రాజసాన్‌లో ఆకుకూరలదే రాజసం.. అక్కడ 75% శాకాహారులే
అమెరికా బాటలో భారత్.. అక్కడ 95 శాతం.. ఇక్కడ 76 శాతం
రెండు దశాబ్దాల్లో రివర్స్ గేర్.. 35 శాతం నుంచి 24 % తగ్గిన శాకాహారం
సాక్షి, హైదరాబాద్: ఒకప్పుడు ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్న నానుడి వినిపించేది. ఇప్పుడు ఆ ప్లేట్‌లో అన్నంతో పాటు చికెన్ ముక్క తప్పనిసరి అయిపోయింది. దేశం మొత్తం ‘మాంసాహార భారత్’గా మారిపోతోంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 డేటా చూస్తే షాక్ తినాల్సిందే. దేశంలో 76.6 శాతం మంది నాన్ వెజ్ తింటున్నారు. అంటే ప్రతి 4 మందిలో ముగ్గురికి పైగా మాంసాహారులే.
తెలుగు రాష్ట్రాల్లో నాన్ వెజ్ ప్రియులు
తెలుగు రాష్ట్రాలు నాన్ వెజ్‌కు పెట్టింది పేరు. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 ప్రకారం తెలంగాణలో శాకాహారులు కేవలం 1.3 శాతం మాత్రమే. ఆంధ్రప్రదేశ్‌లో 1.7 శాతం. అంటే 98 శాతం పైగా ప్రజలు వారంలో ఏదో ఒక రోజు మాంసం, చేపలు, గుడ్లు తింటున్నారు. హైదరాబాద్ బిర్యానీ, కోస్తా చేపల పులుసు, రాయలసీమ నాటుకోడి కూర.. ఇవే మన ఫుడ్ ఐడెంటిటీ. నమూనా సర్వే ప్రకారం, తెలంగాణలో 58 శాతం మంది వారానికోసారి చికెన్ తింటే, ఏపీలో 63 శాతం మంది చేపలను ఇష్టపడతారు.
రాజస్థాన్‌లో 75 శాతం మంది శాకాహారులే..
దేశంలో శాకాహారానికి కేరాఫ్ అడ్రస్ రాజస్థాన్. ఇక్కడ 74.9 శాతం మంది పూర్తి శాకాహారులు. హరియాణా 69.2 శాతం, పంజాబ్ 66.7 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మతపరమైన విశ్వాసాలు, జైన–వైష్ణవ సంప్రదాయాలు ఇందుకు కారణం. దేశ సగటు వెజ్ 23.4 శాతం అయితే, పశి్చమ రాష్ట్రాలు మాత్రం 60 శాతం పైగా శాకాహారాన్ని పాటిస్తున్నాయి. భౌగోళికంగా చూస్తే దేశాన్ని రెండుగా చూడొచ్చు. పశి్చమం వెజ్ బాటలో ఉంటే, దక్షిణం–తూర్పు–ఈశాన్య రాష్ట్రాలు నాన్ వెజ్ దారిలో ఉన్నాయి. తమిళనాడు 97.8 శాతం, కేరళ 97.4 శాతం పశి్చమ బెంగాల్ 98.7 శాతం, ఒడిశా 97.3 శాతం నాన్ వెజ్. తీర ప్రాంతాల్లో చేపలు, ఈశాన్యంలో పంది మాంసం, దక్షిణాదిన కోడి, మేక మాంసం ప్రధాన ఆహారం.
అమెరికా బాటలో భారత్
ప్యూ పరిశోధన కేంద్రం 2024 నివేదిక ప్రకారం అమెరికాలో 95 శాతం మంది నాన్ వెజ్ తింటారు. భారత్ కూడా 76.6 శాతంతో అదే దారిలో వెళ్తోంది. ఒకప్పుడు ప్రపంచంలో అత్యధిక శాతం శాకాహారులున్న దేశంగా ఉన్న భారత్ ఇమేజ్ మారుతోంది. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ లెక్కల ప్రకారం, భారత్‌లో తలసరి మాంసం వినియోగం 2006లో 3.2 కేజీలు ఉంటే, 2023 నాటికి 4.8 కేజీలకు పెరిగింది. రెండు దశాబ్దాల్లో శాకాహారుల శాతం 35 నుంచి 24 శాతానికి జారిపోయింది జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–3 జరిగిన 2005–06లో దేశంలో శాకాహారులు 35%. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–5 జరిగిన 2019–21 నాటికి అది 23.4 శాతానికి పడిపోయింది. 2026 నాటికి అంచనా 24%. అంటే 20 ఏళ్లలో 11% మంది శాకాహారం నుంచి మాంసాహారానికి మారారు. ఆదాయం పెరగడం, పట్టణీకరణ, ఫుడ్ డెలివరీ యాప్‌ల విస్తరణ, యువత ఫుడ్ ప్రాధాన్యాలు మారడం దీనికి కారణాలు.
శాకాహారుల శాతం తగ్గుదల(2006–2026)
2006: 35% ████ 2016: 29% ████████████
2021: 23.4% ██ 2026: 24%– █████████
నాడు ‘శాకాహార దేశం’గా..
ఒకప్పుడు ‘శాకాహార దేశం’గా పేరున్న భారత్ ఇప్పుడు ‘మిక్స్‌డ్ ప్లేట్’దేశంగా మారింది. మతం, ప్రాంతం, ఆదాయం.. అన్ని హద్దులూ చెరిగిపోయి నాన్ వెజ్ కల్చర్ విస్తరిస్తోంది. ఇది కేవలం ఆహారపు అలవాటు మార్పు కాదు. వ్యవసాయం, పౌల్ట్రీ పరిశ్రమ, ఆరోగ్యం, పర్యావరణంపై దీని ప్రభావం భారీగా ఉంటుంది. ప్లేట్‌లో మార్పు.. దేశ భవిష్యత్తుకు సూచికగా ఉంటుందని నిఫుణులు అంటున్నారు.



