టోకెన్లు పొందిన భక్తులకు అనుమతి
ఫలపుష్పాలతో ముస్తాబైన సప్తగిరులు
తిరుమల: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్తర ద్వారం నుంచి భక్తులకు దర్శనమివ్వనున్నారు. సోమవారం అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాన్ని ప్రారంభించేందుకు టీటీడీ రంగం సిద్ధం చేసింది. జనవరి 8వ తేదీ రాత్రి 12గంటల వరకు 10 రోజులపాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం అందుబాటులో ఉంటుంది. సామాన్య భక్తులకు అధిక సమయాన్ని కేటాయిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. టోకెన్లు పొందిన భక్తులకు మూడు ప్రవేశ మార్గాల నుంచి అనుమతిస్తారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన మంగళవారం ఉదయం శ్రీవారు ప్రత్యేకంగా స్వర్ణ రథంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. బుధవారం ద్వాదశి పర్వదినాన వేకువజామున స్వామివారి పుష్కరిణిలో చక్రస్నానం నిర్వహిస్తారు. ద్వాదశి నాడు స్వామివారి పుష్కరిణిలో స్నానాలు ఆచరించే అవకాశం కల్పిస్తారు. మొదటి మూడు రోజులు టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. వీరికి అర్ధరాత్రి ఒంటిగంట నుంచి ఉదయం 11 గంటల వరకు కృష్ణతేజ ప్రవేశమార్గం నుంచి, ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఏటీజీహెచ్ అతిథిగృహం నుంచి అనుమతిస్తారు.
సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు శిలాతోరణం ప్రవేశమార్గం నుంచి భక్తులను అనుమతిస్తాడు. జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు టోకెన్లు లేకుండా వచ్చే భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. ఎస్‌ఈడీ, శ్రీవాణి దర్శన టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. చివరి మూడు రోజుల్లో స్థానికులకు రోజుకు 5 వేల మందికి చొప్పున ఇప్పటికే ఈ–డిప్ ద్వారా టోకెన్లు జారీ చేశారు. ఇప్పటికే సప్తగిరులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. ఈ పది రోజులు 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది టన్నుల ఫలాలు, నాలుగు లక్షల కట్ ఫ్లవర్స్‌తో శ్రీవారి ఆలయంతోపాటు, అనుబంధ ఆలయాలను అలంకరించనున్నారు.
ఇల వైకుంఠాన్ని తలపించేలా విద్యుద్దీప కాంతులతో శ్రీవారి ఆలయం, తిరుమల అలరారుతున్నాయి. ఆలయం వెలుపల శ్రీ రంగనాథస్వామి ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులోనే అష్టలక్ష్ములను, శ్రీ వేంకటేశ్వరస్వామి వారి సెట్టింగులను ఏర్పాటు చేస్తున్నారు. దీంతోపాటు శ్రీవారి ఆలయం ఎదుట అష్టలక్ష్ములను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
ముక్కోటి ఏకాదశి రోజున ఆలయాల వద్ద పటిష్ట బందోబస్తు
సాక్షి, అమరావతి: ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠద్వార దర్శనం కల్పించే అన్ని ఆలయాల వద్ద ఈ నెల 30న పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. రద్దీని అంచనా వేసి ఆ సమాచారాన్ని పోలీసులకు అందించాలని దేవదాయశాఖ ఈవోలను ఆదేశించింది.


