలో, పిల్లకాలువలలోనూ నివసిస్తాడట. అందుకే ఈ మాసంలో వాపీ, కూప, తటాకాదులలో స్నానం చేయడం ఉత్తమం. కుదరని పక్షంలో మనం స్నానం చేసే నీటిలోనే గంగ, యమున, గోదావరి, కృష్ణ, కావేరి, నర్మద, తపతి, సింధు మొదలయిన నదులన్నింటి నీరూ ఉందని భావిస్తూ... సూర్యోదయానికి ముందే తలారా స్నానం చేయాలి. ఈ మాసంలో ప్రతిరోజూ పుణ్యప్రదమైనదే. అయితే ఏ రోజున ఏమి చేస్తే మంచిదో తెలుసుకుని దాని ప్రకారం ఆచరిస్తే మరిన్ని ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. మచ్చుకు కొన్ని తిథులు... ఈవారం ఆచరించవలసిన విధుల వివరాలు... కార్తీక శుద్ధపాడ్యమి: తెల్లవారుజామునే లేచి స్నానం చేసి, అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికెళ్లి, ‘నేను చేయదలచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించ’మని ప్రార్థించి సంకల్పం చెప్పుకుని ఆకాశదీపాన్ని సందర్శించుకోవాలి. విదియ: ఈ రోజు సోదరి చేతి భోజనం చేసి ఆమెకు యథాశక్తి కానుకలు ఇచ్చిరావాలి. అలా చేసిన వారికి యమగండం వాటిల్లదని పురాణోక్తి. తదియ: అమ్మవారికి కుంకుమపూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుందని ప్రతీతి. కార్తీక శుద్ధ చవితి: దీనికే నాగుల చవితి అని పేరు. ఈ వేళ పగలు ఉపవాసం ఉండి, నియమనిష్ఠలతో సుబ్రహ్మణ్యేశ్వరునికి పుట్టలో పాలు పోసిన వారికి కడుపు పండుతుందని కార్తికపురాణం చెబుతోంది. పంచమి: దీనికి జ్ఞానపంచమి అని పేరు. ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి ప్రీత్యర్థం అర్చనలు చేయించుకున్నవారికి జ్ఞానవృద్ధి కలుగుతుంది. రోజూ చేయలేకపోయినా... ఈ మాసంలో చేసే స్నాన దాన జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి. అయితే అలా రోజూ చేయలేనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారంనాడయినా సరే నియమ నిష్ఠలతో ఉపవాసం ఉండి, గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం ఎవరితరమూ కాదని సాక్షాత్తూ బ్రహ్మదేవుడే చెప్పినట్లు కార్తిక పురాణం చెబుతోంది. కార్తీక పౌర్ణమినాడు పగలు ఉపవసించి, రుద్రాభిషేకం చేయించి శివాలయంలో 365 ఒత్తులను ఆవునేతితో వెలిగిస్తే సమస్త పాపాలూ భస్మీపటలమై ఇహలోకంలో సర్వసౌఖ్యాలను అనుభవించి అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక కథలు, గాథలు, ఇతివృత్తాలు, ఉపకథలను బట్టి తెలుస్తుంది. ఈమాసం... వనసమారాధనలకు ఆవాసం మామూలు రోజులలో గడపదాటి వెళ్లనివారు సైతం కార్తీక మాసంలో వన సమారాధనలో పాల్గొంటారు. వనసమారాధనలో ఉసిరిగ చెట్టునీడన సాలగ్రామరూపంలో శ్రీహరిని పూజించి శక్తి కొలది అన్న సమారాధన చేసిన వారిని యముడు కన్నెత్తి కూడా చూడలేడని, వనభోజనం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోయి విష్ణుసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం బోధిస్తోంది. కార్తీకమాసంలో వనభోజనం ఎవరు చేస్తారో, పురాణం ఎవరు వింటారో వారికి ఉత్తమ గతులు కలగడంతోపాటు హోమం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు, దేవతార్చన సమయంలో, పితృతర్పణ సమయంలో, భ్రష్టులు, ఛండాలురు, సూతకం ఉన్నవాళ్ల మాటలు వినడం వల్ల కలిగే పాపాలు తొలగుతాయని పురాణోక్తి. ఈ రెండు వాదనలూ సరైనవే... కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులు భావిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురిదీ వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. ఈ మాసంలో ఇవి చేయరాదు తామసం కలిగించే ఉల్లి, వెల్లుల్లి, మద్యం, మాంసం జోలికి పోరాదు. ఎవ్వరికీ ద్రోహం చేయరాదు. పాపపు ఆలోచనలు చేయకూడదు. దైవదూషణ తగదు. దీపారాధనలకు తప్ప నువ్వులనూనెను ఇతరత్రా అవసరాలకు ఉపయోగించరాదు. మినుములు తినకూడదు. నలుగుపెట్టుకుని స్నానం చేయరాదు. కార్తీక వ్రతం పాటించేవారు ఆ వ్రతం చేయని వారి చేతి వంట తినరాదు. ఈ మాసం... ఇవి చేయడం మంచిది ఈ మాసంలో చేసే ఉపవాసం, జాగరణ, స్నానం, దానం మామూలుగా చేసేటప్పటికంటే ఎన్నో రెట్లు అధిక ఫలాన్నిస్తాయి. విష్ణువును తులసి దళాలు, మల్లె, కమలం, జాజి, అవిసెపువ్వు, గరిక, దర్భలతోను, శివుని బిల్వదళాలతోనూ, జిల్లేడుపూలతోనూ అర్చించిన వారికి ఇహపర సౌఖ్యాలతోబాటుఉత్తమ గతులు కలుగుతాయి. శక్తి లేనివారు ఉదయం స్నానం, జపం, దేవతారాధన యథావిధిగా చేసి మధ్యాహ్నభోజనం చేసి, రాత్రికి పాలు, పళ్లు తీసుకోవచ్చు. ఇలా చేయడం అధిక ఫలదాయకం కార్తీకమాసంలో దశమి, ఏకాదశి, ద్వాదశి తిథులలో శ్రీమహావిష్ణువును తులసిదళాలతోటీ, కమలాలతోటీ పూజిస్తే సమస్త సౌఖ్యాలు కలగడంతోపాటు జన్మరాహిత్యం కలుగుతుందట. ఆరుద్ర నక్షత్రాన, మాసశివరాత్రినాడు, సోమవారం రోజు, పున్నమినాడూ రుద్రాభిషేకం చేసి, బిల్వదళాలతో పూజించిన వారు అనంతమైన సౌఖ్యాలతోబాటు అంత్యమున శివసాయుజ్యం పొందుతారని కార్తీక పురాణం చెబుతోంది. ఇవేవీ పాటించ(లే)కున్నా, సంప్రదాయాన్ని పాటించేవారిని గేలిచేయకుండా, వారికి సాయం చేస్తూ, పరనిందకు దూరంగా ఉంటూ, కలిగినదానిలోనే దానధర్మాలు చేసేవారికి సైతం పుణ్యఫలాలు కలుగుతాయని పెద్దల వాక్కు. - డి.వి.ఆర్. కార్తీకమాసం విష్ణుస్వరూపమని విష్ణుభక్తులు, కాదు... ఈశ్వరార్చనే ప్రశస్తమని శివభక్తులూ వాదిస్తారు. ఒకరకంగా ఆ ఇరువురి వాదనా సరైనదే. ఎలాగంటే ఈ మాసం శివకేశవులకిరువురికీ ప్రీతిపాత్రమైనదే. సాక్షి ఫ్యామిలీకి సంబంధించి మీ సలహాలను, సూచనలను పంపండి. ఫోన్: టోల్ ఫ్రీ నంబర్: 1800 425 9899 (ఉ.7.00-రా.8.00వరకు) పోస్ట్: సాక్షి ఫ్యామిలీ, 6-3-249/1, సాక్షి టవర్స్, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-500034 మెయిల్: sakshi.features@gmail.com