గుంటూరు ఎస్పీ ఐపీఎస్ చదివారా? లేక టీడీపీ మాన్యువల్ చదివారా? పోలీసుల అరెస్టులు కిడ్నాప్‌లను తలపిస్తున్నాయని హైకోర్టే చెప్పింది తప్పులు చేస్తున్న ఏ అధికారినీ వదిలిపెట్టేది లేదు తంబిరెడ్డి కేసులో గుంటూరు పోలీసులపై కంటెమ్ట్ ఫైల్ చేస్తున్నాం చంద్రగిరి నియోజకవర్గం ఇన్‌చార్జి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం
తిరుపతి రూరల్ : ‘ఏపీలో పోలీసుల తీరు మారడం లేదు.. సాక్షాత్తు హైకోర్టు ధర్మాసనం చీవాట్లు పెడుతున్నా లెక్క చేయడం లేదు.. ఇప్పుడు తప్పులు చేస్తున్న ఏ అధికారినీ వదిలేది లేదు.. పోలీసుల అరెస్టులు కిడ్నాప్‌లను తలపిస్తున్నాయని హైకోర్టు ధర్మాసనం చెబుతోందంటే సిగ్గనిపించడం లేదా? చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసులు ఎవ్వరి కళ్లలో అనందం చూడడానికి ఇదంతా చేస్తున్నారు? గుంటూరు ఎస్పీ ఐపీఎస్ చదివరా..? లేక టీడీపీ మాన్యువల్ చదివారా ? అన్న అనుమానం కలుగుతోంది’ అని వైఎస్సార్ సీపీ చంద్రగిరి నియోజకవర్గ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శుక్రవారం గుంటూరు పోలీసు స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తంబిరెడ్డితో కలిసి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడారు. గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో గుంటూరు క్రైం పోలీసులు తమ పార్టీ నాయకుడు తంబిరెడ్డిని కిడ్నాప్ చేశారని పేర్కొన్నారు. సోషల్ మీడియా కేసులో అరెస్టు చేసిన వ్యక్తిని అన్ని పోలీస్ స్టేషన్లు తిప్పండి.. పోలీసు అంటే ఏమిటో చూపించండని ఒక ఎస్పీ చెప్పడం ఎంత వరకు న్యాయమని నిలదీశారు.
కోర్టు నుంచి తప్పించుకోలేరు
తిరుపతి నగరంలో తన హోటల్ వున్న తంబిరెడ్డి వద్దకు మార్చి 31వ తేదీ రాత్రి 8.30 గంటలకు మఫ్టీలో వచ్చిన పోలీసులు క్యాటరింగ్ కావాలని, కారులో ఉన్న తమ సార్ వద్దకు వస్తే ఐటమ్స్ చెబుతారని చెప్పి కిడ్నాప్ చేశారని తెలిపారు. ఆయనను 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల వరకు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచలేదన్నారు. అరెస్టు చేసిన వ్యక్తిని 24 గంటల లోపు జడ్జి ముందు హాజరు పరచాలని, ఏడు ఏళ్ల కంటే తక్కువ శిక్ష పడే ఏ కేసులోనైనా సీఆర్‌పీసీ 41ఏ నోటీసు ఇవ్వాలన్న సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోలేదన్నారు. తంబిరెడ్డికి నోటీసు ఇచ్చి వదిలేయాలని హైకోర్టు ధర్మాసనం చెప్పినా గుంటూరు కోర్టులో హాజరు పరచడం, అక్కడ రిమాండ్ తిరస్కరించడంతో వదిలిపెట్టారని పేర్కొన్నారు. ఈ విషయాలను హైకోర్టుకు నివేదిస్తామన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన పోలీసులు కోర్టు నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.
ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తాం
తంబిరెడ్డి మాట్లాడుతూ తనను కిడ్నాప్ చేసిన పోలీసులపై కోర్టులో ప్రైవేట్ కేసు ఫైల్ చేస్తానని తెలిపారు. వారిపై చర్యలు తీసుకునేంత వరకు పోరాడతానన్నారు. కష్ట కాలంలో తన వెంట నిలిచిన చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పార్టీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిండెంట్ చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, పార్టీ తిరుపతి రూరల్ మండల అధ్యక్షుడు మునీశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ మాధవరెడ్డి, రాష్ట్ర నాయకుడు ఉపేంద్రరెడ్డి పాల్గొన్నారు.
చట్టం అందరికీ ఒకటి కాదా..?
కిర్రాక్ ఆర్పీ, సీమరాజ వంటి వారు సోషల్ మీడియా వేదికగా వైఎస్సార్ సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను నోటికి వచ్చినట్టు బూతులు తిడుతున్నా ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. 60 ఏళ్లున్న తంబిరెడ్డి తనకు ఆరోగ్యం బాగాలేదని చెబుతున్నా వినకుండా చీకటి గదిలో బందించి చిత్ర హింసలు పెట్టారని ఆరోపించారు. ఆయన పోలీసా? టీడీపీ ఏజెంటా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.


