శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం | Modi Sudarshan Chakra Mission: A Celestial Weapon A Divine Mystery | Sakshi
Sakshi News home page

శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం

Aug 16 2025 4:55 PM | Updated on Aug 16 2025 5:19 PM

Modi Sudarshan Chakra Mission: A Celestial Weapon A Divine Mystery

వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్‌కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. 

వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. 

వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.

విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. 

వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.

ఒక్కసారి సంధిస్తే..
సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం.  ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.

సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.

సుదర్శన చక్రం సంహారాలు
శ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.

అన్నమయ్య నోట.. 
తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.  ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement