ఎస్వీయూలో బదిలీలలు | - | Sakshi
Sakshi News home page

ఎస్వీయూలో బదిలీలలు

Apr 4 2026 7:19 AM | Updated on Apr 4 2026 7:19 AM

అన్నీ తానై వ్యవహరిస్తున్న ఒక అధికారి కీలక విభాగాల్లో తన అనుచరుల నియామకం కొన్నేళ్లుగా ఏళ్లుగా తిష్టవేసిన వారి జోలికెళ్లని అధికారులు మనస్తాపంతో ఉద్యోగి ఆత్మహత్యాయత్నం ఆ అధికారి వికృత చేష్టలకు బలవుతున్న చిరుద్యోగులు

తిరుపతి సిటీ : ఎస్వీయూలో అంతర్గత బదిలీలతో ఉద్యోగులు మనస్తాపం చెందుతున్నారు. ఓ అధికారి అంతా తానై ఉన్నత స్థాయి అధికారులు తన మాట వినాల్సిందేనంటూ వ్యవహరిస్తున్న తీరుపై ఉద్యోగలు మనస్తాపం చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఉద్యోగి గురువారం ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఆ అధికారి స్థానిక అధికార పార్టీ నేతలతో కుమ్మకై ్క రెండేళ్లుగా తన అనుచరులను ఆదాయం వచ్చే విభాగాలకు బదిలీ చేసి అవినీతికి పాల్పడుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా బదిలీలు

ఎస్వీ యూనివర్సిటీలో పనిచేస్తున్న 16 మంది బోధనేతర సిబ్బందిని బుధవారం నిబంధనలకు విరుద్ధంగా బదిలీ చేశారు. ఇందులో ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో పనిచేస్తున్న ఓ ఉద్యోగిని కావాలని ఆ అధికారి బెదిరించి ఇంజినీరింగ్‌ కళాశాలలోని కంప్యూటర్‌ విభాగానికి బదిలీ చేశారు. దీంతో మనస్తాపానికి గురైన ఆ ఉద్యోగి ఆత్మహత్యకు యత్నించాడు. వెంటనే గుర్తించిన సహచర ఉద్యోగులు అతన్ని రక్షించినట్లు సమాచారం. ఎస్వీయూలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరంకుశ పరిపాలన సాగుతోందని, ఆ అధికారి వ్యవహార శైలితో ఎంతో మంది ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్యాసంస్థల్లోనూ రాజకీయాలు మొదలయ్యాయి. ఒక అధికారి తనకు అధికార పార్టీ అండ ఉందని పేర్కొంటూ ఉద్యోగులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. అంతటితో ఆగక తన అనుచరులను కీలకమైన విభాగాల్లో నియమించుకున్నాడు. ఈ క్రమంలోనే ఒక ఉద్యోగి మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

నోరు తెరిస్తే బెదిరింపులు...బదిలీ వేటు

అధికార పార్టీ నేతల అనుచరుడిగా గుర్తింపు పొందిన ఆ అధికారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వర్సిటీలో ఉన్నత స్థాయి ఉద్యోగాన్ని సంపాదించారు. తనకు మంత్రి లోకేష్‌, సీఎం చంద్రబాబు అండ ఉందంటూ బాహాటంగానే చెబుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. గత రెండేళ్లుగా వర్సిటీలో కక్ష్య సాధింపు చర్యలు తప్ప అభివృద్ధి శూన్యమని ఉద్యోగులు వాపోతున్నారు. ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లో తన అనుచరులు మాత్రమే పనిచేయాలని, వేరే వ్యక్తి విధులు నిర్వహించేందుకు వీలులేదని చెబుతూ బదిలీ చేయడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అకౌంట్‌ సెక్షన్‌లోనూ, ఎగ్జామినేషన్‌ సెక్షన్‌లోనూ చాలా మంది ఉద్యోగులు కొన్నేళ్లుగా తిష్టవేసిన వారిని బదిలీ చేయకుండా ఆ అధికారి కాపాడుకుంటున్నారని విమర్శిస్తున్నారు. ప్రశ్నించి వారిని బెదిరిస్తూ ప్రాధాన్యత లేని విభాగాలకు బదిలీ చేసి అవమానిస్తున్నారంటూ వాపోతున్నారు.

వర్సిటీలో పాలన అస్తవ్యస్తం

ఎస్వీయూలో ఆ అధికారి వికృత చేష్టలతో అభివృద్ధి కుంటుపడింది. పాలన పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. అధికార పార్టీ అనుచరుల సలహాల మేరకు ఆ అధికారి పాలన సాగిస్తూ ఇటు ఉద్యోగులను, అటు విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అర్హతగల వారిని పక్కన పెట్టి తన అనుచరులకు ఉద్యోగాలు ఇప్పించడం, లేనిపోని ఉద్యోగాలు సృష్టించి అవినీతికి పాల్పడడం అతని నైజమని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలతో వర్సిటీలో పాలన స్తంభించిందని, ఆయన వికృత చేష్టలకు మరెంతమంది ఉద్యోగులు, విద్యార్థులు బలి అవుతారో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement