భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..? | - | Sakshi
Sakshi News home page

భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..?

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..?

భాకరాపేట అడవుల్లో ఏం జరుగుతోంది..?

అడవి బిడ్డలపై అటవీ అధికారుల దాష్టీకం! అర్ధరాత్రి అరెస్టుల పేరిట తరచూ వేధింపులు ఆచూకీ కోసం రోడ్డెక్కుతున్న కుటుంబాలు అధికార పార్టీ వారికి జరిమానాలతో సరిపెడుతున్న అటవీ సిబ్బంది

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌: అడవి బిడ్డలపై అటవీ అధికారుల అక్కసు కొనసాగుతోంది. గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిపై దాడులు తెగబడడం గిరిజన కాలనీ వాసుల్లో ఆందోళన కలిగిస్తోంది. చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు, ఎర్రావారిపాళెం మండలాల పరిధిలోని భాకరాపేట అడవుల్లో అసలు ఏంజరుగుతోందన్న అనుమానాలు అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. అటువైపుగా రాత్రి వేళ వెళ్లే వాహనచోదకులపై అటవీ అధికారులు చూపే ప్రతాపం, గిరిజన గ్రామాల్లో అటవీ అధికారుల ఆగడాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకోవడం, అడవి జంతువులను కాపాడేందుకు ఏర్పాటైన ఫారెస్టు అధికారులు ఆ పనులను పక్కపెట్టి అక్రమ సంపాదనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో పనిచేయాల్సిన ఫారెస్టు బీట్‌ ఆఫీసర్లు సైతం అడవులకు ఆనుకుని ఉన్న గిరిజన కాలనీల్లో కొందరు యువకులను ఎంపిక చేసుకుని భయపెట్టి, ప్రలోభపెట్టి తమకు ఇన్‌ఫార్మర్లుగా పెట్టుకున్నట్టు సమాచారం. ఆ ఇన్‌ఫార్మర్లు ఇచ్చే సమాచారాన్ని తమ పైఅధికారులకు చేరవేసి, బీటు ఆఫీసర్లు చేతులు దులుపుకుంటుండగా ఒక్కోసారి ఇన్‌ఫార్మర్‌ ఇచ్చిన సమాచారం మేరకు అడవుల్లో దాడులు నిర్వహించే అధికారులు అక్కడ ఏమీ లేకుండా పోతే వారిపై బూతు పురాణం చదువుతున్నట్టు గిరిజనులు మదన పడుతున్నారు. అంతేకాక ఇన్‌ఫార్మర్‌గా ఉన్న వారిపైనే ఒక్కోసారి కేసుపెట్టి ఎర్రచందనం అక్రమంగా రవాణా చేసినట్టు జైలుకు పంపించేస్తున్నారని, అదేమని అడిగితే అప్పటి వరకు తన వద్ద తీసుకున్న సమాచారం మొత్తం కోర్టుకు అందజేసి జీవితాంతం బయటకు రాకుండా చేస్తామని అటవీ అధికారులు బెదిరిస్తున్నట్టుగా బాధితులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ నేతలకు జరిమానాలతో సరి

అటవీ పరిసరాల్లో జంతువులను వేటాడడం, కలపను దోచుకోవడం వంటి కేసుల్లో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన వారు ఎవరైనా పట్టుబడితే వారికి జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. అడవి జంతువుల మాంసంతో పట్టుబడిన అమాయక గిరిజనులను మాత్రం కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కోర్టులను తప్పుదోవ పట్టించేలా..

ఎర్రచందనం అక్రమ రవాణాపై కేసులను త్వరితగతిన పూర్తి చేయడానికి ఏర్పాటైన ప్రత్యేక కోర్టును సైతం తప్పుదోవ పట్టించేలా అటవీ అధికారులు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు బాధిత వర్గాల నుంచి వ్యక్తమవుతున్నాయి. ఏదైనా కేసులో నిందితులను అరెస్టు చేసిన వెంటనే కోర్టుకు అప్పగించకుండా అడవుల్లో తిప్పుతూ చితక్కొట్టడం, ఆపై గాయాలు కాస్త తగ్గిన తరువాత కోర్టుకు అప్పగించేలా చేస్తుండడం గిరిజన కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఎర్రావారిపాళెం మండలానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, సదుం మండలానికి చెందిన మరో ఇద్దరు గిరిజన యువకులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకుని ఆరు రోజులుగా ఆచూకీ చెప్పకుండా వారి కుటుంబసభ్యులకు నరకం చూపారు. తమ బిడ్డలు ఏమయ్యారోనని తిరుపతి స్పెషల్‌ కోర్టు పరిసరాల్లో రోడ్డు పక్కన కూర్చుని పడిగాపులు కాశారు. చివరకు ఆ విషయం మీడియా ద్వారా బయటకు రావడంతో అటవీ అధికారులు గుట్టుగా ఒక్క రోజు ముందు వారిని అరెస్టు చేసినట్టు ఎఫ్‌ఐఆర్‌ చూపించి, ఆ ఐదుగురుని కోర్టులో ప్రవేశపెట్టి తప్పుదోవ పట్టించారు. అయితే బాధితుల తరఫున న్యాయవాది అటవీ అధికారులు కొట్టారని నిందితుల శరీరంపై ఉన్న గాయాలు చూపడంతో అటవీ అధికారులు అక్కడ కూడా తమకు సంబంధం లేదన్నట్టు బుకాయించారు. దీంతో ఆ దెబ్బలు దేనివల్లా కలి గాయో చెప్పాలని న్యాయాధికారి వైద్య పరీక్షలకు ఆదేశించారు. ఇలా అటవీ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ అమాయకులైన అడవిబిడ్డలపై తమ ప్రతాపం చూపుతుండటంతో గిరిజన సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి. దీనిపై చామల రేంజి అధికారి వెంకటరమణను వివరణ కోరగా తాము ఎవరినీ కొట్టలేదని, అరెస్టు చేసిన తరువాత ఆలస్యం చేయకుండా కోర్టుకు తీసుకువచ్చామని, అక్రమ కేసులు ఎవరిపైనా పెట్టలేదని, ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా పట్టుబడిన వారిపై కేసులు పెడుతున్నట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement