Pew Research Center
-
మలి దశ... మరో కోణం
జీవితం మలి దశలో భావోద్వేగ పరంగా మోసపోయే అవకాశాలు మెండుగా ఉంటాయి అంటున్నారు మనస్తత్వ నిపుణులు. మగవారిలోనూ ఈ సమస్య ఉన్నప్పటికీ మహిళలు ఇటీవల కాలంలో దీని వల్ల ఎక్కువ మోసపోతున్నారని చెబుతున్నారు. జీవితం మలిదశలో ఏర్పడిన శూన్యతను తగ్గించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో ఏం చేయాలో అవగాహన కలిగి ఉంటే అధిగమించడం సులువు అవుతుంది.చదువు, సంపాదన, వివాహం, కుటుంబ బాధ్యతలు.. ఒక్కోదశ ను దాటుకుంటూ ప్రయాణం చేస్తుంటాం. ఐదు పదులు దాటిన తర్వాత బాధ్యతల బరువు తగ్గి కొంత విశ్రాంతి లభిస్తుంది. ఎప్పుడో వదిలేసిన భావాలు మనసును ముట్టడిస్తాయి. ఖాళీ సమయాన్ని టీవీ కో, సోషల్ మీడియాకో కేటాయిస్తుంటారు చాలా మంది. కొందరు లోపలి ఖాళీని పూరించడానికి మానసికంగా కొత్త సంబంధాలవైపు మొగ్గు చూపుతారు. ఇటీవలి కాలంలో వయసు పైబడిన వారిలో అన్లైన్ డేటింగ్ పెరుగుతోందని అమెరికన్ ఫ్యూ రీసెర్చి సెంటర్ ఓ నివేదికను విడుదల చేసింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఏజింగ్ ఆన్లైన్ డేటింగ్ను ఎంచుకునేవారికి సూచనలూ ఇచ్చింది.తమకు తామే మోసం..వయసు పైబడిన వారిలో అప్పటికే శారీరక మార్పులు చుట్టుముడతాయి. దీంతో హఠాత్తుగా లైఫ్స్టైల్లో మార్పులు చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలవుతాయి. ఇన్నాళ్లూ తాము ఏం కోల్పోయోమో అర్థం అవుతుంది. వదిలేసిన అన్నింటినీ తిరిగి జీవితంలోకి తెచ్చుకోవాలనే ఆతృత పెరుగుతుంది. పూర్తి చేయలేక ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. ఫలితం గా తమను తాము హింసించుకోవడమూ పెరుగుతుంది.అర్థం చేసుకోవడం ముఖ్యం..ఈ వయసులో‘అందరూ ఏవేవో సాధిస్తున్నారనో, తాము వెనకబడిపోయామనో, గుర్తింపు కోసమో, ఖాళీని భర్తీ చేయడం కోసమో.. పరిగెత్తడం కాదు. తమని తాము అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.→ మెనోపాజ్ సమస్యల వల్ల వచ్చే భావోద్వేగాల సమతుల్యతనూ సాధించాలి. → నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం, ప్రశాంత జీవితాన్ని గడపడం, లోపలి స్వరాన్ని వినడం, సేవ, సృజన, ఆధ్యాత్మికత వైపు మనసును మళ్లించాలి. → సెకండ్ లైఫ్‌కి ఇది ప్రారంభ దశగా గుర్తించాలి.రిలేషన్స్ కూలిపోవచ్చు.. యవ్వనంలో ఇద్దరు వ్యక్తుల మధ్య అవసరం, భద్రత, కలిసి బతకడం.. వంటివే వారిని కలిపి ఉంచే బంధాలు. మధ్య వయసుకొచ్చేసరికి అర్థం చేసుకోవడం, భావోద్వేగ కలయిక, నిజాయితీగా ఉండటం సాధ్యం కాకపోవచ్చు. కొత్త బంధాలను ఏర్పరుచుకోవడంతో ఇద్దరి మధ్య తెలియకుండానే చీలిక ఏర్పడుతుంది. ఆ తర్వాత బంధాల పట్ల విముఖత ఏర్పడుతుంది. అనవసరపు ప్రయాస అనిపిస్తుంది.దంపతుల మధ్య దూరం..పిల్లలు పెద్దవాళ్లు అయ్యాక బాధ్యత తగ్గుతుంది. అలాగే, వారితో సమయం కేటాయించడం కూడా తగ్గిపోతుంది. దంపతులుగా ఇన్నాళ్లూ పిల్లల కోసమే కలిసి ఉన్నామా.. అనే ఆలోచన మొదలవుతుంది. చెప్పుకోలేని సందేహాలతో దంపతుల మధ్య దూరం పెరుగుతుంది. ఓపిక, సహనం తగ్గుతాయి. అప్పటివరకు నొక్కి పెట్టిన నిర్లక్ష్యం, అవమానం, త్యాగం.. అన్నీ పైకి ఉబికి వస్తాయి. ఇక ‘ఇప్పుడు భరించలేను’ అనే దశ వస్తుంది. ‘అందరూ నన్ను చీట్ చేశారు. వీళ్లకోసమా నేను త్యాగం చేశాను’ అనే ఆలోచన కలుగుతుంది.ప్రయోజనకరంగా! పాజిటివ్ ఆలోచనలవైపు మొగ్గు చూపాలి. శారీరక–మానసిక వ్యాయామాలు నిరాశను తగ్గిస్తాయి. మానసికంగా చురుకుగా ఉండటానికి పజిల్స్ పూరించడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, వదిలేసిన అభిరుచులను తిరిగి మెరుగుపెట్టడం, స్వచ్ఛంద సేవ.. వంటి అర్థవంతమైన కార్యకలాపాల్లో పాల్గొనడం మేలు చేస్తుంది. ఈ దశలో శరీరంలో వచ్చే ప్రకృతి సిద్ధ మార్పుల (మెనోపాజ్, వెంట్రుకలు తెల్లబడటం, రాలిపోవడం, చర్మంలో కాంతి తగ్గడం..) వల్ల నిరాశకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. పోషకాహార, చర్మ వైద్య నిపుణుల సూచనలతో శరీరంలో వచ్చే మార్పులను అర్థం చేసు కుంటూనే ఆరోగ్యకరమైన బంధాలపై అవగాహన పెంచుకోవడం అవసరం.అవగాహనతోనే వికాసంసంబంధాలలో ఏర్పడిన మార్పుల వల్ల మన ఆలోచనా విధానంలోనూ చాలావరకు మార్పు వస్తుంది. శారీరకంగా కన్నా మానసికపరమైన మోసం ఎక్కువ హానికరంగా అనిపిస్తుంది. అది తమ భాగస్వామి, పిల్లలు, బయటి వ్యక్తులు.. ఎవరైనా కావచ్చు. భావోద్వేగ బంధం స్పర్శకంటే లోతైనా సాన్నిహిత్యాన్ని సృష్టిస్తుంది కాబట్టి, దానిని కోల్పోవడం అంటే ఆ బంధాన్ని కోల్పోయినట్టే అనిపిస్తుంది. అప్పుడు మోసం జరిగింది అనుకుంటారు. ఇలాంటప్పుడు నిపుణులను సంప్రదించి, సూచనలు తీసుకోవడం మేలు కలిగిస్తోంది.– డాక్టర్ డోనాసింగ్, క్లినికల్ సైకాలజిస్ట్– నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
జన ధన భారత్! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?
ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఏప్రిల్ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది. –దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 72 ఏళ్లలో 100 కోట్లు.. ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. యంగ్ ఇండియా ►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. ►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్ అంచనా. జననాల్లోనూ వేగమే.. చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్‌లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది. హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్‌లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. తగ్గుతున్న లింగభేదం 70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది. లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్ యూఎన్ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్‌లో 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. వెళ్లేవారే ఎక్కువ.. వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. ఒక్క 2021లోనే భారత్ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్‌కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది. -
ఎదురులేని మోదీ
వాషింగ్టన్: దేశ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ప్రధాని మోదీ కొనసాగుతున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ సర్వే సంస్థ ప్యూ బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ జాబితాలో 88 శాతం పాయింట్లతో మోదీ అగ్రస్థానంలో, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ 58 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. ఆ తరువాత వరసగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి 57%, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు 39% పాయింట్లు దక్కాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21 నుంచి మార్చి 10 మధ్య 2,464 భారతీయులపై ఈ సర్వే నిర్వహించించారు. దీని ప్రకారం.. ప్రతి పది మందిలో 8 మంది దేశ ఆర్థి క పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్లు చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ రాష్ట్రాల్లో మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లలో ప్రతి 10 మందిలో 9 మంది మోదీపై సానుకూలంగా స్పందించారు. ఇప్పటికీ దేశంలో మత కలహాలు ఆందోళన కలిగించే విషయమని కొందరు చెప్పారు. -
85% భారతీయులకు ప్రభుత్వంపై నమ్మకం
వాషింగ్టన్: భారత్‌లో ఐదింట నాలుగొంతుల మందికి తమ ప్రభుత్వంపై విశ్వాసముందని, అయితే ఆసక్తికరంగా.. అధిక శాతం భారతీయులు సైనిక పాలన, నియంతృత్వానికి కూడా మద్దతిస్తున్నారని తాజా ‘ప్యూ’ సర్వే పేర్కొంది. భారత్‌లో 2012 నుంచి ఆర్థిక వృద్ధి రేటు సరాసరి 6.9 శాతం చొప్పున పెరుగుతుందని, ఈ నేపథ్యంలో కేంద్రంలోని ప్రభుత్వంపై నమ్మకముందని 85 శాతం ప్రజలు చెప్పారని తన నివేదికలో వెల్లడించింది. ఏడు దశాబ్దాలుగా బలమైన ప్రజాస్వామ్య దేశంగా ఉన్న భారత్‌లో 55% ప్రజలు ఏదో ఒక రూపంలో నియంతృత్వానికి మద్దతు తెలిపారని, 27% మంది బలమైన నేత అవసరముందని చెప్పారంది. -
పాపులర్ లీడర్ ఎవరో తెలుసా?
నరేంద్రమోదీ, రాహుల్‌గాంధీ, అరవింద్ కేజ్రీవాల్.. ఈ ముగ్గురు అగ్ర నేతలకు దేశ ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ముగ్గురు నాయకులకు దేశంలో ఉన్న ప్రజాదరణపై ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజాగా ఓ సర్వే నిర్వహించింది. గత మే నెలలో నిర్వహించిన ఈ సర్వేలో ప్రధాని నరేంద్రమోదీ ’నమో వేవ్’ ఇప్పటికీ దేశంలో బలంగా ఉందని తేలింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా క్రమక్రమంగా కోల్పోయిన తన ప్రాభవాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టు సర్వే తెలిపింది. ఈ సర్వే ప్రకారం నరేంద్రమోదీ... 57శాతం మంది భారతీయులు ప్రధాని మోదీకి అనుకూల అభిప్రాయంతో ఉన్నారు. 57శాతం మంది ఆయనను అమితంగా అభిమానిస్తున్నారు. 2015లో మోదీకి 87శాతం మంది ఈ సర్వేలో మద్దతు పలికారు. అన్ని వర్గాల ప్రజల్లోనూ మోదీకి ప్రజాదరణ ఉంది. మోదీ పరిపాలన పట్ల 67శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేస్తున్నదని 80శాతం అభిప్రాయపడ్డారు. 2014లో ఇలా చెప్పినవారు 55శాతం మందే. కాంగ్రెస్ మద్దతుదారుల్లోనూ 24శాతం మంది మోదీ పట్ల సానుకూల భావనతో ఉన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనూ మోదీకి మద్దతు బాగుంది. ’నాలాంటి సామాన్య వ్యక్తులను సంరక్షణ పట్టించుకునే వ్యక్తి మోదీ’ అంటూ 56శాతం మంది సర్వేలో పేర్కొన్నారు. మోదీ తాను అనుకున్న విషయాలు చేయగల సమర్థుడు అని 51శాతం మంది అభిప్రాయపడగా.. ఆయన చేయలేరు అని 33శాతం మంది పేర్కొన్నారు. ప్రజల ఐక్యతకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తున్నదని 49శాతం అభిప్రాయపడగా.. విభజించి పాలిస్తున్నదని 29శాతం మంది పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో మోదీ ప్రభుత్వ తీరుపై 61శాతం సంతృప్తి వ్యక్తం చేయగా, అవినీతి అణచివేతపై 59శాతం, నిరోద్యోగ సమస్య పరిష్కారంపై 62శాతం, పేదల సంక్షేమంపై 62శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ... 