లండన్ : బ్రిటన్ రాజవంశ మాజీ కోడలు మేఘన్ మార్కెల్ ట్రోలింగ్‌కు గురయ్యారు. తన బ్రాండ్ పేరు మీదున్న టీ పొడి, ఇతర ఉత్పత్తుల్ని అమ్మగా వచ్చిన నికర లాభాన్ని బాలిక విద్యకోసం ఖర్చు పెడతానంటూ ప్రకటించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ప్రఖ్యాత నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్, బ్రిటన్ రాజవంశస్తురాలు డచెస్ ఆఫ్ ససెక్స్ మేఘన్ మార్కెల్ ఇటీవల సంయుక్తంగా ఓ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. బాలికల విద్యను ప్రోత్సహించడం, మహిళా సాధికారతకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఈ ఇద్దరూ చేతులు కలిపినట్లు ప్రకటించారు. అయితే, ఈ క్యాంపెయిన్ వెనుక ఉన్న వ్యాపారం కోణంపై నెటిజన్ల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ప్రముఖ లండన్ క్లారిడ్జెస్ హోటల్‌లో మలాలా యూసఫ్‌జాయ్, మేఘన్ మార్కెల్ భేటీ అయ్యారు. బాలికల విద్యకు మద్దతుగా ‘మలాలా ఫండ్’, మేఘన్‌కు చెందిన ‘ఆర్చివెల్ ఫిలాంత్రోపీస్’, అలాగే ఆమె వ్యాపార బ్రాండ్ ‘యూజ్ ఎవర్’ సంయుక్త భాగస్వామ్యాన్ని ప్రకటించాయి.
ఈ క్యాంపెయిన్‌లో భాగంగా విక్రయించే టీ, ఇతర ఉత్పత్తుల ద్వారా వచ్చే నికర లాభాల్లో 100 శాతం నిధులను బాలికల విద్య కోసం విరాళంగా ఇస్తామని స్పష్టం చేశారు. అయితే, ఇరువురి భాగస్వామ్యంపై నెటిజన్లు పలు సందేహాలను లేవనెత్తుతున్నారు. కేవలం సామాజిక సేవ చేయాలనుకుంటే నేరుగా విరాళాలు ఇవ్వవచ్చు. ఖరీదైన బ్రాండ్ ఉత్పత్తులను ప్రజలతో కొనిపించడం ద్వారా ఆయా బ్రాండ్లకు ప్రచారం, వ్యాపార లాభాలు చేకూర్చేలా ఈ క్యాంపెయిన్ ఉందనే అభిపప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అమ్మకాలపై వచ్చే మొత్తం ఆదాయం కాకుండా కేవలం నికర లాభాల నుంచే విరాళం ఇస్తామనడం, అసలు దీని ద్వారా ఎంత మొత్తం సేకరిస్తారనే దానిపై స్పష్టత లేదని తప్పు పడుతున్నారు. మేఘన్‌కు చెందిన ఈ బ్రాండ్ ఉత్పత్తుల ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, సామాన్య ప్రజలు కొనుగోలు చేసేలా లేవని, దీనివల్ల అసలు లక్ష్యం పక్కదారి పడుతోందని నెటిజన్లు పెదవి విరుస్తున్నారు.
మలాలా లాంటి అంతర్జాతీయ మానవ హక్కుల ఉద్యమకారిణి, నోబెల్ విజేత ఇలాంటి కమర్షియల్ లింక్ ఉన్న క్యాంపెయిన్‌తో జతకట్టడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, బాలికల విద్య కోసం నిధులు సేకరించే ఏ ప్రయత్నమైనా స్వాగతించదగినదే అని మద్దతు దారులు వాదిస్తున్నారు. ఏదేమైనా, ఈ హైప్రొఫైల్ కొలాబరేషన్ ప్రస్తుతం గ్లోబల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.


