మన(సు)లో మాట
నాకు 29 ఏళ్లు. ఒక ఎం.ఎన్.సి. లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాను. చిన్నప్పటి నుంచే క్లాసులో పగటినిద్ర పోతూ పాఠాలపై ఎక్కువసేపు దృష్టి నిలిపేవాడిని కాదు. రాత్రి బాగా నిద్రపోయినా ఉదయం క్లాసుకు వెళ్తే మళ్లీ నిద్రపోవాలనిపించేది. అలాగే ప్రతిపనీ చివరి వరకు వాయిదా వేయడం నా అలవాటు. అయినా చదువులో వెనుకబడలేదు. ఐఐటీలో సీటు కూడా సంపాదించాను. కానీ ఉద్యోగ జీవితంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యలు మరింతగా ఇబ్బంది పెడుతున్నాయి. ఆఫీసులో కూడా తరచూ పగటి కలల్లో మునిగిపోతూ ఉంటాను. చేయాల్సిన పనులను చివరి నిమిషం వరకు ప్రారంభించలేకపోతున్నాను.
దాంతో కొన్ని ప్రాజెక్టు ల్లో తప్పులు జరుగుతున్నాయి. ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు ఒకోసారి నాకు బాగా తెలిసిన వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు లేదా ఫోన్ నంబర్లు వెంటనే గుర్తుకు రావడం లేదు. దీనివల్ల నా వ్యక్తిగత జీవితంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నా స్నేహితులు, అలాగే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి కూడా ‘నీకు ఏదో సమస్య ఉన్నట్లుంది. ఒకసారి డాక్టర్‌ను కలవడం మంచిదని చెబుతున్నారు. దాంతో నేను పూణేలో ఒక న్యూరాలజిస్టును సంప్రదించగా ఆయన పరీక్షలు చేసి మెదడులో సమస్యేం లేదు కానీ ఒక సైకియాట్రిస్టును కలవాలని సూచించారు. అసలు నా సమస్య ఏంటి? దానికి చికిత్స ఉందా... వివరించగలరు.
– సుధీర్, పూణే
ఐఐటి లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థలో చదివి, ప్రస్తుతం ఒక మంచి కంపెనీలో ఇంజినీర్ గా పనిచేస్తున్నారంటే మీరు అత్యంత మేధస్సు కలిగిన వారని అర్థమవుతోంది. మీరు న్యూరాలజిస్ట్‌ను కలిసినప్పుడు ఆయన మీ మెదడులో ఎలాంటి నిర్మాణపరమైన లోపాలు లేవని నిర్ధారించి,సైకియాట్రిస్ట్‌ను కలవమని సూచించారన్నారు. మీరు వివరించిన లక్షణాలను బట్టి మానసిక వైద్యశాస్త్రంలో దీనిని హై ఫంక్షనింగ్ ఏడీహెచ్‌డీ అండ్ ఇంటరాక్టివ్ టైప్ గా పిలుస్తారు. అంటే ఏకాగ్రత లోపించడం, పనులు వాయిదా వేయడం వంటి లక్షణాల సమాహారం. చాలామందిలో ఈ సమస్య చిన్న వయసులోనే గుర్తిస్తారు.
మీకున్న తెలివితేటల వల్ల మీరు చిన్నప్పుడు సులువుగా ఈ సమస్యను ఎదుర్కొన్నారు, పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలిగారు. చిన్న వయసు నుండి ఎక్కువగా పగటి కలలు కనడం అనేది ఈ రకం ఏడీహెచ్‌డీలో కనబడే అత్యంత ముఖ్యమైన లక్షణం. డెడ్‌లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మెదడులో ‘అడ్రినలిన్’,‘కార్టిసోల్’ లాంటి స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఎమర్జెన్సీలో మాత్రమే మీ మెదడు ఉత్తేజితమై పనిని పూర్తి చేయగలుగుతుంది. మీ తెలివితేటల వల్ల తక్కువ సమయం విన్నా పరీక్షల ముందు చదివి పాస్ అయిపోయారు. కానీ ఉద్యోగంలో అలా ఉండదు. ఇక్కడ రోజూ పరీక్షే! రోజూ కొత్త సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది.
మీకున్న చివరి నిమిషం వరకు వాయిదా వేసే అలవాటు వల్ల మరింత నష్టం. అయితే మీరు దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆధునిక వైద్య విధానంలో దీనికి అద్భుతమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. ఒక మంచి సైకియాట్రిస్ట్‌ను కలిస్తే, మందుల ద్వారా మెదడులోని రసాయనాలను సమతుల్యం చేస్తే మీ ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతుంది. బిహేవియర్ థెరపీ ద్వారా కూడా మంచి ‘టైమ్ మేనేజ్‌మెంట్ టెక్నిక్స్’ నేర్పుతారు. పనులను వాయిదా వేసే అలవాటును ఎలా తగ్గించుకోవాలో, రోజువారీ పనులను ఎలా ప్లాన్ చేసుకోవాలో ప్రాక్టికల్‌గా గైడ్ చేస్తారు. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పూణేలోనే ఒక మంచి సైకియాట్రిస్ట్ ను సంప్రదించండి. సరైన చికిత్సతో మీ సమస్య పూర్తిగా అదుపులోకి వస్తుంది, మీ మేధస్సుకు తగ్గ స్థానాన్ని మీరు కెరీర్‌లో రీచ్ అవుతారు. ఆల్ ది బెస్ట్!
డా. ఇండ్ల విశాల్ రెడ్డి,
సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ.
మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com


