జన ధన భారత్‌! 2023లో రికార్డు దిశగా.. 1950లో మన జనాభా ఎంతో తెలుసా?

India Is The Most Populous Country In The World 2023 - Sakshi

ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశంగా ఇండియా 

ఈ ఏడాది ఏప్రిల్‌ నాటికి 140 కోట్లు దాటిపోతుందని ‘ప్యూ రీసెర్చ్‌’అంచనా 

ఇందులో 40 శాతానికిపైగా 25 ఏళ్లలోపువారే.. 

2100 ఏడాది నాటికి కూడా ‘యువ’భారతమే.. మన దేశం నుంచి వలసలూ పెరుగుతున్నాయని వెల్లడి 

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఈ ఏడాదే భారత్‌ అవతరించబోతోంది. 2011 తర్వాత మన దేశంలో జనాభా వివరాల సేకరణ జరగలేదు. 2021లో జరగాల్సిన జనాభా లెక్కల సేకరణ కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది. అయితే ఐక్యరాజ్యసమితి (యూఎన్‌వో) జనాభా లెక్కల కోసం పాటించే సూత్రాన్ని అనుసరించి ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ ఈ ఏడాది ఏప్రిల్‌ నెల నాటికి భారత జనాభా చైనాను అధిగమించనుందని అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి 1950లో ప్రపంచ జనగణన మొదలు పెట్టినప్పటి నుంచీ అధిక జనాభాగల దేశంగా పేరుపడిన చైనా ఇంకో రెండు నెలల్లో ఆ హోదాను కోల్పోబోతోందని ప్యూ రీసెర్చ్‌ ఇటీవల విడుదల చేసిన రిపోర్ట్‌లో పేర్కొంది.     
–దొడ్డ శ్రీనివాస్‌రెడ్డి 

72 ఏళ్లలో 100 కోట్లు.. 
ఐక్యరాజ్యసమితి ప్రపంచ జనగణన చేసిన తొలి సంవత్సరం 1950లో భారత జనాభా 35.3 కోట్లు. ఇప్పుడది 140 కోట్లకు చేరినట్లు ‘ప్యూ’అంచనా. అంటే గత 72 ఏళ్లలో దేశ జనాభా 100 కోట్లకుపైగా పెరిగింది. ఇది మొత్తం యూరప్‌ దేశాల జనాభా (74.4 కోట్లు) కంటే అధికం. ఉత్తర, దక్షిణ, అమెరికా ఖండాల కంటే (100 కోట్లు) కూడా ఎక్కువే. చైనాలో ప్రస్తుత జనాభా 140 కోట్లుగా ఉన్నా.. అక్కడ కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల మందగించింది. కానీ భారత్‌లో మాత్రం ఎప్పటి మాదిరిగానే పెరుగుతోంది. యూఎన్‌వో అంచనా ప్రకారం.. భారత దేశ జనాభా ఈ దశాబ్ధం చివరికి 150 కోట్లకు, 2064 నాటికి 170 కోట్లకు చేరుకుంటుంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదల మందగిస్తుంది. 

యంగ్‌ ఇండియా 
►భారత జనాభాలో 25 ఏళ్ల కన్నా తక్కువ వయసున్నవారు 40 శాతంపైగా ఉన్నారు. జనాభా సగటు వయసు 28 ఏళ్లు. అదే అమెరికాలో 38, చైనాలో 39 ఏళ్లు. అంటే ఇండియాలో ప్రతి పది మందిలో నలుగురికిపైగా పాతిక సంవత్సరాలలోపు వయసువారే. 

►మరోవైపు అధిక జనాభా ఉన్న చైనా, అమెరికా దేశాల్లో వయసుపై బడిన వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. 65 ఏళ్లు దాటిన వారు భారత జనాభాలో కేవలం 7.1 శాతం మాత్రమే. వీరి సంఖ్య భారత జనాభాలో 2063 నాటికి 20 శాతం, 2100 నాటికి 30 శాతానికి మాత్రమే పెరుగుతుంది. అంటే ఈ శతాబ్దం చివరి వరకు భారత్‌ యువ భారతంగానే ఉంటుందన్న మాట. ఇంకా భారతదేశంలో పాతికేళ్లలోపు వారి సంఖ్య 2078 నాటికి కానీ 65 ఏళ్ల పైబడిన వారి సంఖ్యను దాటే అవకాశం లేదన్నది యూఎన్‌ అంచనా. 

జననాల్లోనూ వేగమే..
చైనా, అమెరికాలతో పోలిస్తే భారత్‌లో జననాల రేటు కూడా అధికమే. ప్రస్తుతం సగటున భారత మహిళ తన జీవితకాలంలో 2.0 పిల్లలకు జన్మనిస్తోంది. అదే చైనాలో 1.2, అమెరికాలో 1.6గా ఉంది. అయితే గతంతో పోలిస్తే భారత దేశంలో జననాల సంఖ్య గణనీయంగా తగ్గుతూ వస్తోంది. 1992లో జననాల రేటు 3.4, 1950లో ఏకంగా 5.9 ఉండేది. భారత్‌లో అన్ని మతస్తుల్లోనూ జననాల రేటు తగ్గుతూనే ఉంది. ముస్లింలలో జననాల రేటు 1992లో 4.4గా ఉంటే.. 2019 కల్లా అది 2.4కి తగ్గింది.

హిందువుల్లో 3.3 నుంచి 1.9కు, క్రిస్టియన్లలో 2.9 నుంచి 1.9కు, సిక్కుల్లో 2.4 నుంచి 1.6కు తగ్గింది. అయితే పట్టణాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో శిశు జననాల రేటులో తేడాలు ఉన్నాయి. పట్టణాల్లో ప్రతి మహిళకు సగటున 1.6 శిశువులు జన్మిస్తే.. గ్రామాల్లో 2.1 మంది జన్మిస్తున్నారు. అదే 20 ఏళ్ల క్రితం సగటు పట్టణాల్లో 2.7, గ్రామాల్లో 3.7 మందిగా ఉండేది. ఇక జనాభా పెరుగుదల విషయంలోనూ ప్రాంతాల మధ్య వ్యత్యాసం ఉంది. 2001–2011 మధ్య మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లలో జనాభా పెరుగుదల 25 శాతం ఉంటే.. గోవా, కేరళలో 10 శాతం మాత్రమే ఉందని భారత జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే గణాంకాలు చెప్తున్నాయి. అదే నాగాలాండ్‌లో అయితే 0.6 శాతం జనాభా తగ్గింది. 

తగ్గుతున్న లింగభేదం 
70వ దశకంలో లింగ నిర్ధారణ పరీక్షలు అందుబాటులోకి వచ్చిన తరువాత బాల బాలికల సంఖ్యలో వ్యత్యాసం పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 111 మంది బాలురకి 100 మంది మాత్రమే బాలికలు ఉన్నట్లు తేలింది. తర్వాత వ్యత్యాసం తగ్గుతూ వస్తోంది. కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం 2015 నాటికి బాల బాలికల వ్యత్యాసం 109–100కి తగ్గింది. 2019 నాటికి 108 మంది అబ్బాయిలకు 100 మంది అమ్మాయిలు ఉన్నట్టు వెల్లడైంది.

లింగభేదంతో పాటు శిశు మరణాలు కూడా బాగా తగ్గుతూ వస్తున్నాయి. 1990లో ప్రతి వెయ్యిమంది శిశువులకు 89 మంది మరణించేవారు. అదే 2020 వచ్చే నాటికి 27 మందికి తగ్గింది. ఐరాస ఆధ్యర్యంలో పనిచేస్తున్న గ్రూప్‌ యూఎన్‌ఐజీ 1960 నుంచి ప్రపంచవ్యాప్తంగా శిశు మరణాల సమాచారాన్ని సేకరిస్తోంది. అయితే శిశుమరణాల విషయంలో భారత్‌ పొరుగు దేశాలతో పోలిస్తే వెనుకబడే ఉంది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం ప్రతి వెయ్యిమంది శిశువులకు 24 మంది, నేపాల్‌లో 24, భూటాన్‌లో 23, శ్రీలంకలో ఆరుగురు మరణిస్తున్నారు. చైనాలో 6, అమెరికాలో ఐదుగురు శిశువులు పుట్టుక సమయంలోనే అసువులుబాస్తున్నారు. 

వెళ్లేవారే ఎక్కువ.. 
వలసలు కూడా దేశ జనాభాను ప్రభావితం చేస్తాయి. జనాభాను పెంచుకోవడం కోసం అనేక దేశాలు వలసదారుల్ని, శరణార్థులను ఆహ్వానిస్తున్నాయి. జనాభాను సంపదగా భావిస్తున్నాయి. పనిచేయగల సత్తా ఉన్న వారికి ఆశ్రయం కల్పిస్తున్నాయి. అయితే భారతదేశానికి ఇతర దేశాల నుంచి వలస వస్తున్న వారి కంటే ఇక్కడి నుంచి బయట దేశాలకు వెళుతున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.

ఒక్క 2021లోనే భారత్‌ నుంచి ఇతర దేశాలకు వలస వెళ్లిన వారు మూడు లక్షల మంది ఉన్నారు. అనేక సందర్భాల్లో భారత్‌కు వలస వచ్చిన వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిన దాఖలాలు ఉన్నాయి. 2016లో దాదాపు 68,000 మంది భారత్‌కు శరణుకోరి వచ్చారు. వీరిలో అధిక శాతం మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యాలే. ఏదేమైనా ఈ శతాబ్దం చివరి వరకు భారత్‌ నుంచి వెళ్లే వారి సంఖ్య అధికంగానే ఉంటుందని ఐక్యరాజ్యసమితి జనాభా వివరాల విభాగం అంచనా వేసింది.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top