brijesh kumar
-
కృష్ణా జలాల పంపిణీ వివాదంపై బ్రిజేష్ ట్రిబ్యునల్ విచారణ వాయిదా
-
‘కృష్ణా’పై కొత్తగా విధి విధానాలు చట్ట విరుద్ధం
సాక్షి, అమరావతి : కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు పంపిణీ చేయడం కోసం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్తగా విధి విధానాలు (టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్) జారీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయడం చట్టవిరుద్ధమంటూ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆక్షేపించారు. విభజన చట్టంలో సెక్షన్–89 ప్రకారం రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేయడానికి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు విధి విధానాలను ఇప్పటికే నిర్దేశించారని గుర్తు చేస్తూ.. మళ్లీ కొత్తగా విధి విధానాలు జారీ చేయడాన్ని అంగీకరించే ప్రశ్నే లేదని తెగేసి చెప్పారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయంగా, అక్రమంగా కొత్తగా జారీ చేసిన విధి విధానాల వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతుందన్నారు. వాటిపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్సెల్పీ) దాఖలు చేసి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని తెగేసి చెప్పారు. బచావత్ ట్రిబ్యునల్ అవార్డే ప్రామాణికమని.. దాని ద్వారా న్యాయబద్ధంగా హక్కుగా రాష్ట్రానికి దక్కిన ప్రతి నీటి బొట్టునూ రక్షించుకుంటామని స్పష్టం చేశారు. మంత్రి ఇంకా ఏమన్నారంటే.. ఇప్పటికే ప్రాజెక్టుల వారీ నీటి కేటాయింపులు బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1976లో 811 టీఎంసీలు కేటాయించింది. ఆ జలాలను ప్రాజెక్టుల వారీగా కేటాయించింది. ఈ కేటాయింపుల ఆధారంగా 2015 జూలై 18–19న ఆంధ్రప్రదేశ్‌కు 512, తెలంగాణకు 299 టీఎంసీలు పంపిణీ చేస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ చేసిన తాత్కాలిక సర్దుబాటుపై రెండు రాష్ట్రాల సీఎస్‌లు సంతకాలు చేశారు. కృష్ణా నది జలాలను పంపిణీ చేయడానికి 2004లో ఏర్పాటైన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010లో తొలి నివేదిక, 2013లో తుది నివేదిక కేంద్రానికి ఇచ్చింది. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ కొనసాగించింది. ఆ రెండు నివేదికలపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తోపాటు బేసిన్ పరిధిలోని రాష్ట్రాలు సుప్రీంకోర్టులో ఎస్సెల్పీలు దాఖలు చేయడంతో వాటిపై స్టే ఇచ్చింది. దాంతో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తుది నివేదికను కేంద్రం నోటిఫై చేయలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు కృష్ణా జలాలను పంపిణీ చేసే బాధ్యతను సెక్షన్–89 ప్రకారం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కే కేంద్రం కట్టబెడుతూ దాని గడువును పొడిగించింది. విభజన చట్టంలో సెక్షన్–89లో ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయాలని, నీటి లభ్యత తక్కువగా ఉన్న సంవత్సరాలలో ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసే నియమావళిని రూపొందించాలని బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌కు కేంద్రం విధి విధానాలు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపులకు రెండు రాష్ట్రాలు కట్టుబడి ఉండాలని కూడా విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొంది. ఆ మేరకే నీటి పంపిణీపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2016 నుంచి విచారణ జరుపుతోంది. రాష్ట్ర హక్కుల పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ కృషి అపెక్స్ కౌన్సిల్ రెండో సమావేశంలో కృష్ణా జలాలను సెక్షన్–3 ప్రకారం రెండు రాష్ట్రాల మధ్య పునఃపంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తే సీఎం వైఎస్ జగన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయబద్ధంగా రాష్ట్రానికి దక్కాల్సిన చుక్క నీటిని వదులుకోబోమని, అన్యాయంగా చుక్క నీటిని వాడుకోబోమని తేల్చి చెప్పారు. సెక్షన్–3 ప్రకారం నీటిని పంపిణీ చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ కేంద్ర జల్ శక్తి శాఖకు 2021లో లేఖ రాయగానే.. దానిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి చట్టబద్ధంగా ట్రిబ్యునల్ కేటాయించిన జలాలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా న్యాయబద్ధంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర జల్ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌కు 2021 ఆగస్టు 17న.. ఆ తర్వాత 2022 జూన్ 25న సీఎం వైఎస్ జగన్ మరోసారి లేఖ రాశారు. రెండు రాష్ట్రాలకు కృష్ణా జలాల పంపిణీకి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు కొత్త విధి విధానాల జారీకి కేంద్ర మంత్రివర్గం ఈ నెల 4న ఆమోదం తెలపడం అశాస్త్రీయమని, దీని వల్ల రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని.. అందువల్ల తదుపరి చర్యలను నిలిపేసి రాష్ట్ర హక్కులను పరిరక్షించాలని ఈ నెల 6న ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. అదే రోజున ఢిల్లీలో హోం శాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశమై ఇదే అంశాన్ని వివరించారు. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన విధి విధానాలను బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నిర్దేశిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయించారు. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం నాడు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నడుంబిగిస్తే.. నేడు సీఎం వైఎస్ జగన్ చిత్తశుద్ధితో పోరాడుతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పై ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈనాడు రామోజీరావు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సీఎం వైఎస్ జగన్‌పై విషం చిమ్ముతూ తప్పుడురాతలు అచ్చేస్తున్నారు. వారి విషపురాతలను ప్రజలు నమ్మరు. టీడీపీ, జనసేన నేతలు చేస్తున్న విమర్శలను జనం పట్టించుకోరు. పవన్ కళ్యాణ్, లోకేశ్ పొలిటికల్ బఫూన్లు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు కుమారుడు లోకేష్ లు ఎప్పుడు ఏం మాట్లాడతారో ఆయా పార్టీల వారికే తెలియక జట్టు పీక్కుంటున్నారు. పెడనలో ఎన్డీయే నుంచి బయటకొచ్చానని ప్రకటించిన పవన్.. ముదినేపల్లికి వచ్చే సరికి మాట మార్చారు. జైలులో చంద్రబాబును ములాఖత్‌లో కలిసి బయటకొచ్చాక.. చంద్రబాబు అవినీతిని ఇంటింటా ప్రచారం చేస్తానని లోకే‹శ్ ప్రకటించారు. అందుకే వారిద్దరినీ పొలిటికల్ బఫూన్లుగా ప్రజలు చూస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక కుంభకోణాల ద్వారా ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరూపితమైంది కాబట్టే చంద్రబాబు జైల్లో ఉన్నాడు. అలా జైల్లో ఉన్న చంద్రబాబును కలిశాక టీడీపీతో పొత్తును పవన్ ప్రకటించారంటే.. ఆయన అవినీతిలో ఈయనకు వాటా ఉన్నట్లు స్పష్టమవుతోంది. బలహీనపడ్డ టీడీపీ తన మద్దతుతో బలం పుంజుకుంటుందని పొత్తు పెట్టుకున్న జనసేన.. క్షేత్ర స్థాయిలోకి వచ్చే సరికి చతికిలపడింది. అవనిగడ్డ, పెడన, ముదినేపల్లిలలో పవన్ సభలు అట్టర్ ఫ్లాప్ కావడమే అందుకు నిదర్శనం. టీడీపీతో పొత్తు ప్రజలెవరికీ ఇష్టం లేకపోవడంతో జనసేన బలహీన పడిందన్న వాస్తవాన్ని పవన్ తెలుసుకోవాలి. -
ఇక నీటి కేటాయింపుల్లేవ్
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులను జరపమని, ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిర్దిష్ట కేటాయింపులు జరగని పక్షంలో ఆ మేరకు కేటాయింపులు మాత్రమే చేస్తామని బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్–2 మరోసారి స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) 1956లోని సెక్షన్ –3, 5 కింద కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్ ఇప్పటికే ముగించిందని తెలిపింది. ఏపీ పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89 కింద ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్‌కుమార్ వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు జరుపుతూ 2022లో తెలంగాణ జారీ చేసిన జీవో నెం.246ను సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన ఇంటర్ లొకేటరీ అప్లికేషన్‌పై శుక్రవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్–2 విచారణ నిర్వహించింది. మైనర్ ఇరిగేషన్లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల తరలింపులకు బదులుగా మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి పథకానికి తెలంగాణ కేటాయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించగా, నీటి కేటాయింపులపై నిర్ణయాధికారం తమకు లేదని బ్రిజేష్ కుమార్ ఆయన వాదనలను తోసిపుచ్చారు. అపెక్స్ కౌన్సిల్‌కు నిర్ణయాధికారం లేదని, కేవలం మధ్యవర్తి పాత్రపోషించాల్సి ఉంటుందని పున ర్విభజన చట్టంలోని సెక్షన్ 89ను ఉటంకిస్తూ ఏపీ న్యాయవాది పేర్కొనగా, అపెక్స్ కౌన్సిల్ విషయాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్ చేయవచ్చు అని బ్రిజేష్ తెలిపారు. ప్రాజెక్టుల వారీ గా కేటాయింపులు జరపనిపక్షంలో ఆపరేషనల్ ప్రొ టోకాల్స్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటూ తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న చేతన్ పండిత్ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఏపీ ఆరోపణను తోసిపుచ్చిన తెలంగాణ న్యాయవాది మిషన్ కాకతీయ ద్వారా తెలంగాణ 89.15 టీఎంసీలను వినియోగిస్తున్నట్టు జీవోలో పేర్కొందని, వాస్తవానికి 175 టీఎంసీలను వాడుతోందని ఏపీ న్యాయవాది పేర్కొన్నారు. అయితే, 44టీఎంసీలను మాత్రమే మైనర్ ఇరిగేషన్ ద్వారా వాడుతున్నామని, మిగిలిన 45టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పునః కేటాయింపులు జరిపినట్టు తెలంగాణ కౌంటర్ అఫిడవిట్లో పేర్కొంది. కేఆర్ఎంబీ, కృష్ణా బోర్డుకు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను తె లంగాణ సమర్పించలేదని ఏపీ చేసిన ఆరోపణను తెలంగాణ న్యాయవాది తోసిపుచ్చారు. ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించామని, పరిశీలన దశలో ఉందని అన్నారు. కాగా, పాలమూరు ఎత్తిపోతల పనులను కొనసాగిం చేందుకు ఇటీవల సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ప్రాజెక్టు తాజా పురోగతిపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. -
చెరిసగం పంచాలి..