2014తో పోల్చుకుంటే రాహుల్‌గాంధీకి ప్రజాదరణ కొంతమొత్తంలో పెరుగడం గమనార్హం. 63శాతం మంది రాహుల్‌పై సానుకూల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2013లో ఇది కేవలం 50శాతమే. 85శాతం మంది కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులు తమ నాయకుడిపై సానుకూల అభిప్రాయం కలిగి ఉన్నారని ఈ సర్వేలో తేలింది. బీజేపీ మద్దతుదారుల్లో 52శాతం మందికి రాహుల్ అంటే సదభిప్రాయం ఉందని సర్వే పేర్కొంది. ఇక సోనియాగాంధీ పట్ల ఇప్పటికే 65శాతం మంది భారతీయుల్లో సానుకూల అభిప్రాయం ఉంది. ఇది 2015లో 58శాతం కాగా, 2013లో 49శాతంగా ఉంది. అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రజాదరణ తగ్గిపోతున్నట్టు కనిపిస్తోంది. 2015లో ఆయన పట్ల 60శాతం మంది సానుకూల అభిప్రాయం వ్యక్తం చేయగా, తాజాగా 50శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాదరణ కూడా తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 47శాతం మంది మాత్రమే ఆప్‌కు మద్దతు తెలిపారు. 2015లో ఇది 58శాతంగా ఉంది. ఆప్‌కు ఢిల్లీలో అత్యధికంగా 57శాతం మంది మద్దతు పలికారు. -
ఆధిక్యంలో హిల్లరీ క్లింటన్
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్నా కొద్దీ అగ్రపీఠాన్ని వరించబోయేది ఎవరా.. అని ఓటర్లలో తెగ ఉత్కంఠ నెలకొంటోంది. జాతీయ పోల్ సర్వేల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో కొనసాగుతున్నట్టు వెల్లడవుతోంది. తన ప్రత్యర్థి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై స్వల్పంగా 4 పాయింట్ల ఆధిక్యంలో హిల్లరీ కొనసాగుతున్నారని తాజా ప్యూ రీసెర్చ్ సెంటర్ పోల్ పేర్కొంది. తగ్గాపోరుగా ఈ ఇద్దరి నేతలు అభ్యర్థిత్వ రేసులో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ముందస్తు జాతీయ పోల్స్ అన్నింటిలో కూడా హిల్లరీ క్లింటనే ఆధిక్యంలో ఉన్నట్టు వెల్లడైంది. తాజా పోల్ సర్వేలో ఆధిక్య పాయింట్లను హిల్లరీ కోల్పోయినప్పటికీ, 4 పాయింట్లతో ముందంజలోనే ఉన్నారని ప్యూ సర్వే తెలిపింది. ఒకవేళ అమెరికాకు నేడే ఎన్నికలు జరిగితే 41 శాతం మంది రిజిస్ట్రర్ ఓటర్లు హిల్లరీకే మద్దతు పలుకుతారని ప్యూ సర్వేలో వెల్లడైంది. 37 శాతం ట్రంప్‌కు మొగ్గుచూపుతున్నట్టు సర్వే తెలిపింది. ఈ ఏడాది మొదటి వరకు చాలామంది ఓటర్లు అమెరికా అభ్యర్థిత్వానికి క్లింటన్ లేదా ట్రంప్‌ల్లో ఎవరు సరియైన వారో పోల్చుకోవడంలో సందిగ్థతలో ఉండేవారని.. ప్రస్తుతం క్లారిటీతో ఓటర్ల అభిప్రాయాలు వెల్లడవుతున్నట్టు సర్వే వివరించింది. కేవలం 27 శాతం మందే ట్రంప్‌ను అమెరికాకు గ్రేట్ ప్రెసిడెంట్‌గా అభివర్ణిస్తుంటే.. దానికి డబుల్ శాతం మంది అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా ట్రంప్‌ను పోల్చుతున్నారని సర్వే తెలిపింది. 15 శాతం మంది ట్రంప్..యావరేజ్ ప్రెసిడెంటని చెబుతున్నట్టు పేర్కొంది. ట్రంప్ కంటే ఆధిక్యంలో గ్రేట్ ప్రెసిడెంట్‌గా హిల్లరీనే ఓటర్ల మన్ననలను పొందుతున్నారని.. 31 శాతం మంది హిల్లరీ గ్రేట్ ప్రెసిడెంట్ అంటూ తెగ పొగిడేస్తున్నారట. ప్యూ రీసెర్చ్ సెంటర్ ఆగస్టు 9-16 మద్యలో 2,010 మందితో(1,567 రిజిస్ట్రర్ ఓటర్లు కలిపి) ప్యూ రీసెర్చ్ ఈ తాజా సర్వే నిర్వహించింది. .


