న్యూయార్క్/వాషింగ్టన్: అంతర్జాతీయ వేదికపై కొత్తగా శాంతి మండలి ఆవిర్భావం ఐక్యరాజ్యసమితికి కూడా మేలు చేసే అంశమేనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఐరాస తన సామర్థ్యానికి తగ్గట్టుగా ఫలితాలు సాధించడంలో విఫలమైందని ఆక్షేపించారు. గురువారం దావోస్ నుంచి అమెరికా తిరిగి వెళ్తూ ఎయిర్‌ఫోర్స్‌వన్ విమానంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘గాజాలో శాంతి స్థాపనకు మాత్రమే కాదు, అంతకుమించి కూడా మరెన్నో అంశాల్లో ఐరాసతో కలిసి గొప్పగా పని చేస్తాం. ఒక సంస్థగా ఐరాసకు ఉన్న సామర్థ్యం అంతా ఇంతా కాదు. కానీ అందుకు తగ్గట్టుగా పని చేయడంలో, ఫలితాలు సాధించడంలో ఐరాస విఫలమైంది. నేను ఏకంగా ఎనిమిది యుద్ధాలు ఆపాను. కానీ దీని గురించి ఐరాసతో ఒక్కసారి కూడా మాట్లాడలేదు’ అన్నారు.
దీనిపై ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ అధికార ప్రతినిధి స్టీఫన్ డుజారిక్ స్పందించారు. ‘ట్రంప్ ప్రకటనలు (శాంతి మండలిని ఉద్దేశిస్తూ) చూశాం. అయితే సార్వత్రిక సభ్యత్వమున్న ఏకైక అంతర్జాతీయ సంస్థ ఐరాసే’ అని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచ శాంతి దిశగా తమ కృషి, ప్రయత్నాలు కొనసాగుతూనే ఉంటాయని చెప్పారు. గాజాలో అత్యధిక పరిమాణంలో మానవతా సాయాన్ని పంచింది ఐరాస మాత్రమేనని స్టీఫన్ గుర్తు చేశారు.


