గర్వంతో విర్రవీగిన సింహం.. చివరకు ఏమైందంటే? | Funday Children's Special Story On Lion Friendship Moral Telugu Story | Sakshi
Sakshi News home page

గర్వంతో విర్రవీగిన సింహం.. చివరకు ఏమైందంటే?

Nov 8 2026 9:09 AM | Updated on Nov 8 2026 9:09 AM

Funday Children's Special Story On Lion Friendship Moral Telugu Story

ఫండే

పిల్లల కథ

అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో ఒక సింహం ఉండేది. అది తన బలాన్ని చూసుకుని చాలా గర్వపడేది. తనకంటే గొప్పవారు ఎవరూ లేరు అని విర్రవీగేది. చిన్న జంతువులను అస్సలు పట్టించుకునేది కాదు. ఎవరైనా కష్టాల్లో ఉంటే అస్సలు సాయం చేసేది కాదు. ఒకరోజు అడవిలో వేటగాళ్లు ఒక పెద్ద ఉచ్చును పెట్టారు. సింహం గమనించకుండా ఆ ఉచ్చులో చిక్కుకుపోయింది. అది బయటపడటానికి చాలా ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో దాని కాలికి ఒక పెద్ద ముల్లు గుచ్చుకుంది. రక్తం కారుతుంటే సింహం చాలా భయపడిపోయింది. ఎలాగోలా ఉచ్చు నుంచి తప్పించుకుని ఒక గుహలోకి వెళ్లి పడుకుంది.

గాయం వల్ల సింహం అడుగు తీసి అడుగు వేయలేకపోయింది. దానికి చాలా ఆకలి వేసింది, చాలా దాహం వేసింది. కానీ సాయం చేసేవారు ఎవరూ లేరు. ఎందుకంటే సింహం ఎవరితోనూ సరిగ్గా ఉండేది కాదు. అప్పుడు అటుగా ఒక ఎలుగుబంటి మెల్లగా నడుచుకుంటూ వచ్చింది. గుహలో బాధపడుతున్న సింహాన్ని చూసి దగ్గరకు వెళ్లి ఇలా అడిగింది.

‘ఏమైంది సింహరాజా, ఎప్పుడూ గంభీరంగా ఉండే నువ్వు ఎందుకిలా పడి ఉన్నావు?, అడిగింది ఎలుగుబంటి.
‘మిత్రమా, నా కాలికి పెద్ద ముల్లు గుచ్చుకుంది, నొప్పి తట్టుకోలేకపోతున్నాను.’ అంది బాధతో సింహం.
‘అయ్యో! రక్తం కారుతోంది. నీకు చాలా బాధగా ఉన్నట్టుంది.’ కంగారు పడుతూ అంది ఎలుగుబంటి. 
‘అవును, నేను నడవలేను, వేటాడలేను, నాకు చాలా ఆకలిగా ఉంది, దయచేసి నాకు సాయం చేయవా?’ అడిగింది సింహం

దాంతో ‘నీ గర్వం పక్కన పెట్టి అడిగావు కాబట్టి, నేను తప్పకుండా సాయం చేస్తాను.’ అంది ఎలుగుబంటి  
‘నేను చేసిన తప్పు నాకు తెలిసింది, నన్ను క్షమించి ఈ ముల్లు తీసేయవా?’ కోరింది సింహం.
‘సరే, కదలకుండా ఉండు, నేను నా పళ్లతో ఆ ముల్లును మెల్లగా లాగుతాను.’ అంది ఎలుగుబంటి.
‘అలాగే మిత్రమా, నువ్వు చేసే ఈ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను.’ అంది సింహం.
ఎలుగుబంటి మెల్లగా ముల్లును తీసేసింది. సింహానికి కొంచెం హాయిగా అనిపించింది. ఇంతలో అక్కడికి ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు తన తొండంతో చల్లని నీళ్లు తీసుకువచ్చింది. సింహం దగ్గరకు వచ్చి ఏనుగు ఇలా మాట్లాడింది.

‘సింహరాజా, భయం వద్దు, నేను నీ కోసం చల్లని నీళ్లు తెచ్చాను.’ అంది ఏనుగు.
దాంతో ‘ధన్యవాదాలు ఏనుగు గారూ, నా గొంతు ఎండిపోతోంది, నీళ్లు తాగి ప్రాణం లేచివచ్చింది.’ అంది సింహం.
వెంట తెచ్చిన కొన్ని మూలికలు చూపిస్తూ , ‘నీ గాయం తగ్గడానికి కొన్ని పసరు ఆకులు కూడా తెచ్చాను, ఇవి రాస్తే నొప్పి తగ్గుతుంది.’ చెప్పింది ఏనుగు.

‘నువ్వు ఎంత మంచిదానివి, నేను నిన్ను ఎప్పుడూ దూరం పెట్టాను, కానీ నువ్వు నా కోసం వచ్చావు.’ సిగ్గుపడుతూ అన్ని సింహం  
‘కష్టంలో ఉన్నప్పుడు ఒకరికొకరు తోడుండటమే కదా నిజమైన పద్ధతి.’ అంది ఏనుగు.
‘నిజమే, బలం కంటే అందరితో కలిసి ఉండటమే గొప్ప అని ఇప్పుడు తెలిసింది.’ నెమ్మదిగా అంది సింహం.
కొన్ని రోజులు ఎలుగుబంటి, ఏనుగు కలిసి సింహాన్ని కంటికి రెప్పలా కాపాడాయి. సింహానికి గాయం తగ్గిపోయింది. అది మళ్లీ ఆరోగ్యంగా తయారైంది. సింహానికి ఇప్పుడు గర్వం పూర్తిగా పోయింది. తన స్నేహితులైన ఎలుగుబంటిని, ఏనుగును పిలిచి కృతజ్ఞతలు చెప్పింది.

సింహం ప్రేమగా ఎలుగుబంటిని దగ్గరికి తీసుకుని, ‘మిత్రమా, నాడు నీవు ఆ ముల్లు తీయకపోతే, నా కాలు కుళ్లిపోయేది. నువ్వు చేసిన ప్రాణదానానికి నా వందనాలు.’ అంది.
పక్కనే ఉన్న ఏనుగు తొండాన్ని ప్రేమగా నిమురుతూ, ‘మిత్రమా! నా కష్టకాలంలో నీవు చూపిన ప్రేమ, ఇచ్చిన ధైర్యం నా జీవితాంతం గుర్తుంచుకుంటాను.’ అంది.
ఎలుగుబంటి, ఏనుగు నవ్వుతూ ‘ఇప్పుడు నువ్వు మా అందరికీ నిజమైన రాజువి’ అన్నాయి.
- మహంకాళి స్వాతి

'ఉదారస్య తృణం విత్తం శూరస్య మరణం తృణమ్‌
విరక్తస్య తృణం భార్యా నిస్పృహస్య తృణం జగత్‌'
ఉదారుడికి డబ్బు గడ్డిపరకతో సమానం. శూరుడికి మరణం కూడా అంతే! విరక్తి చెందినవాడికి భార్య గడ్డిపరక. జీవితంలో ఆశలు అడుగంటిన వాడికి ఈ ప్రపంచమే గడ్డిపరక.

ఇదీ చదవండి: కార్తీక మాసంలో ఈ వ్రతం ఆచరిస్తే ఇంతటి ఫలితమా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement