మనసు క(వ్య)థలు
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.
చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్‌లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్‌లైన్ డేటింగ్‌ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.
తమకు తామే మోసం..
వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.
అర్థం చేసుకోవడం ముఖ్యం..
ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.
→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి.
→ నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి.
→ సెకండ్ లైఫ్‌కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.
రిలేషన్స్ కూలిపోవచ్చు..
యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.
దంపతుల మధ్య దూరం..
పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.
ప్రయోజనకరంగా!
పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.
అవగాహనతోనే వికాసం
సంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.
– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్
– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి


