వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు | Devotional Story From Islam Velugu On The Impact Of Rains | Sakshi
Sakshi News home page

వర్షాల కోసం ‘ఇస్తిస్ఖా’... నమాజు

Jul 23 2026 7:35 AM | Updated on Jul 23 2026 8:10 AM

Devotional Story From Islam Velugu On The Impact Of Rains

ఇస్లాం వెలుగు

తప్పులు పెరిగితే తడారిపోయే నేల!

వర్షాలు పడక పొలాలు ఎండిపోతే, చెరువులు తడారిపోతే రైతు గుండె గొంతుకలోకి వస్తుంది. వాన చుక్క కోసం ఊరంతా ఆకాశం వైపు దీనంగా చూస్తుంది. ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మహమ్మద్‌ ప్రవక్త (స) కాలంలో ఏం చేసేవారో తెలుసా?

ఊరి ప్రజలందరినీ ఒక చోటికి తీసుకెళ్లి వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయించేవారు. దాన్నే ‘నమాజ్‌–ఎ–ఇస్తిస్ఖా’ అంటారు. తప్పులు పెరిగితే తడారిపోయే నేల! మనిషి చేసే పనులకి, ప్రకృతి మారే తీరుకి దగ్గర సంబంధం ఉంటుంది. వ్యాపారంలో మోసాలు ఎక్కువైనప్పుడు, సమాజంలో పేదలకు ఇవ్వాల్సిన దానధర్మాలు (జకాత్‌) సరిగ్గా చేయనప్పుడు వర్షాలు ఆగిపోతాయని ప్రవక్త చె΄్పారు. కరువు రావడం అనేది కేవలం వాతావరణం మారడం వల్ల మాత్రమే కాదు, మనుషుల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని చెప్పే ఒక హెచ్చరిక.

‘ఒకవేళ ఈ భూమి మీద మూగజీవాలు లేకపోతే, అస్సలు వర్షాలే పడవు’ అని ప్రవక్త చెప్పిన మాటలు మన అహంకారాన్ని ఆలోచనలో పడేస్తాయి. ఆడంబరం లేదు... కేవలం వినయం మాత్రమే! వర్షం కోసం వేడుకునేందుకు వెళ్లేటప్పుడు ఎలాంటి ఆడంబరాలు ఉండేవి కావు. చాలా సాధారణ బట్టలు వేసుకుని, భయభక్తులతో, వినయంగా ఊరి బయట ఉన్న ఈద్గాహ్‌ మైదానానికి వెళ్లేవారు. పండుగ నమాజ్‌ లాగే రెండు రకాతుల నమాజ్‌ చదివిన తర్వాత, ప్రవక్త చేతులను చాలా ఎత్తుకి ఎత్తి అల్లాహ్‌ను వేడుకునేవారు.

సాధారణంగా దేవుడిని కోరుకునేటప్పుడు అరచేతులు ఆకాశం వైపు ఉంచుతారు. కానీ వర్షం కోసం అడిగేటప్పుడు అరచేతులు నేల వైపు, చేతుల వెనుక భాగం ఆకాశం వైపు ఉంచేవారు. అలాగే వేసుకున్న దుప్పటిని కూడా తిరగేసేవారు. మన కష్టాల కాలం మారి, మంచి రోజులు రావాలని కోరుకోవడానికి ఇది ఒక పద్ధతి. ‘ప్రభూ! నీ దాసులకు, మూగజీవాలకు నీళ్లు ప్రసాదించు... నీ కరుణను పంచు... ఎండిపోయిన ఈ భూమికి మళ్లీ ప్రాణం పోయ్‌!’

ఇస్తిస్ఖా ప్రార్థన సారాంశం చిన్న చీమ... గొప్ప పాఠం! ఒకసారి ఒక ప్రవక్త వర్షం కోసం ప్రార్థన చేయడానికి వెళ్తూ, మార్గమధ్యంలో ఒక చిన్న చీమను చూశారట. ఆ చీమ తన కాళ్లను ఆకాశం వైపు ఎత్తి వర్షం కోసం వేడుకుంటోంది. అది చూసిన ప్రవక్త తన అనుచరులతో... ‘మనం వెనక్కి వెళ్లిపోదాం, ఆ చిన్న చీమ చేసిన ప్రార్థనను ఆలకించి దేవుడు మనకు వర్షం కురిపిస్తున్నాడు’ అన్నారట.

దేవుడి దయ కేవలం మనుషులకే కాదు, భూమి మీద ఉన్న ప్రతి జీవికీ సమానంగా లభిస్తుందనడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. వాన చినుకుల్లో పరవశం! ప్రార్థన ముగియగానే ఆకాశంలో దట్టమైన మేఘాలు పట్టి, ఉరుములు మెరుపులతో వర్షం పడేది. వాన పడటం ప్రారంభం కాగానే ప్రవక్త తన చొక్కాను కాస్త పక్కకి జరిపి, ఆ మొదటి వాన చుక్కలు తన ఒంటిమీద పడేలా నిలబడేవారు. 

‘ఇది దేవుడి దగ్గర నుంచి ఇప్పుడే వస్తున్న కొత్త వర్షం’ అని సంతోషపడేవారు. నిజమైన పశ్చాత్తాపంతో, వినయంతో ప్రార్థిస్తే ఎండిపోయిన భూములైనా, మనుషుల మనస్సులైనా మళ్లీ చిగురిస్తాయనడానికి ఇస్తిస్ఖా ప్రార్థనే నిదర్శనం.
– డా. అబ్దుర్రహీం బిన్‌ ముహమ్మద్‌ బిన్‌ మౌలానా

నిర్వహణ: డి.వి.ఆర్‌.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement