ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకెళ్తోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ వల్ల పనులు సులభతరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. తాజాగా ఓ యువ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.
టైర్ 1.5 కాలేజీ నుంచి కొత్తగా సాఫ్ట్‌వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్, క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరు కనబరిస్తే రూ.35 లక్షల వార్షిక ప్యాకేజీతో (35 LPA) ప్రీ-ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO) ఇస్తామని కంపెనీ తెలిపింది.
మంచి ప్యాకేజీతో అవకాశం రావడంతో ఆ విద్యార్థి ఎంతో ఆశతో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాడు. తన పూర్తి సామర్థ్యంతో పనిచేశానని, మేనేజర్ నుంచి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అతను చెప్పాడు. అంతేకాకుండా, తనకు తప్పకుండా ప్లేస్‌మెంట్ ఆఫర్ వస్తుందని మేనేజర్ కూడా నమ్మకం కల్పించారని వెల్లడించాడు. కానీ.. చివరి సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
ఇంటర్న్‌షిప్ ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు కంపెనీ మొత్తం 90 మంది ఇంటర్న్‌లకు రిజెక్షన్ మెయిల్స్ పంపించింది. దీంతో రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని కలలు కన్న విద్యార్థుల ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ కంపెనీ సాఫ్ట్‌వేర్ డెవలపర్ల స్థానంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఆ టెక్కీ పేర్కొన్నాడు.
ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏకైక అవకాశం క్యాంపస్ ప్లేస్‌మెంట్ ద్వారా వచ్చిన రూ.6.5 లక్షల ప్యాకేజీ మాత్రమేనని తెలిపాడు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఫ్రెషర్లకు ఇంటర్వ్యూ అవకాశాలు కూడా రావడం లేదని తన బాధను వ్యక్తం చేశాడు.
ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించి, అనుభవం సంపాదించిన తర్వాత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని కొందరు సూచించారు. మొదటి ఉద్యోగం ఎంత పెద్ద ప్యాకేజీతో వచ్చిందన్నది కాకుండా.. అక్కడ నేర్చుకునే విషయాలు కూడా కెరీర్‌లో కీలకమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. మరికొందరు మాత్రం కంపెనీ తీరును తప్పుబట్టారు. రూ.35 లక్షల ఆఫర్ పేరుతో ఇంటర్న్‌ల నుంచి ఎక్కువ కష్టపడేలా చేసి, చివరికి ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు యువ ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.
ఏఐ వల్ల ఉద్యోగుల ఎంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. అనే విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొత్త అవకాశాలు వస్తున్నప్పటికీ, కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు కేవలం ఒకే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడకుండా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు.


