నబీ ట్రిపుల్‌ సెంచరీ | Mohammad Nabi Completes 300 International Wickets For Afghanistan, Joins Rashid Khan In Elite Club | Sakshi
Sakshi News home page

నబీ ట్రిపుల్‌ సెంచరీ

Oct 24 2026 10:46 AM | Updated on Oct 24 2026 10:46 AM

Mohammad Nabi Completes 300 International Wickets For Afghanistan, Joins Rashid Khan In Elite Club

source: X

ఆఫ్ఘనిస్తాన్‌ వెటరన్‌ స్పిన్నర్‌ మొహమ్మద్‌ నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 300 వికెట్లు పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో ఆఫ్ఘానీగా చరిత్రకెక్కాడు. నబీకి ముందు రషీద్‌ ఖాన్‌ (ప్రస్తుతం 477 వికెట్లు) ఈ ఘనత సాధించాడు. 

యూఏఈ వేదికగా జరిగిన ట్రై సిరీస్‌లో నబీ ఈ ఫీట్‌ను అందుకున్నాడు. నిన్న జింబాబ్వేతో జరిగిన ఫైనల్లో 10 ఓవర్లలో కేవలం​ 25 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడంతో నబీ అంతర్జాతీయ వికెట్ల సంఖ్య 300కు (339 మ్యాచ్‌ల్లో) చేరింది. టెస్టుల్లో 8, వన్డేల్లో 181, టీ20ల్లో 111 వికెట్లు నబీ ఖాతాలో ఉన్నాయి.

2009లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన నబీ, బ్యాటింగ్‌లోనూ ఆఫ్ఘనిస్తాన్‌కు కీలక ఆటగాడిగా నిలిచాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 6343 పరుగులు సాధించాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్‌ యూఏఈ ట్రై సిరీస్‌లో అజేయ జట్టుగా నిలిచి టైటిల్‌ కైవసం చేసుకుంది. ఫైనల్‌కు ముందు తమకంటే పటిష్టమైన బంగ్లాదేశ్‌ను ఇంటికి పంపిన ఆఫ్ఘనిస్తాన్‌.. ఫైనల్లో జింబాబ్వేపై సునాయాసంగా గెలిచి విజేతగా అవతరించింది.

ఫైనల్లో తొలుత బౌలింగ్‌ చేసిన ఆఫ్ఘన్‌ జట్టు.. జింబాబ్వేను 43.3 ఓవర్లలో 169 పరుగులకే కుప్పకూల్చింది. నబీతో పాటు రషీద్‌ ఖాన్‌ (3-41), బిలాల్‌ (2-27), ఫజల్‌హక్‌ (2-41), అజ్మతుల్లా (1-6) సత్తా చాటారు. జింబాబ్వే ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే కెప్టెన్‌ సికందర్‌ రజా (68) వల్లే. అతడొక్కడే జింబాబ్వే ఇన్నింగ్స్‌లో రాణించాడు.

అనంతరం ఆఫ్ఘనిస్తాన్‌ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఇబ్రహీం జద్రాన్‌ (70) అజేయ అర్ద సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. అతడికి గుర్బాజ్‌ (36), కెప్టెన్‌ రహ్మత్‌ షా (43) సహకరించారు. బాధ్యతాయుతమైన అర్ద సెంచరీతో రాణించిన జద్రాన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించగా.. 11 వికెట్లతో టోర్నీ ఆధ్యాంతం సత్తా చాటిన రషీద్‌ ఖాన్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు లభించింది. 

ఇదీ చదవండి: ఫైన‌ల్లో జింబాబ్వేపై విజ‌యం.. అఫ్గానిస్తాన్‌దే ట్రై సిరీస్


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement