ఇఆర్‌–100 | ER-100 can improve vision and visual function in mouse models of ageing | Sakshi
Sakshi News home page

ఇఆర్‌–100

Jul 23 2026 6:16 AM | Updated on Jul 23 2026 6:16 AM

ER-100 can improve vision and visual function in mouse models of ageing

రీప్రోగ్రామింగ్‌ మొదలైంది... 

హాట్‌ టాపిక్‌

వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌... మనిషి ఆకాశంలోకి ఎగరడమనే ఊహే నాన్సెన్స్‌గా అనిపించింది. ‘మనిషి చంద్రుడిపై అడుగు పెట్టడం పగటి కల. అసాధ్యం’ అన్నారు. ‘వృద్ధాప్యం స్పీడ్‌కు అడ్డుకట్ట వెయ్యడం, నిత్య యవ్వనం’ అనేది ఈ కాలం ఆలోచన. ఆచరణ సాధ్యం అవుతుందా? ప్రపంచ వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిన ప్రోగ్రామింగ్‌ ‘ఇఆర్‌–100’తో ‘అవును’ అనే అభిప్రాయం వినిపిస్తోంది...
దావోస్‌లో ఒక ఇంటర్వ్యూయర్‌ ఎలాన్‌ మస్క్‌ను అడిగారు...
‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయవచ్చని మీరు భావిస్తున్నారా?’
సమాధానంగా... ‘వృద్ధాప్య సమస్యపై నేను ఎక్కువ సమయాన్ని వెచ్చించలేదు. అయితే అది చాలా సులభంగా పరిష్కరించగల సమస్య’ అన్నారు ఎలాన్‌ మస్క్‌.
‘ఎలాన్‌ ఎన్నయినా చెబుతాడు. ఆయన శాస్త్రవేత్త కాదు కదా!’ అనుకుంటాం. అయితే ఆయన అభి్రపాయం తో హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ సింక్లేర్‌ ఏకీభవించారు.

మైలురాయి... బోస్టన్‌ లైఫ్‌ బయోసైన్సెస్‌ ఆర్గనైజేషన్, దెబ్బతిన్న కణాలలో కొంత భాగాన్ని రీసెట్‌ చేసే ప్రయోగాలు చేస్తోంది. దీర్ఘాయువుకు సంబంధించి ఇదొక మైలురాయిగా చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఈ ప్రయోగాలు, ఎప్పుడూ యవ్వనంగా కనిపించేలా చేయడం, శాశ్వతంగా జీవించేలా చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదు. తీవ్ర కంటి వ్యాధులను మాత్రమే లక్ష్యంగా చేసుకున్నాయి. దీనికి ఇఆర్‌–100 అని పేరు పెట్టారు.

పాక్షిక ప్రోగ్రామింగ్‌... ఇఆర్‌–100 దీర్ఘకాలిక లక్ష్యం... పాక్షిక రీపోగ్రామింగ్‌. దీనిలో దెబ్బతిన్న కణాలను తిరిగి యవ్వన జీవస్థితికి తీసుకువస్తారు. ఇది విజయవంతమైతే, వృద్ధాప్యం, వ్యాధి, గాయాల కారణంగా మందగించిన కణాల పనితీరును పునరుద్ధరించవచ్చు. 

మొదటి దశ... ప్రస్తుతం చేసేది మానవులపై చేసే మొదటి దశ ప్రయోగం. ప్రయోగదశలో భద్రతను, సహనాన్ని పరీక్షించడం మొదటి దశ ముఖ్యోద్దేశం. ఇఆర్‌–100 ప్రయోగంలో పాల్గొనేవారికి సంబంధించి అయిదు సంవత్సరాల వరకు దీర్ఘకాలిక ఫాలో–అప్‌ ప్రణాళికలు రూపొందించారు. ఈ ఫాలో–అప్‌లో దుష్ప్రభావాలు, రోగనిరోధక ప్రతిస్పందనలు, దృష్టి పనితీరులో మార్పులను గమనిస్తారు. రీ ప్రోగ్రామ్‌ చేయబడిన కణాలు సరిగ్గా పనిచేస్తాయా లేదా అనే సందేహంతో పాటు కణాల గుర్తింపును మార్చడం వల్ల ఊహించని ప్రమాదాలు తలెత్తవచ్చు అనే ఆందోళన లేకపోలేదు.

జపనీస్‌ స్టెమ్‌–సెల్‌ సైంటిస్ట్‌ షినకా యన్యమాకా కీలక ఆవిష్కరణ ఆధారంగా ఇఆర్‌–100 థెరపి పనిచేస్తుంది. ‘యమనకా ఫ్యాక్టర్స్‌’ అనే ప్రొటీన్‌ల సమూహాన్ని ఉపయోగించి, తిరిగి యవ్వన స్థితికి చేరేలా ‘ప్రోగ్రామింగ్‌’ చేయవచ్చునని రుజువైంది.

చారిత్రక మలుపు... ‘జీవగడియారాన్ని వెనక్కి తిప్పే దిశగా అడుగులు వేస్తున్నారు. వృద్ధాప్యాన్ని జీవితంలో అనివార్యమైన మార్పుగా కాకుండా ఆరోగ్య సమస్యగా చూసే అవకాశాలు ఉన్నాయి’ అంటున్నారు ప్రముఖ లాంగ్విటీ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ డేవిడ్‌ సింక్లేర్‌.

‘ది సైన్స్‌ ఆఫ్‌ లివింగ్‌ లాంగర్‌ అండ్‌ బెటర్‌’ అంశంపై దుబాయ్‌లో జరిగిన సదస్సులోని ముఖ్యాంశాలు 
→ బయోటెక్నాలజీ రంగంలో వస్తున్న పురోగతి శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తోంది. రాబోయే పది, ఇరవై సంవత్సరాలలో వృద్ధాప్యాన్ని నిరోధించే ప్రయోగాలు జరగనున్నాయి.

→ వయసు సంబంధిత వ్యాధులలో  ఎనభై ఏళ్లొచ్చేసరికి చాలామంది దీర్ఘకాలిక అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అన్నిరకాల క్యాన్సర్‌లను నిర్మూలించడం వల్ల ఆయుర్దాయం కేవలం 2.5 సంవత్సరాలు మాత్రమే పెరుగుతుంది, ఎందుకంటే ఇతర వ్యాధులు అప్పటికీ వస్తూనే ఉంటాయి. అందువల్ల ఎన్నోరకాల అనారోగ్యాలకు మూలకారణమైన వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడంపై దృష్టి పెట్టాలి.

→ వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేయడానికి మా బృందం హ్యూమన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కు సిద్ధమవుతోంది. కణాలను యవ్వనస్థితిలో పునరుద్ధరించే ఎపిజెనెటిక్‌ ప్రోగ్రామింగ్‌ చికిత్సలను పరీక్షిస్తాము. వృద్ధాప్యాన్ని నెమ్మదింపజేసి వ్యాధులను నయం చేయవచ్చా లేదా– అనేది చరిత్రలో మొదటిసారి పరీక్షించబోతున్నాం. 

ఆర్థిక ప్రయోజనాలు కూడా... జీవవ్యవస్థ, కణాల పనితీరును మెరుపరచడానికి శాస్త్రవేత్తలు మార్గాలు కనుగొంటున్నారు.  సింక్లేర్‌ బృందం కొన్ని వారాల్లోనే జంతుకణజాలాలలో వృద్ధాప్యాన్ని 75 శాతం వరకు తిప్పికొట్టగల సామర్థ్యాన్ని ఇప్పటికే ప్రదర్శించింది. ఎపిజెనెటిక్‌ ప్రోగ్రామింగ్‌ థెరపీ మొదటి మానవ ప్రయోగానికి యూఎస్‌ ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మిస్ట్రేషన్‌ ఆమోదం తెలిపింది. ‘వృద్ధాప్యాన్ని నెమ్మదింపచేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి’ అంటున్నారు సింక్లేర్‌. ‘స్వచ్ఛమైన నీరు, వాక్సిన్‌ల ఆవిష్కరణల తరువాత మానవాళికి అత్యంత ముఖ్యమైన ప్రయోగం...ఇఆర్‌–100’ అంటున్నారు పరిశీలకులు.

కోడ్‌ నేమ్‌
ఇఆర్‌–100 అనేది లైఫ్‌ బయోసైన్సెస్‌ అనే సంస్థ రూపొందించిన సంకేత నామం. బోస్టన్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవస్థాపకులలో డేవిడ్‌ సింక్లేర్‌ ఒకరు. ‘ప్రోగ్రామింగ్‌’ అనే కాన్సెప్ట్‌ ద్వారా కంటి వ్యాధులకు చికిత్స చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాన్సెప్ట్‌కు మంచి స్పందన లభించింది. విప్లవాత్మకమైన ‘ప్రోగ్రామింగ్‌’లో పెట్టుబడి పెట్టడానికి సిలికాన్‌ వ్యాలీలోని న్యూ లిమిట్, రెట్రో బయో సైన్సెస్‌లాంటి ప్రముఖ టెక్‌ కంపెనీలు ముందుకు వచ్చాయి!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement