breaking news
Sudarshan Chakra
-
అలనాటి అస్త్రాలు...
మహాభారత కాలంలో ఉపయోగించిన అస్త్రశస్త్రాల గురించీ, వాటి విశిష్ఠత గురించీ, వాటిని ఎవరు ఉపయోగించారు అనే విషయాలను గురించి రెండు వారాలుగా తెలుసుకుంటూ వస్తున్నాం కదా... ఈ వారం ఆ అస్త్రాలలో మరికొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుని అలనాటి అస్త్రాలు శీర్షికకు ముగింపు పలుకుదాం...సుదర్శన చక్రం...మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుని ఆయుధం సుదర్శన చక్రం. 108 రంపపు పళ్ల ఆకారంలో కొనలు పదునుదేరి, లక్ష్య భేదితమైన సుదర్శన చక్రం పని పూర్తికాగానే, ఎవరైతే ప్రయోగించారో వారివద్దకే చేరుతుంది. మహాభారత యుద్ధంలో శ్రీ కృష్ణుడు తన సుదర్శనచక్రంతో శిశు పాలుని సంహరించాడు.నారాయణాస్త్రం...ఈ అస్త్రం విష్ణుమూర్తికి చెందినది. దీనిని ప్రయోగించడం శ్రీకృష్ణుడు, ద్రోణాచార్యుడు,అశ్వత్థామలకు మాత్రమే తెలుసు. కొన్ని పదుల క్షిపణులు ఒకేసారి ప్రయోగిస్తే ఎంత శక్తిమంతంగా ఉంటుందో నారాయణాస్త్రం కూడా అంత శక్తిమంతంగా ఉంటుంది. దీని బారినుంచి ఎవరూ తప్పించుకోలేరు... ప్రతిఘటించలేరు. ఈ అస్త్రం ప్రయోగించిన సమయంలో ఎవరి వద్ద ఆయుధాలు ఉన్నా వాటిని త్యజించి నారాయణాస్త్రానికి లొంగిపోవాలి. లేకుంటే తన లక్ష్యసాధనను ఈ అస్త్రం నెరవేర్చి తీరుతుంది. కురుక్షేత్ర సంగ్రామంలో అశ్వత్థామ నారాయణాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు అందరు యోధులు ఆయుధాలు త్యజించి లొంగిపోగా ఒక్క భీముడు మాత్రమే ఎదురు తిరిగాడు. అయితే జగన్నాటక సూత్రధారి అయిన శ్రీ కృష్ణపరమాత్మ సూచన మేరకు భీముడు కూడా లొంగిపోయి నారాయణాస్త్రానికి నమస్కరించడంతో కథ సుఖాంతమైంది.వజ్రాయుధం...దేవతల రాజయిన ఇంద్రుని ఆయుధం. దీనిని దధీచి మహర్షి వెన్నెముక నుండి తయారు చేసారు. దీనిని ఇంద్రుడు తన కుమారుడైన అర్జునునికి ఇచ్చాడు. ఈ ఆయుధం విశ్వంలో ఉన్న కాంతిని సేకరించుకొని మెరుపులతో దాడి చేసి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. దీనిని వృత్తాసురుని సంహరించేందుకు అర్జునుడు ఉపయోగిస్తాడు. ఎందుకంటే వృత్తాసురుడు మహా శక్తిసంపన్నుడు.ఎంతో తపస్సు చేసి తనను ఎటువంటి లోహంతో తయారు చేసిన ఆయుధంతో సంహరించినా మరణం లేకుండా వరం పొందాడు. ఈ విషయంపై దేవతలు శ్రీమహావిష్ణువుకు మొర పెట్టుకోగా, ఎంతో తపఃశక్తి కలిగిన భృగుమహర్షి కుమారుడైన దధీచి మహర్షి ప్రాణత్యాగం చేయడంతో ఆయన వెన్నెముకతో వజ్రాయుధాన్ని తయారు చేశారు.వాసవీ శక్తి లేదా శక్త్యాయుధంఇది ఇంద్రుని ఆయుధం. కర్ణుని కవచ కుండలాలను దానం అడిగిన ఇంద్రుడు, కర్ణుని దానగుణానికి ఆశ్చర్యపోయి కర్ణునికి ప్రతిఫలంగా తనవద్ద వద్ద ఉన్న ఎంతో శక్తిమంతమైన వాసవీ శక్తి అస్త్రాన్ని ప్రసాదిస్తాడు. ఇది లక్ష్య సాధన కలిగింది. మహాభారత యుద్ధం లో ఈ అస్త్రాన్ని అర్జునునిపై ప్రయోగించేందుకు కర్ణుడు ప్రత్యేకంగా దాచాడు. అయితే 14వ రోజు యుద్ధంలో ఘటోత్కచుడు తన మాయో పాయం తో యుద్ధం చేస్తుంటే అతన్ని సంహరించడానికి వాసవీశక్తిని ప్రయోగించమని దుర్యోధనుడు కోరడంతో కర్ణుడు శక్త్యాయుధాన్ని ఘటోత్కచునిపై ప్రయోగించగా అతడు మహావృక్షం లా నేలకూలాడు. గాండీవంఖాండవవనాన్ని అర్జునుడు అగ్నిదేవునికి ఆహుతి ఇవ్వడంతో అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి గాండీవాన్ని ప్రసాదించాడు. స్వర్గ లోకంలో ఉన్న గాండీవ వృక్షం ద్వారా గాండీవం రూపొందించబడటంతో ఇది ఎంతో శక్తిమంతమైనది. బ్రహ్మదేవునివద్ద 1000 ఏళ్ళు, ప్రజాపతి వద్ద 503, చంద్రుని వద్ద 500, వరుణుడి వద్ద వందేళ్లు, ఇంద్రుని వద్ద 85 ఏళ్లూ ఈ గాండీవం ఉందని పురాణాల ప్రకారం తెలుస్తోంది. గాండీవానికి అక్షయ తూణీరం ఉంది. అంటే అంటే ఎన్ని బాణాలు వేస్తున్నా... అమ్ముల పొది ఖాళీ అవదు. ఇవే కాకుండా మరెన్నో శక్తిమంతమైన అస్త్రాలను మహాభారత యుద్ధంలో వినియోగించారు.పాశుపతాస్త్రంఇది పరమేశ్వరుని దివ్య అస్త్రం. ఈ అస్త్రం కోసం అర్జునుడు పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు ఆచరించాడు. ఇది ఎంతో విధ్వంసకరమైనది. దీనిప్రయోగం పరశురామ, అర్జున, కర్ణులకి మాత్రమే తెలుసు. అలనాటి రామాయణంలో రావణకుమారుడైన ఇంద్రజిత్‌కు తెలుసు. కానీ మహాభారత యుద్ధంలో గురుశాపం వల్ల కర్ణుడు పాశుపతాస్త్రాన్ని ప్రయోగించలేకపోతాడు.– సి.ఎన్.మూర్తిసీనియర్ జర్నలిస్ట్ -
శివుడిపైనే పరీక్షించి.. అలా విష్ణువు చేతికి చేరిన దివ్యాయుధం
వచ్చే పదేళ్లనాటికి దేశంలోని అన్ని ప్రధాన వ్యవస్థలకు రక్షణ కల్పించే సాంకేతిక ఆధారిత భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు పంద్రాగస్టు ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆ మిషన్‌కు శ్రీకృష్ణుడి స్ఫూర్తితో సుదర్శన చక్రగా పేరు పెడుతున్నట్లు చెప్పారు. హిందూ పురాణాల్లో అత్యంత శక్తివంతంగా భావించబడే.. పరమ పవిత్రమైనదిగా పూజలు అందుకునే సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి ఎలా చేరిందో తెలుసా?.. వామన, లింగ పురాణాల్లో సుదర్శన చక్రం కథ భాగాన్ని చూడొచ్చు. శ్రీదాముడు అనే రాక్షసుడు అహంకారంతో విర్రవీగుతూ దైవ శక్తులను స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఈ ప్రయత్నంలో.. ధర్మ విరుద్ధంగా లక్ష్మీదేవిని వశపరచుకోవాలనుకుంటాడు. ఈ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు.. శ్రీమహావిష్ణువు పరమశివుడి శరణు వేడుతాడు. అయితే అప్పటికే కైలాసగిరిలో శివుడు యోగ తపస్సులో ఉంటాడు. దీంతో కార్తీక శుక్ల చతుర్దశి నాడు శివుడిని పూజించేందుకు విష్ణువు కాశీకి వెళ్తాడు. వెయ్యి బంగారు పద్మాలతో శివుడిని పూజించాలనుకుంటాడు విష్ణువు. అయితే విష్ణువుకు భక్తి పరీక్ష పెట్టాలని.. అందులో ఓ పద్మాన్ని శివుడు మాయం చేస్తాడు. దీంతో.. కమల నయనుడిగా పేరున్న నారాయణుడు తన కంటినే తామర పువ్వుగా శివుడికి సమర్పించేందుకు సిద్ధమవుతాడు.విష్ణువు భక్తిని చూసి శివుడు ఆనందించి.. శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రాన్ని విష్ణువుకు బహుమతిగా ఇస్తాడు. ఆ సమయంలో.. ‘‘ధర్మ రక్షణ కోసం ఈ చక్రం రాక్షసులను నాశనం చేస్తుంది. మూడు లోకాల్లో దీనికి సాటి ఆయుధం లేదు’’ అని శివుడు చెబుతాడు. అయితే ఆ చక్రం శక్తిని పరీక్షించదలిచి.. తొలుత శివుడిపైనే ప్రయోగించే వరం కోరతాడు విష్ణువు. అందుకు శివుడు సంతోషంగా అంగీకరిస్తాడు. మహా విష్ణువు సంధించిన సుదర్శన చక్రం శివుని మూడు భాగాలుగా ఖండిస్తుంది. వెంటనే శివుడు ప్రత్యక్షమై.. ఈ చక్రం తన రూపాలను ఖండించగలిగింది గానీ తత్వాన్ని కాదని చెబుతాడు. సుదర్శన చక్రాన్ని శ్రీదాముడిని సంహరించేందుకు ఉపయోగించమని సూచిస్తాడు. మహావిష్ణువు అలాగే చేసి ధర్మాన్ని పరిరక్షిస్తాడు. మహావిష్ణువు అవతారం కాబట్టే ద్వాపర యుగంలో దుష్ట శిక్షణ కోసం సుదర్శన చక్రం శ్రీకృష్ణుడి చేతికి చేరింది.ఒక్కసారి సంధిస్తే..సూర్య భగవానుడి తేజస్సు కలిగిన సుదర్శన చక్రం హిందూ పురాణాలలో మహావిష్ణువు చేతిలోని అత్యంత శక్తివంతమైన ఆయుధం. ఇది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానకాంతిని ప్రసరింపజేస్తుంది. అందుకే దీనిని సుదర్శనం అంటారు. రెండు వరుసల్లో పదునైన పళ్లతో గుండ్రటి ఆకారంలో ఉంటుంది. భక్తుల కంటిని ఇది ఆభరణమే. కానీ, ధర్మాన్ని రక్షించేందుకు దుష్టసంహారంలో శిక్షాయుధంగా ఇది ప్రయోగించబడింది. ఒక్కసారి సంధిస్తే.. లక్ష్యాన్ని పూర్తి చేసుకునేంత వరకు వెనక్కి రాదు. చక్రానికి ఉన్న ఆ ముళ్లు ఒకదానికొకటి వ్యతిరేక దిశలో కదలడం వల్ల వేగంగా తిరుగుతూ వెళ్తుంది. ప్రపంచంలోని ఏవైనా పదార్థాలను అతి పదునైన అంచులతో తేలికగా కత్తిరించగలదని ప్రశస్తి. అయితే.. ఇది కేవలం ఆయుధం మాత్రమే కాదు.. భక్తి, ధర్మం, జ్ఞానానికి ప్రతీకగా నిలుస్తుంది. సుదర్శన చక్రాన్ని ధ్యానించడం వల్ల శాంతి, సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి.సుదర్శనోపనిషత్తు ప్రకారం.. సుదర్శన చక్రాన్ని దేవశిల్పి అయిన విశ్వకర్మ తయారుచేశాడు. విశ్వకర్మ తన కూతురు సంజనాను సూర్యునికిచ్చి వివాహం చేస్తాడు. అయితే సూర్యుని తేజస్సు మూలంగా ఆమె ఆయన్ని చేరలేకపోతుంది. ఇది గమనించిన విశ్వకర్మ.. సూర్యుని తేజస్సును తగ్గించడానికి సానపడతాడు. అప్పుడు రాలిన పొడితో.. పుష్పక విమానం, త్రిశూలం, సుదర్శన చక్రం తయారు చేశాడు.సుదర్శన చక్రం సంహారాలుశ్రీదాముడితో పాటు హిరణ్యాక్షుడు, సువర్ణాక్షుడు, విరూపాక్షుడు(శివుని మూడు ఖండాలు) అనే రాక్షసులను సుదర్శన చక్రం ద్వారా మహావిష్ణువు సంహరించినట్లు వామన పురాణంలో పేర్కొనబడింది. మహాభారత ఇతిహాసంలో.. శ్రీకృష్ణుడు నూరు పాపాలు చేసిన శిశుపాలుడిని సుదర్శన చక్రంతోనే సంహరించాడు. జరాసంధుడు, కంసుడు, నరకాసురుడు కూడా సుదర్శన చక్రంతోనే మరణించారు. ఇవేకాదు.. పురాణా ఇతిహాసాల్లో సుదర్శన చక్రం చుట్టూ అల్లుకున్న సందర్భాలు ఇంకెన్నో. అయితే.. సుదర్శన చక్రం భౌతికంగా ఇప్పుడు ఎక్కడ ఉంది?.. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని ముగించిన తర్వాత సుదర్శన చక్రం తిరిగి విష్ణువుకు చేరిందని విశ్వాసం. ఇది భౌతికంగా కనిపించదుగానీ కాదు.. ఆధ్యాత్మికంగా విశ్వంలో ధర్మాన్ని కాపాడే శక్తిగా భావించబడుతోంది.అన్నమయ్య నోట.. తిరుమల బ్రహ్మోత్సవాల్లో చివరిరోజున సుదర్శన చక్రానికి చక్రస్నానంలో భాగంగా ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి. ప్రముఖ వాగ్గేయకారుడు అన్నమయ్య సుదర్శన చక్రంపై ప్రత్యేకంగా కీర్తనలు రచించారు. అందులో “చక్రమా హరిచక్రమా” అనే పద్యం ప్రసిద్ధి పొందింది. విశాఖపట్నం శ్రీవరాహలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో సుదర్శన చక్రానికి అంకితంగా “సుదర్శన హోమం” నిర్వహించబడుతుంటుంది. తమిళనాడులోని శ్రీరంగం ఆలయంలో కూడా సుదర్శన చక్రానికి ప్రత్యేకంగా ఆలయం ఉంది.