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలను ప్రస్తుత వాటర్ ఇయర్లో రెండు తెలుగు రాష్ట్రాలకు చెరి సగం పంచాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును తెలంగాణ కోరింది. 2021–22 వాటర్ ఇయర్లో తాత్కాలిక పద్ధతిలో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు 50ః50 నిష్పత్తిలో నీటి పంపకాలు చేయాలని విన్నవించింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు తెలంగాణ ఇరిగేషన్ ఈఎన్సీ మురళీధర్ మంగళవారం లేఖ రాశారు. ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యునల్ నీటి పంపకాలు చేయలేదని, ఉమ్మడి ఏపీకి కేటాయించిన నీటినే రెండు తెలుగు రాష్ట్రాలు పంచుకున్నాయని గుర్తుచేసిన ఆయన.. బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులను చేసేవరకు తాత్కాలిక పద్ధతిలోనే నీటి పంపకాలు చేయాలని లేఖలో పేర్కొన్నారు. లేఖలో పేర్కొన్న విషయాలు..: కృష్ణా బోర్డు 12వ భేటీలో తెలంగాణ, ఏపీల మధ్య 34ః66 నిష్పత్తిలో ఏడాదికి నీటి పంపకాలు చేయడానికి అంగీకరించాం. మైనర్ ఇరిగేషన్ వినియోగం, పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి నీళ్లు, ఆవిరి నష్టాలను ఈ నిష్పత్తిలో లెక్కించకూడదని నిర్ణయించాం. ►పరీవాహకం, సాగు యోగ్యమైన భూమి, కరువు పీడిత ప్రాంతాలు, జనాభా ఆధారంగా చూస్తే కృష్ణా జలాల్లో తెలంగాణ, ఏపీల వాటా 70.9ః 29.2 శాతంగా ఉండాలి. దీన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ తన అవసరాలను 771 టీఎంసీలుగా పేర్కొంటూ బ్రిజేశ్ ట్రిబ్యునల్ ముందు డిమాండ్ పెట్టాం. 1976లోని బచావత్, 2013 బ్రిజేశ్ ట్రిబ్యునల్స్ బేసిన్ అవతలి ప్రాంతాలకు అనుమతించడానికి ముందు బేసిన్ లోపలి ప్రాంతాలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించాయి. ►బ్రిజేశ్ ట్రిబ్యునల్ తీర్పు అవార్డులోకి వచ్చేవరకు కృష్ణా జలాల్లో లభ్యతగా ఉండే నీటిని 50ః50 నిష్పత్తిన పంచాలి. ►ఆమోదం, గుర్తింపు లేని ప్రాజెక్టుల ద్వారా శ్రీశైలం నుంచి ఏపీ రోజుకు 4.7 టీఎంసీల మేర నీటిని మళ్లించుకుంటోంది. మళ్లించిన కృష్ణా నీటిని నిల్వ చేసుకునేందుకు పెన్నా, ఇతర బేసిన్లలో 300 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు ఉన్నాయి. తెలంగాణకు మాత్రం రోజుకు 0.28 టీఎంసీల నీటిని మాత్రమే ఎత్తిపోతల ద్వారా తీసుకునే సామర్థ్యం ఉంది. ►బేసిన్ అవతలికి కృష్ణా నీటి తరలింపును రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం వ్యతిరేకించారు. మొదట బేసిన్‌లోని బీడు భూములకు నీళ్లిచ్చాకే బేసిన్ బయటకు తరలించాలని డిమాండ్ చేశారు. ►తెలంగాణ ఆవిర్భవించిన ఏడేళ్లు గడిచినా కృష్ణా బేసిన్‌లోని తెలంగాణ భూములకు నీరు రాలేదు. కృష్ణా నీళ్లను ఏపీ వేరే బేసిన్‌కు తరలిస్తోంది. -
ఆల్మట్టిపై మళ్లీ కర్నాటకం
బిరబిరా సాగే కృష్ణమ్మను నిర్బంధించి తెలుగు రాష్ట్రాల నోట్లో మట్టి కొట్టేందుకు రంగం సిద్ధమైంది! అప్పర్ కృష్ణా మూడో దశ పనులను చేపట్టేందుకు అనుమతి కోరుతూ గురువారం అర్ధరాత్రి సీడబ్ల్యూసీ వెబ్సైట్లో ఆ ప్రాజెక్టు డీపీఆర్‌ను కర్ణాటక సర్కారు అప్లోడ్ చేసింది. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచడం వల్ల అదనంగా 130 టీఎంసీలను నిల్వ చేసుకోవడంతోపాటు మొత్తం 174 టీఎంసీలను వినియోగించుకోవడం ద్వారా బాగల్కోట్, బీజాపూర్, గదగ్, కొప్పళ, యాదగిరి, రాయచూర్ జిల్లాల్లో 14.70 లక్షల ఎకరాల (5.94 లక్షల హెక్టార్ల)కు నీళ్లందిస్తామని డీపీఆర్‌లో పేర్కొంది. ఈ పనులకు 2014–15 ధరల ప్రకారం రూ.51,148.94 కోట్లు వ్యయం అవుతుందని తెలిపింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచడం వల్ల 30,579.25 హెక్టార్ల భూమి ముంపునకు గురవుతుందని, దీంతోపాటు ప్రధాన కాలువలు, పిల్ల కాలువల పనులకు 26,003 హెక్టార్లను సేకరించాల్సి వస్తుందని పేర్కొంది. ఈ పనులు చేపట్టడానికి అనుమతి ఇవ్వాలని కోరింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్(కేడబ్ల్యూడీటీ–2) తీర్పును ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. దీనిపై విచారణ కొనసాగుతుండటంతో ఆ తీర్పును సుప్రీం కోర్టు ఇప్పటిదాకా నోటిఫై చేయలేదు. అయితే సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడంలో భాగంగా అప్పర్ కృష్ణా మూడో దశ పనులకు కర్ణాటక శ్రీకారం చుట్టడాన్ని నీటిపారుదలరంగ నిపుణులు తప్పుబడుతున్నారు. కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాభావంతో నీటి లభ్యత తగ్గిపోయి జూలై ఆఖరుకుగానీ తెలుగు రాష్ట్రాలకు జలాలు చేరడం లేదని, ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరు మొదటి వారానికిగానీ కృష్ణా వరద దిగువకు వచ్చే అవకాశం ఉండదని స్పష్టం చేస్తున్నారు. కృష్ణాలో అక్టోబర్ వరకూ మాత్రమే వరద ఉంటుంది. ఈ లెక్కన చూస్తే తెలుగు రాష్ట్రాలకు కేటాయించిన నికర జలాలు 811 టీఎంసీలు కూడా దక్కే అవకాశం ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఉత్తర్వులు తుంగలోకి.. కృష్ణా నదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 (70 టీఎంసీలు పునరుత్పత్తి) టీఎంసీలు ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ (కేడబ్ల్యూడీటీ–2) మహారాష్ట్రకు 585, కర్ణాటకకు 734, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయిస్తూ 1976లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు గడువు ముగియడంతో కృష్ణా జలాల పునఃపంపిణీకి బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో కేడబ్ల్యూడీటీ–2ను కేంద్రం ఏర్పాటు చేసింది. బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులను కొనసాగించిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్.. నీటి లభ్యత 75 శాతానికి 65 శాతానికి మధ్య ఉన్న 448 టీఎంసీలను మూడు రాష్ట్రాలకు పునఃపంపిణీ చేసింది. ఇందులో కర్ణాటకకు 177, ఉమ్మడి ఏపీకి 190, మహారాష్ట్రకు 81 టీఎంసీలను అదనంగా కేటాయించింది. ఈ క్రమంలో ఆల్మట్టి ఎత్తును 519.6 నుంచి 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కర్ణాటకకు అనుమతి ఇస్తూ 2013 నవంబర్ 29న బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును ఉమ్మడి ఏపీ ప్రభుత్వం నిరసిస్తూ సుప్రీం కోర్టులో సవాల్ చేసి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో ఈ తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సర్కార్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్లో తెలంగాణ సర్కార్ ఇంప్లీడ్ అయ్యింది. సుప్రీం కోర్టు స్టే విధించిన నేపథ్యంలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును కేంద్రం నోటిఫై చేయలేదు. అయితే కర్ణాటక సర్కార్ సుప్రీం కోర్టు ఉత్తర్వులను తుంగలో తొక్కి ఆల్మట్టి ఎత్తు పెంచడానికి సిద్ధమవడం గమనార్హం. వ్యూహాత్మకంగా అడుగులు.. ఆల్మట్టి ఎత్తు పెంపుపై కర్ణాటక సర్కార్ ఆది నుంచి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. గతేడాది జూలై 7న కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి రమేష్ జార్ఖహోలి ముంబైలో మహారాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి జయంత్పాటిల్తో సమావేశమై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేసేలా కేంద్రాన్ని కోరడం, ఆల్మట్టి ఎత్తు పెంచడంపై చర్చించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఇద్దరు మంత్రులు కేంద్రానికి వి/æ్ఞప్తి చేశారు. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కేంద్రానికి ప్రతిపాదనలు పంపాయి. ఆల్మట్టి ఎత్తు పెంచడం వల్ల ముంపునకు గురయ్యే మహారాష్ట్రలోని ప్రాంతాలపై ఆ రాష్ట్రంతో చర్చించిన కర్ణాటక ముంపు భూములను వేగంగా సేకరిస్తోంది. ఆల్మట్టి ఎత్తు పెంపుతో ముంపునకు గురయ్యే 30,579.25 హెక్టార్ల భూ సేకరణ, 23 ముంపు గ్రామాల ప్రజల పునరావాసానికి రూ.17 వేల కోట్లతో పనులను ప్రారంభించింది. కృష్ణా నదికి వరదలు ప్రారంభమయ్యేలోగా డ్యామ్ ఎత్తు పెంచే పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి శరవేగంగా చేపట్టే దిశగా అడుగులు వేస్తోంది. సాగునీటికే కాదు.. తాగునీటికీ కటకటే.. ఆల్మట్టి ప్రస్తుత సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా ఎత్తు పెంచితే నిల్వ సామర్థ్యం 259.72 టీఎంసీలకు పెరుగుతుంది. ఆల్మట్టికి దిగువన ఉన్న నారాయణపూర్ నిల్వ సామర్థ్యం 37.65 టీఎంసీలు. ఈ రెండు జలాశయాలు నిండాలంటే 297.37 టీఎంసీలు అవసరం. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల కాలువలు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు ఎత్తిపోతల మొదటి దశ, రెండో దశల ద్వారా రోజుకు సగటున 2.5 నుంచి మూడు టీఎంసీల వరకూ వినియోగించుకునే సామర్థ్యం తెలంగాణకు ఉంది. బేసిన్లో సాధారణ స్థాయిలో వర్షాలు కురిసినప్పుడు జూలై నాలుగో వారం లేదా ఆగస్టు మొదటి వారానికి జూరాల, శ్రీశైలానికి వరద ప్రవాహం చేరుతోంది. ఆల్మట్టి ఎత్తు పెంచితే సెప్టెంబరుకుగానీ వరద ప్రవాహం చేరే అవకాశం ఉండదని నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వర్షాభావ సమయాల్లో తెలుగు రాష్ట్రాలకు నికర జలాలు కాదు కదా ఎగువ నుంచి చుక్క నీరు కూడా చేరే అవకాశం ఉండదని హెచ్చరిస్తున్నారు. 2015–16లో శ్రీశైలానికి 55 టీఎంసీలు మాత్రమే రావడాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఈ పాపం చంద్రబాబుదే.. కర్ణాటక సర్కారు ఆల్మట్టి డ్యామ్ పనులను 1963లో ప్రారంభించగా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ అభ్యంతరం వ్యక్తం చేయడం, న్యాయస్థానాల్లో వివాదాల వల్ల ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయి. 1996 లోక్‌సభ ఎన్నికల్లో చంద్రబాబు ఛైర్మన్‌గా ఉన్న సంకీర్ణ కూటమి(యునైటెడ్ ఫ్రంట్) సర్కార్ కేంద్రంలో కొలువుతీరింది. అప్పటి కర్ణాటక సీఎం హెచ్డీ దేవేగౌడ యునైటెడ్ ఫ్రంట్ మద్దతుతో ప్రధానమంత్రి పదవిని చేపట్టి ప్రపంచ బ్యాంకు, ఏఐబీపీ(సత్వర సాగునీటి ప్రయోజన కల్పన పథకం) నిధులతో ఆల్మట్టి డ్యామ్ పనుల్లో వేగం పెంచారు. ఈ వ్యవహారంపై అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం చంద్రబాబు చూసీచూడనట్లు ఉదాశీనంగా వ్యవహరించడంతో ఆల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్లకు కర్ణాటక పెంచేసింది. 2002 నుంచి ఆల్మట్టిలో 129.72 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచేందుకు 2002లో కర్ణాటక సర్కార్ ప్రయత్నించినా చంద్రబాబు పట్టించుకోలేదు. చివరకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్కార్ సుప్రీం కోర్టును ఆశ్రయించడంతో ఆల్మట్టి ఎత్తును 519.6 మీటర్లకే పరిమితం చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పానని, దేవేగౌడను ప్రధానిగా చేశానని చెప్పుకునే చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు చిత్తశుద్ధితో వ్యవహరించి ఉంటే ఈ రోజు ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచే అవకాశం కర్ణాటకు ఉండేది కాదని న్యాయ, నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. –రామగోపాలరెడ్డి ,సాక్షి ప్రతినిధి ఆలమూరు -
బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ రద్దు!
► కేంద్రం తెచ్చిన కొత్త బిల్లు నేపథ్యంలో అవకాశం ► 70 ఏళ్ల వయసు నిబంధనతో జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు తప్పని ఉద్వాసన ► అదే జరిగితే కొత్త ట్రిబ్యునల్ ముందుకు కృష్ణా జలాల వివాదం సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను త్వరితగతిన పరిష్కరించేందుకు కేంద్రం ఇటీవల లోక్‌సభలో ప్రవేశపెట్టిన అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల సవరణ బిల్లు–2017 పార్లమెంటు ఆమోదం లభిస్తే కృష్ణా జల వివాదాలను విచారిస్తున్న బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ పూర్తిగా రద్దయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య పదేళ్లుగా కొనసాగుతున్న కృష్ణా వివాదాలపై విచారణ కేంద్రం తెచ్చే కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతుంది. ఏళ్ల తరబడి విచారణ జరుగుతున్నా... దేశంలో ప్రస్తుతమున్న కృష్టా సహా ఎనిమిది ట్రిబ్యునళ్లు అంతర్రాష్ట్ర జల జగడాలపై ఏళ్ల తరబడి విచారణ జరుపుతున్నా వివాదాలకు పరిష్కారం దొరకట్లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుత ట్రిబ్యునళ్లను రద్దు చేసి ఒకే శాశ్వత ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే సవరణ బిల్లును కేంద్రం ఈ నెల 14న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇందులో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రతిపాదిత శాశ్వత ట్రిబ్యునల్ మూడేళ్లలో తీర్పు వెలువరించాల్సి ఉంటుంది. అయితే ‘ప్రతిపాదిత చట్టం అమల్లోకి రాగానే పాత ట్రిబ్యునళ్లన్నీ రద్దవుతాయి. వాటి పరిధిలోని వివాదాలన్నీ కొత్త ట్రిబ్యునల్‌కు బదిలీ అవుతాయి’ అని బిల్లులో స్పష్టంగా ఉంది. దీనికి ఎలాంటి సవరణలు లేనట్లయితే ప్రస్తుతమున్న కృష్ణా సహా కావేరీ, వంశధార, మహదాయి, రావి వంటి ట్రిబ్యునళ్లు రద్దవుతాయి. అలాగే ప్రస్తుత ట్రిబ్యునళ్ల చైర్మన్లు, సభ్యుల వయసు కొత్త చట్టం వచ్చే నాటికి 70 ఏళ్లు నిండితే వారి పదవీకాలం సైతం మూడు నెలల్లో ముగుస్తుందని బిల్లులో కేంద్రం పేర్కొంది. ఈ నిబంధన కూడా 70 ఏళ్లు పైబడిన జస్టిస్ బ్రిజేశ్‌కుమార్‌కు ఉద్వాసన పలికేలా ఉంది. అయితే ‘ఇప్పటికే అమల్లో ఉన్న ట్రిబ్యునళ్లు నీటి వివాదాలపై విచారణ పూర్తి చేసి కేటాయింపులు జరిపినట్లయితే కొత్త ట్రిబ్యునల్ ఆ వివాదాలను పునర్విచారించదు’ అని బిల్లులో కేంద్రం పొందుపరిచిన మరో నిబంధన గందరగోళానికి తావిచ్చేలా ఉంది. కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపులను పూర్తి చేసినా తెలంగాణ కొత్త రాష్ట్రంగా అవతరించడం, ట్రిబ్యునల్ కేటాయింపులపై రాష్ట్రం అప్పీల్ చేయడంతో ఆ కేటాయింపులు అవార్డు కాలేదు. ఈ దృష్ట్యా ఇక్కడ విచారణ పూర్తయినట్లా లేదా కొనసాగుతున్నట్లా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌లో తమకు న్యాయం జరిగే అవకాశం లేకపోవడంతో శాశ్వత ట్రిబ్యునల్ ఏర్పాటును గట్టిగా సమర్థించిన తెలంగాణకు ఇది పెద్ద ఉపశమనమేనని నీటిపారుదల వర్గాలు అంటున్నాయి. -
మీ వాదనలు సరిగా లేవు
- ఏపీ, తెలంగాణలను ఉద్దేశించి ట్రిబ్యునల్ వ్యాఖ్య - 8వ అంశంపై వాదనలు సమర్థనీయంగా లేవు - తెలంగాణ ప్రయోజనాలు ఉమ్మడి ఏపీ పట్టించుకోలేదన్న వాదన తిరస్కరణ - చట్టంలో ఆస్తుల విభజనను పలు సెక్షన్లు సూచిస్తున్నాయి - అందుకే నీటి పంపకాలు కూడా రెండు రాష్ట్రాల మధ్యే - కర్ణాటక, మహారాష్ట్ర వాదనల్లో బలం ఉందన్న ట్రిబ్యునల్ సాక్షి, న్యూఢిల్లీ: ‘మీరు లేవనెత్తిన అంశాలపై మీ వాదనలు సమర్థనీయంగా లేవు.. మీరు సరిగా వివరించలేకపోయారు’ ఓ సందర్భం లో తెలంగాణ, ఏపీలను ఉద్దేశించి స్వయంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ చేసిన వ్యాఖ్యలివీ! కృష్ణా జలాలను ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్-89 ప్రకారం నాలుగు రాష్ట్రాలకు పంచాలంటూ ఇరు రాష్ట్రాలు చేసిన వాదనల్లో ఏ ఒక్కటీ ట్రిబ్యునల్‌ను మెప్పించలేపోయాయి. ఆ వాదనలేవీ నిలబడలేని తీరుకు 124 పేజీల తీర్పు అద్దం పట్టింది. సెక్షన్-89 పరిధిపై విచారణ జరుగుతున్నప్పుడు అన్ని రాష్ట్రాల సమ్మతితో 9 అంశాలపై విచారణ జరగాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిదో అంశంపై ఏపీ, తెలంగాణలు తాము లేవనెత్తిన అంశంపై సమర్థనీయంగా వాదించలేకపోయాయని ట్రిబ్యునలే తీర్పులో పేర్కొంది. ‘‘ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రాజెక్టులకు నిర్దిష్ట కేటాయింపులు జరపకుండా.. తెలంగాణ, ఏపీ ప్రాజెక్టులకే కేటాయింపులు జరి పితే.. తక్కువ నీటి ప్రవాహం ఉన్నప్పుడు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటొకాల్ నిర్ధారణ సాధ్యమవుతుందా’’ అన్న అంశాన్ని ఏపీ, తెలంగాణ లేవనెత్తడంతో దీన్ని 8వ అంశంగా చేర్చా రు. దీనికి ట్రిబ్యునల్ తీర్పులో సమాధానమిస్తూ.. ‘‘వాస్తవానికి ఈ అంశంపై ఎక్కువగా వాదనలు చేయలేదు. అలాగే ఈ అంశానికి మద్దతుగా ఏ వివరణా లేదు. అందువల్ల ఈ వాదనను నిలబెట్టడానికి మా వద్ద ఎలాంటి కారణం లేదు’’ అని పేర్కొంది. ఇలాంటి కీలక అంశంపై కూడా సవివరంగా వాదించకపోవడం అంతిమంగా ఉభయ రాష్ట్రాలు నష్టపోయే పరిస్థితికి దారితీసింది. ఆస్తుల విభజనే ప్రాతిపదికగా: విచారణ సందర్భంగా ట్రిబ్యునల్... పలుమార్లు ఆస్తులు పంచుకున్న రీతిలోనే నీటిని పంచుకుంటే ఎలా ఉంటుందని వ్యాఖ్యానిస్తూ వచ్చింది. కానీ ఈ వ్యాఖ్యలను నిశితంగా పరిగణనలోకి తీసుకుని ఏపీ, తెలంగాణలు బలమైన వాదనలు వినిపించడంలో విఫలమయ్యాయి. తీర్పు కూడా ఈ వ్యాఖ్యలను బలపరుస్తూ ఆస్తుల మాదిరే నీటిని పంచుకోవాలన్న ప్రస్తావనలతో ఉంది. కర్ణాటక తరపున సీనియర్ న్యాయవాది అనిల్ దివాన్ చేసిన వాదనల్లో బలం కనిపించిందని పేర్కొంది. సెక్షన్ 48 రెండు రాష్ట్రాలు భూములు, వస్తువులను, అలాగే సెక్షన్ 49 నగదు, బ్యాంకు నిల్వలను, సెక్షన్ 51 రుణాలు తదితరాలను, సెక్షన్ 52 పెట్టుబడుల్ని పంచుకోవాలని ఆయన వాదించారు. ఇలా సెక్షన్ 67 వరకు ఇలాంటి నిబంధనలే ఉన్నాయంటూ ఆయన చేసిన వాదనలను పరిగణనలోకి తీసుకున్నట్టు ట్రిబ్యునల్ తీర్పులో అవగతమవుతోంది. అలాగే నీటి వివాదాలపై అపెక్స్ కౌన్సిల్ ఏర్పాటులో ఏపీ, తెలంగాణకే చోటుందని, ఇతర రాష్ట్రాలకు ఇందులో చోటు లేదని మహారాష్ట్ర తరపు సీనియర్ న్యాయవాది చేసిన వాదనలను కూడా పరిగణనలోకి తీసుకుంది. సెక్షన్ 89లో ‘సక్సెసర్ స్టేట్స్’ అన్న ప్రస్తావన ఉందని, దానికి కేవలం కొత్త రాష్ట్రాలని మాత్రమే అర్థమని అంధ్యార్జున చేసిన వాదనలను ప్రస్తావించింది. అలాగే ఇతర రాష్ట్రాలు విడిపోయినప్పుడు విడిపోయిన రాష్ట్రాలకు సంబంధించి మాత్రమే కేటాయింపులు జరిగాయి తప్ప ఏ ఇతర రాష్ట్రాలను ఆ వివాదంలో చేర్చలేదన్న కర్ణాటక, మహారాష్ట్ర వాదనలను తీర్పు ప్రముఖంగా ప్రస్తావించింది. తెలంగాణ వెనుకబాటుపై ఏమందంటే వెనకబాటుతనం, నీళ్ల కోసమే రాష్ట్ర ఏర్పాటు, తమ ప్రాంత ప్రయోజనాలను ఉమ్మడి రాష్ట్రం ట్రిబ్యునల్ ముందు వినిపించకపోవడం వంటి అంశాలను తెలంగాణ ప్రస్తావించిందని ట్రిబ్యునల్ పేర్కొంది. అయితే ఇవేవీ సెక్షన్ 89ను అన్ని రాష్ట్రాలకు వర్తింపజేయాలన్న వాదనలకు బలం చేకూర్చేలా లేవని స్పష్టం చేసింది. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా తెలంగాణ ప్రయోజనాలను కూడా వినిపించిందని పేర్కొంది. తెలంగాణలో ఎగువ ప్రాంతానికి 20 టీఎంసీల నీటిని కేటాయించాలని ఉమ్మడి ఏపీ చేసిన వాదనలను ఈ సందర్భంగా ప్రస్తావించింది. దీంతో ఈ వాదనలను లోతుగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదనిపించిందని, ఒకవేళ కొన్ని నీళ్లు ఆంధ్రా ప్రాంతానికి ఎక్కువగా వచ్చినా, తెలంగాణకు తక్కువగా వచ్చినా.. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల సమయంలో సర్దుబాటు చేసుకోవచ్చంది. నీటి కోసమే తెలంగాణ ఏర్పడిందన్న వాదనలను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. దీన్ని బలపరస్తూ ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని ‘కారణాలు, లక్ష్యాలు’ శీర్షిక కింద కూడా కనీస ప్రస్తావన లేదంది. ట్రిబ్యునల్‌కు ఆ అధికారం ఉంది విచారణకు ముందు అన్ని రాష్ట్రాల సమ్మతితో రూపొందించుకున్న 9 అంశాలతో పాటు విచారణ సందర్భంగా తలెత్తిన మరో అంశంపై కూడా ట్రిబ్యునల్ వివరణ ఇచ్చింది. సెక్షన్ 89 పరిధి ఏంటన్న అంశాన్ని ట్రిబ్యునల్ ఎలా విచారిస్తుందని, కేవలం నీటి వివాదాన్ని మాత్రమే పరిష్కరిస్తుందని చేసిన వాదనలపై తీర్పులో సుదీర్ఘ ప్రస్తావన చేసింది. భవిష్యత్తులో తలెత్తే వివాదాన్ని కూడా పరిష్కరించే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని, అందువల్లే ట్రిబ్యునల్ పరిధిని నిర్వచించేందుకు విచారణ చేపట్టినట్టు పేర్కొంది. -
నీటి కేటాయింపులు మళ్లీ జరపాలి
* కృష్ణా జలాల పంపిణీ నాలుగు రాష్ట్రాల సమస్య * బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదనలు * తదుపరి విచారణ మే 9, 10, 11కు వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం... కృష్ణా జలాల పంపిణీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితం కాదని, నది పరీవాహక ప్రాంతంలోని అన్ని రాష్ట్రాల ప్రాజెక్ట్‌లకు జలాలను మళ్లీ పంచాలని ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాదిఏకే గంగూలీ వాదించారు. కృష్ణా జలాల పంపిణీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు గురువారం కృష్ణా నది పరీవాహక రాష్ట్రాల వాదనలు కొనసాగాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మాత్రమే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రలో కృష్ణా నదిపై ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లకు కొత్తగా నీటి కేటాయింపులు జరగాలని ఏకే గంగూలీ వాదించారు. కృష్ణా నది 4 రాష్ట్రాల్లో ప్రవహిస్తోందని, అందువల్ల ఇది 4 రాష్ట్రాల సమస్య అని వెల్లడించారు. అసంపూర్తిగా ముగిసిన వాదనలు: గతంలో పంజాబ్ విభజన సమయంలో రావి, బియాస్ నదుల జలాల పంపకానికి ట్రిబ్యునల్ ఏర్పాటును విభజన చట్టంలోనే పొందుపర్చారని గంగూలీ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని రూపొందించే సమయానికి కృష్ణా నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ పని చేస్తోందని, అందువల్ల ట్రిబ్యునల్ అంశాన్ని చట్టంలో ప్రస్తావించలేదన్నారు. ట్రిబ్యునల్ ముందు గంగూలీ వాదన గురువారం అసంపూర్తిగా ముగిసింది. తదుపరి విచారణను మే 9, 10, 11 తేదీల్లో చేపడతామని ట్రిబ్యునల్ చైర్మన్ బ్రిజేష్ కుమార్ ప్రకటించారు. అంతకు ముందు మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున వాదనలు వినిపించారు. -
వివాదాలు అంతులేకుండా కొనసాగరాదు
కృష్ణా జలాల వివాదం కేసుల్లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు తెలంగాణ, ఏపీ పిటిషన్లపై విచారణ విషయాలు తిరగదోడుతూ వెనక్కి వెళ్లలేం ఎక్కడో ఒకచోట వివాదాలు పూర్తవ్వాలి ఏప్రిల్ 29కి విచారణ వాయిదా సాక్షి, న్యూఢిల్లీ: నదీ జలాల వివాదాలు అంతులేకుండా కొనసాగరాదని, వాటిని పరిష్కరించడం తమ రాజ్యాంగ విధి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కృష్ణా జలాలపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రకటించిన అవార్డును గెజిట్‌లో నోటిఫై చేయరాదంటూ ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పిటిషన్, కృష్ణా నదీ జలాల పంపిణీని నాలుగు రాష్ట్రాలకు తిరిగి చేపట్టాలంటూ కొత్త రాష్ట్రమైన తెలంగాణ దాఖలు చేసిన పిటిషన్లు శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చాయి. జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా నదీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ 2010 డిసెంబర్లో ఇచ్చిన తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందని, అది పరిష్కారమయ్యేంత వరకు తీర్పును నోటిఫై చేయరాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గతంలో సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రభుత్వం సైతం తమకు అన్యాయం జరిగిందని, తమ వాదనలు కూడా వినాలని పిటిషన్ దాఖలు చేసింది. అలాగే ట్రిబ్యునల్ తీర్పును తక్షణం గెజిట్‌లో ప్రచురించి అమలుచేయాలని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎస్సెల్పీ దాఖలు చేశాయి. ఈ పిటిషన్లన్నీ శుక్రవారం జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్ల సి.పంత్‌తో కూడిన ధర్మాసనం ముందు విచారణ కు వచ్చాయి. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘నదీ జలాల వివాదాలు ఇలా అంతులేకుండా కొనసాగరాదు. అవార్డు నోటిఫై కానప్పటికీ అందులో ఉన్న విషయం మీ అన్ని రాష్ట్రాలకు తెలుసు..’ అని పేర్కొంది. దీనిపై మహారాష్ట్ర తరఫు న్యాయవాది అంధ్యార్జున తన వాదన వినిపిస్తూ ‘ఇక్కడ వివాదం కొత్తగా ఏర్పడిన రెండు రాష్ట్రాల మధ్యే ఉంది. వాళ్లు చివరకు బచావత్ ట్రిబ్యునల్ అవార్డును కూడా తిరగదోడమంటున్నారు. రాజ్యాంగం ప్రకారం నదీ జలాల వివాదాల ట్రిబ్యునల్ ఇచ్చే తీర్పును కోర్టుల్లో సవాలు చేసే వీలు లేదు’ అని పేర్కొన్నారు. దీనిపై జస్టిస్ మిశ్రా జోక్యం చేసుకుంటూ ‘ఈ పరిష్కారంపై రాష్ట్రాలకు కమిట్మెంట్ ఉండాలి. విషయాలు తిరగదోడుతూ వెనక్కివెళ్లలేం కదా..’ అని వ్యాఖ్యానించారు. కర్ణాటక తరఫు న్యాయవాది నారీమన్ వాదనలు వినిపిస్తూ ‘ఈ విషయంలో మా వాదన కూడా అదే. విచారణ త్వరగా పూర్తవ్వాలి..’ అని పేర్కొన్నారు. జస్టిస్ మిశ్రా తిరిగి జోక్యం చేసుకుంటూ తెలంగాణ న్యాయవాది కృష్ణమూర్తి స్వామిని ఉద్దేశించి ‘మీకు ఏపీతో వివాదం ఉండొచ్చు. అలాగే ఏపీకి ఇతర రాష్ట్రాలతో వివాదం ఉండొచ్చు.. కానీ ఎక్కడో ఒకచోట పూర్తవ్వాలి..’ అని పేర్కొన్నారు. దీంతో తెలంగాణ న్యాయవాది తన వాదనలు వినిపిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నీటి కేటాయింపులను అన్ని రాష్ట్రాల మధ్య మళ్లీ జరపాల్సి ఉంది..’ అని వివరించబోయారు. వెంటనే జస్టిస్ మిశ్రా జోక్యం చేసుకుని ‘అది మీ ఇద్దరి మధ్య(ఏపీ, తెలంగాణ మధ్య) ఉన్న వివాదం. ముందు ఏపీకి కేటాయింపులు జరిపారు. ఇప్పుడు ఆ కేటాయింపులను మీరిద్దరూ పంచుకోవాలి. ఒకరకంగా అది అంతర్ జిల్లాల పంపకం. అంతేకదా..’ అని పేర్కొన్నారు. ‘ఈ పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు మరో రెండు వారాలు గడువిస్తున్నాం. వాటిపై రీజాయిండర్లు దాఖలు చేసుకునేందుకు మరో వారం గడువు ఇస్తున్నాం. మూడు పేజీలకు మించకుండా తమ వైఖరిని రాష్ట్రాలు తెలియపరచాల్సి ఉంటుంది. ఈ గడువుకు పొడిగింపు ఉండదు. విచారణను ఏప్రిల్ 29కి వాయిదావేస్తున్నాం. కోర్టును వాయిదా కోరరాదు. న్యాయవాదులు అందుబాటులో లేనిపక్షంలో ప్రత్యామ్నాయం ఏర్పాటుచేసుకోవాలి..’ అని ఉత్తర్వులు జారీచేశారు. సిబ్బందిని సమకూర్చడంలో జాప్యంపై కృష్ణా బోర్డు ఆగ్రహం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం మేరకు ఏడు నెలల కింద ఏర్పాటైన తమ బోర్డుకు సిబ్బందిని సమకూర్చడంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చేస్తున్న అలక్ష్యంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బోర్డు కార్యకలాపాల నిర్వహణకు తగిన సిబ్బందిని సమకూర్చాలని చట్టంలోనే పేర్కొన్నా, ఇంతవరకు తమకు సిబ్బందిని కేటాయించకపోవడాన్ని ప్రశ్నించింది. ప్రాజెక్టుల పరిధిలో నీటి పంపిణీ సంక్లిష్టంగా మారుతున్న పరిస్థితుల్లో, బోర్డు సమర్థంగా పనిచేసేందుకు సిబ్బంది, వృత్తి నిపుణుల అవసరం ఎంతైనా ఉందని, దానికి అనుగుణంగా రెండు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల ఇంజనీర్ ఇన్ చీఫ్‌లకు, కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తా లేఖలు రాశారు. ఈ లేఖల ప్రతులను ఇరు రాష్ట్రాల నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శులకు సైతం పంపారు. ఏడు నెలల్లో కేవలం డిప్యూటీ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్లను మాత్రమే రెండు రాష్ట్రాలు సమకూర్చాయని, ఇది బోర్డు రోజువారీ కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వివరించారు. ఈ దృష్ట్యా సూపరింటెండెంట్ ఇంజనీర్‌ను ఏపీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను రెండు రాష్ట్రాలు, అకౌంట్స్ ఆఫీసర్‌ను, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్‌ను ఇరు రాష్ట్రాలు సమకూర్చాలని కోరారు. అలాగే కార్యాలయానికి అనువైన స్థలాన్ని కూడా చూపాలని కోరారు. -
సహజ న్యాయం.. సమ పంపిణీ
కృష్ణా ట్రిబ్యునల్ విచారణాంశాలకు ఇదే మూలంగా ఉండాలి 5న ట్రిబ్యునల్‌కు అఫిడవిట్లు సమర్పించనున్న తెలంగాణ, ఏపీ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీలో సమ న్యాయం జరగాలంటే ట్రిబ్యునల్ విచారణ పరిధిలో నాలుగు రాష్ట్రాలూ ఉండాల్సిందేనంటూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ట్రిబ్యునల్‌కు ఈ నెల 5న అఫిడవిట్లు సమర్పించాలని నిర్ణయించాయి. సహజ న్యాయం, సమ పంపిణీ ప్రామాణికంగా ట్రిబ్యునల్ విచారణ సాగాలంటే.. ఎగువ రాష్ట్రాలైన మహా రాష్ట్ర, కర్ణాటక కూడా ట్రిబ్యునల్ విచారణ పరిధిలో ఉండాలని స్పష్టం చేయనున్నాయి. ఎగువ రాష్ట్రాలకు బేసిన్ వారీ(ఎన్‌బ్లాక్) కేటాయింపులు చేసి, దిగువ రాష్ట్రాలు(తెలంగాణ, ఏపీ)కి ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు చేయడం సహజ న్యాయానికి విరుద్ధమని, అలా చేస్తే సమ పంపిణీ జరగదని వాదించనున్నాయి. ట్రిబ్యునల్ ముందుకు తేవాల్సిన అంశాలపై చర్చించేందుకు తెలంగాణ సాంకేతిక సలహా కమిటీ (టెక్నికల్ అడ్వైజర్ కమిటీ) శనివారం మళ్లీ సమావేశం కానుంది. కృష్ణా నదీ జలాల వివాద పరిష్కారానికి ట్రిబ్యునల్ విచారించాల్సిన అంశాలను, విచారణ పరిధి, విస్తృతిపై ముసాయిదా విధివిధానాలను పేర్కొంటూ జనవరి 5లోగా అఫిడవిట్లు దాఖలు చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్.. కృష్ణా జలాలతో సంబంధం ఉన్న నాలుగు రాష్ట్రాలకు సూచించిన విషయం విదితమే. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం.. ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులతోపాటు ప్రాజెక్టు నీటి విడుదల ప్రొటోకాల్స్‌ను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నిర్ధారించాలి. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం పొడిగించిన కృష్ణా ట్రిబ్యునల్ కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే పరిమితమంటూ కేంద్ర ప్రభుత్వం లేఖ ఇచ్చింది. అయితే ఈ లేఖలను అంగీకరించని ట్రిబ్యునల్.. అన్ని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని గతంలో కేంద్రానికి సూచించింది. కానీ కేంద్రం ఇప్పటిదాకా అఫిడవిట్ సమర్పించలేదు. తెలంగాణ కసరత్తు దాదాపు పూర్తి.. కృష్ణా ట్రిబ్యునల్‌కు సమర్పించాల్సిన అఫిడవిట్‌పై తెలంగాణ దాదాపు తన కసరత్తు పూర్తి చేసింది. కృష్ణా జలాల వివాదాన్ని కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య పంచాయితీగా చూడరాదని, కృష్ణా నీటిని నాలుగు రాష్ట్రాలు వినియోగించుకుంటున్నప్పుడు, కేటాయింపుల్లోనూ నాలుగు రాష్ట్రాలు భాగస్వాములుగా అవుతాయనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి తెచ్చేందుకు సిద్ధమైంది. కృష్ణాలో నీటి లోటు ఉన్న సమయాల్లో తెలంగాణ, ఏపీలకు ప్రాజెక్టుల వారీగా ఆపరేషన్ ప్రొటోకాల్‌ను నిర్ధారించడం ఎలా సాధ్యమని తెలంగాణ ప్రశ్నిస్తోంది. అలాగే ఈ రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపి, ఎగువనున్న రాష్ట్రాలకు బేసిన్ల వారీగా కేటాయింపులు ఎలా జరుపుతారని అడుగుతోంది. తెలంగాణ, ఏపీలు కొత్త ప్రాజెక్టులు నిర్మించినప్పుడు ఎగువ రాష్ట్రాల అంగీకారం ఉంటుందా అనే వాదనను బలంగా వినిపించనుంది. -
ట్రిబ్యునల్ తీర్పుపై అఖిలపక్ష సమావేశం
-
నీళ్లొస్తాయా..రావా?
=తలలు పట్టుకుంటున్న హంద్రీ-నీవా నిర్వాసితులు =ఇప్పుడు నీళ్లురాకుంటే మా పరిస్థితి ఎట్లా..? =కాలువల కోసం10,560 ఎకరాల సేకరణ =మరో పదివేల ఎకరాల సేకరణకు సమాయత్తం =రూ.150 కోట్ల పరిహారం ఇచ్చినా ప్రయోజనం లేదు ‘నమ్ముకున్న పొలాలుపోయినా పర్వాలేదు. కాలువకు నీళ్లొస్తే చాలని ఆశపడ్డాం. ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు తో మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తుతున్నాయి. భూములు లేక.. నీళ్లూరాక ఎలా బతికేది’..? అంటూ జిల్లాలోని ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. బి.కొత్తకోట, న్యూస్‌లైన్: భూములు పోయినా నీళ్లొస్తే చాలని జిల్లాలోని ఏవీ ఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి సాగునీటి ప్రాజెక్టు నిర్వాసితులు ఆశపడేవారు. ఇప్పుడు మిగులు జలాలు అందే విషయంలో అనుమానాలు రేకెత్తడంతో వారు ఆవేదనకు లోనవుతున్నారు. ప్రాజెక్టుకు 10,560 ఎకరాల అప్పగింత ప్రాజెక్టు కోసం తవ్విన కాలువలు, ఎత్తిపోతల పథకాలు, వి ద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణాలకు జిల్లాలోని పడమటి ప్రాంతాలైన 29 మండలాల్లో 10,500 ఎకరాల భూమిని సేకరిం చారు. మదనపల్లె, పీలేరులో ప్రత్యేక డెప్యూటీ కలెక్టర్ కార్యాలయాలను ఏర్పాటు చేసి భూసేకరణ చేపట్టారు. మదనపల్లె కార్యాలయ పరిధిలో తంబళ్లపల్లె, మదనపల్లె మండలాల్లో 5,531.33 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు 3,500 మంది రైతుల నుంచి 4,602 ఎకరాలను సేకరిం చారు. దీనికోసం రూ.80 కోట్ల పరిహారం చెల్లిం చారు. పీలేరు కార్యాలయ పరిధిలో 6,967 ఎకరాలకు గానూ, ఇప్పటివరకు 5,958 ఎకరాల సేకరణ పూర్తిచేశారు. 9,811 మందికి రూ.70.48 కోట్ల పరిహారం ఇచ్చారు. 8 ఏళ్లుగా ఉపయోగంలేదు కాలువల కోసం 2006 నుంచి భూ సేకరణ ప్రారంభమైంది. ప్రాజెక్టుకు భూములుపోకుండా ఉంటే అప్పుడప్పుడూ కురిసే వర్షాలకైనా పంటలు పం డేవి. ఇంతకాలం కాలువకు నీరొస్తుందని ఎదురుచూశాం. ఇప్పుడు నీళ్లురాకుంటే మా గతి ఏమిటని అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో 10వేల ఎకరాల సేకరణకు సన్నద్ధం జిల్లాలో కాలువల కోసం కాకుండా ఉపకాలువల నిమిత్తం అధికారులు భూ సేకరణకు సిద్ధమవుతున్నారు. ప్రధాన, ఉపకాలువల నుంచి పొలాలకు నీళ్లు పారాలంటే వీటి నుంచి ఉపకాలువలు నిర్మించాలి. ప్రస్తుతం భూసేకరణ యంత్రాంగం దీనిపై చర్యలు చేపట్టింది. దీంతో రైతులు మరో పది వేల ఎకరాలు కోల్పోనున్నట్టు అధికారుల అంచనా. వ్యవసాయం దూరమైంది హంద్రీ - నీవా కాలువ పనులతో భూములు, బోరు కోల్పోవడంతో వ్యవసాయం దూరమైం ది. మా కుటుంబంలో ఏడుగురున్నారు. మాకు నాలుగు ఎకరాల భూ మి ఉంది. నా భర్త రామయ్య వ్యవసాయం చేసేవారు. ఇద్దరు భార్యలు, కుమారుడు, కోడలు, ముగ్గురు పిల్లలతో కలిసి వ్యవసాయంపై ఆధార పడి జీవనం సాగించేవాళ్లం. ఏడాదిలో మూడు సార్లు వరి, వేరుశెనగ పండించేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నాలుగు ఎకరాల్లో రెండు ఎకరాలు, వ్యవసాయ బోరును కోల్పోయాం. -కే.రాజమ్మ, మహిళారైతు, పెద్దమండ్యం ఐదేళ్లుగా నిరీక్షణ హంద్రీ-నీవా కాలువ కోసం మూడున్నర ఎకరాల భూమి కోల్పోయాం. 2.45 ఎకరాల భూమికి పరిహారం మంజూరైంది. మిగిలిన 1.5 ఎకరాలకు పరి హారం ఇవ్వాల్సి ఉంది. అలాగే కొబ్బరి, కానుగ, టేకు, జామ, వేపచెట్లకు రూ.1.45 లక్షల పరిహారం అందాలి. పరిహారం కోసం తహశీల్దార్ వద్ద లెటర్ తెమ్మంటున్నారు. వారి వద్దకు వెళితే ఎండార్స్మెంటే ఇచ్చాం.. మళ్లీ లె టర్ ఎందుకు..? అని ప్రశ్నిస్తున్నారు. ముగ్గురు కలెక్టర్లు మారినా మాకు పరిహారం మాత్రం రాలేదు. -పెద్ద గంగులప్ప, రైతు, పెద్దతిప్పసముద్రం -
చంద్రబాబు వైఖరి రైతులకు చేటు
సాక్షి, గుంటూరు :టీడీపీ అధినేత చంద్రబాబు వైఖరితోనే కృష్ణా, గోదావరి మిగులు జలాల విషయంలో రైతులు నష్టపోతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ విమర్శించారు. తొమ్మిదేళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్ట్‌ల గురించి ఏనాడూ ఆలోచన చేయలేదన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లపై ఏమాత్రం అవగాహన లేని టీడీపీ నేతలు వైఎస్సార్ గురించి, ఆయన చేపట్టిన జలయజ్ఞంపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్ట్‌లకు బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ నీటి కేటాయింపులు జరపకపోవడానికి ప్రధాన కారణం చంద్రబాబేనని ఆరోపించారు. 2004 కన్నా ముందు అధికారంలో ఉన్న చంద్రబాబు అప్పుడే ప్రాజెక్ట్‌లు నిర్మించి ఉంటే, ఇప్పుడు ట్రిబ్యునల్‌లో నీటి కేటాయింపులు జరిగేవని పేర్కొన్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి గొడ్డలిపెట్టన్నారు. బాబును ప్రజలు క్షమించరు.. మిగులు జలాల సద్వినియోగం విషయంలో బచావత్ ట్రిబ్యునల్ ఇచ్చిన గడువును ఉపయోగించుకోకుండా.. వ్యవసాయం దండగ అంటూ చంద్రబాబు తన హయాంలో ఒక్క ప్రాజెక్ట్‌ను నిర్మించకపోవడంతోనే కృష్ణామిగుల జలాలపై తీరని అన్యాయం జరిగింద ని రాజశేఖర్ ఆరోపించారు. పేదలు, రైతులకు మేలు తలపెట్టిన మహానేత వైఎస్ఆర్పై బురదజల్లుడు వ్యాఖ్యలకు పాల్పడటం టీడీపీ నేతల కుసంస్కారానికి నిదర్శనమన్నారు. నాగార్జునసాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌ల చుట్టూ పొర్లుదండాలు పెట్టి చంద్రబాబు క్షమాపణలు కోరినా, ఈ రాష్ట్ర ప్రజలు అంగీకరించరన్నారు. రైతులకు టీడీపీ చేసిన తీరని అన్యాయాన్ని కడవరకు ప్రజలు మరిచిపోరన్నారు. ఆల్మట్టి ఎత్తు తగ్గించగలిగామని చంకలు కొట్టుకుంటున్న టీడీపీ.. అప్పట్లో అధికారంలో ఉంది తామేనని మరిచిపోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్ ఇచ్చిన లేఖ కారణంగానే బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు చెప్పిందని టీడీపీ నేతలు ఎలా మాట్లాడగలుగుదుందని ప్రశ్నించారు..? చంద్రబాబు తాబేదారులుగా మాట్లాడుతున్న వారికి రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు. జలయజ్ఞంతో వైఎస్‌ను దేవుడిగా కొలుస్తున్నారు.. వృధాగా పోయే ప్రతీ నీటి చుక్క రైతులకు మేలుచేయాలనే తలంపుతో జలయజ్ఞం చేపట్టి సాగునీటి ప్రాజెక్ట్‌లను నిర్మించిన ఘనత మహానేత వైఎస్‌దేనని పార్టీ కేంద్ర కార్యవర్గ సభ్యుడు రావి వెంకటరమణ అన్నారు. వెలిగొండ, పులిచింతల, నాగార్జునసాగర్, గోదావరి ఆయక ట్టు ఆధునికీకరణ పనులు వైఎస్ చలవేనన్నారు. ఆయన ఆప్పట్లో కేంద్రానికి రాసిన లేఖలను వక్రీకరించి రాజకీయాల్లో లాభం పొందాలనే టీడీపీ ఎత్తుగడను ప్రజలు గమనిస్తూనే ఉంటారన్నారు. టీడీపీ హయాం లో డెల్టాలో 20లక్షల ఎకరాల ఆయకట్టు పూర్తిగా ఎండిపోయిన పరిస్థితిని గుర్తుచేశారు. కడ వరకు పోరాడతాం.. మిగులు జలాల విషయంలో న్యాయం కోసం తమ పార్టీ కడవరకు పోరాడుతుందని పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. జగన్ ముఖ్యమంత్రి అవుతారనే భయంతో టీడీపీ నేతలకు మతిభ్రమించి వైఎస్ఆర్పై బురదజల్లుతున్నారని, ప్రజలు ఆపార్టీకి తగిన సమయంలో బుద్ధిచెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం నేతలు కావటి మనోహర్‌నాయుడు, బాలవజ్రబాబు (డైమండ్), పెదకూరపాడు సమన్వయకర్తలు నూతలపాటి హనుమయ్య, రాతంశెట్టి రామాంజనేయులు, పార్టీనేతలు మార్కెట్‌బాబు, అశోక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కృష్ణ.. కృష్ణా!
కృష్ణమ్మ బిరబిరా పరుగులు ఆగిపోనున్నాయి.. ఏరువాక వచ్చిందంటే ఆ జీవనది గలగల సవ్వడులు వినిపించేవి. కానీ ఆగస్టు తరువాతే గాని వరదనీరు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం మిగులు జలాల్లో ఎగువరాష్ట్రాలకు నీటివాటా కల్పించడం పాలమూరు ప్రాజెక్టులకు నీటిరాక కష్టమే..! ఇప్పటికే కృష్ణానదికి ఆలస్యంగా వరదలు వస్తున్నాయి. ఆల్మట్టి డ్యాం ఎత్తుపెంపు వల్ల మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాగా, బచావత్ ట్రిబ్యునల్ అవార్డు పూర్తయ్యే నాటికే ప్రాజెక్టులను నిర్మించకపోవడం, ప్రభుత్వాల ముందుచూపు లేకపోవడం, మిగులు జలాలపై సరైన వాదనలు వినిపించడం వెరసి..జిల్లా ప్రాజెక్టులకు శాపంగా మారింది. బ్రిబ్యునల్ తీర్పు అమలైతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన నెట్టెంపాడు, ఎంజీఎల్‌ఐ, ఎస్ఎల్బీసీ, బీమా, డిండి, అమ్రాబాద్, కోయిల్‌సాగర్ సాగర్ ఎత్తిపోతల పథకాలకు నీటిగండం ఏర్పడనుంది. ఇదే జరిగితే పాలమూరు ఎడారిగా మారడం ఖాయం.. -
రాష్ర్ట రైతులకు మరణ శాసనమే
కొరిటెపాడు(గుంటూరు), న్యూస్‌లైన్ :బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు ఆంధ్రప్రదేశ్ రైతులకు మరణ శాసనం రాసిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కర్నాటక ప్రభుత్వ వాదనలే జడ్జిమెంట్ రూపంలో వచ్చాయని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌కు తీరని నష్టాన్ని చేసిన అత్యంత భయంకర తీర్పుగా చరిత్రలో మిగిలిపోతుందని చెప్పారు. నీటి పారుదల రంగంపై కనీస అవగాహనలేని న్యాయవాదులు బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ముందు వాదించడం వల్లే రాష్ట్ర రైతులకు ఈ పరిస్థితులు దాపురించాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణాపరివాహక ప్రాంత రైతులు, విశ్రాంత అధికారులు, న్యాయ నిపుణులతో కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ సూచనల ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లాలని సూచించారు. రాష్ట్ర విభజనపై కేంద్ర ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ మాట్లాడుతూ సమర్థవంతమైన న్యాయవాదులను పెట్టి రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమావేశంలో పార్టీ నాయకులు నిమ్మకాయల రాజ నారాయణ, తెనాలి శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
..‘అనంత’కు శరాఘాతం
సాక్షి ప్రతినిధి, అనంతపురం : నాటి చంద్రబాబు సర్కారు పాపం.. నేటి కిరణ్ ప్రభుత్వం నిర్లక్ష్యం హంద్రీ-నీవా సుజల స్రవంతి ఆయకట్టు రైతులకు శరాఘాతంగా మారింది. కృష్ణా నదీ జలాల వివాదంపై బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ శుక్రవారం ఇచ్చిన తుది తీర్పు హంద్రీ-నీవా ఆయకట్టు రైతుల ఆశలను అడియాసలు చేసింది. కర్ణాటక సర్కారు చేపట్టిన ఆలమట్టి రిజర్వాయర్ నిర్మాణాన్ని అప్పటి చంద్రబాబు సర్కారు అడ్డుకోలేకపోయింది. మన రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడంలోనూ చంద్రబాబు సర్కారు విఫలమైంది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో సమర్థవంతంగా వాదనలు విన్పించడంలో కిరణ్ సర్కారు విఫలమైంది. పర్యవసానంగా హంద్రీ-నీవా భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. 1973లో కృష్ణా నదీ జలాల పంపిణీపై బచావత్ ట్రిబ్యునల్ తీర్పును ఇచ్చింది. కృష్ణానదిలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,130 టీఎంసీల నికర జలాలు అందుబాటులో ఉంటాయని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 811, కర్ణాటకకు 734, మహారాష్ట్రకు 584 టీఎంసీలు కేటాయించింది. దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు మిగులు జలాలపై హక్కును కల్పించింది. బచావత్ ట్రిబ్యునల్ గడవు 2001లో పూర్తయింది. కృష్ణా జలాలను మళ్లీ పంపిణీ చేయడం కోసం జస్టిస్ బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలో ట్రిబ్యునల్‌ను కేంద్రం 2004 ఏప్రిల్ 2న ఏర్పాటు చేసింది. అప్పుడే మేల్కొని ఉంటే..: మిగులు జలాలపై హక్కు రావాలంటే ప్రాజెక్టులను నిర్మించాలి. ఇదే అంశాన్ని 1995 నుంచి 2004 మధ్య సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు నీటిపారుదల రంగ నిపుణులు అనేక సందర్భాల్లో సూచించారు. వాటిని అమలు చేయాల్సిన చంద్రబాబు తద్భిన్నంగా స్పందించారు. ‘కృష్ణా నదిలో నీళ్లే లేవు.. ప్రాజెక్టులు నిర్మించి ఏం చేసుకోవాలి’ అంటూ అనేక సందర్భాల్లో నీటిపారుదలరంగ నిపుణులను చంద్రబాబు అపహాస్యం చేశారు. కానీ.. ఎన్నికలకు ముందు మాత్రం ఓట్ల కోసం చంద్రబాబుకు ప్రాజెక్టులు గుర్తుకొచ్చేవి. రైతులు గుర్తుకొచ్చేవారు. కానీ.. ఆ తర్వాత వాటిని మరచిపోయేవారు. ఇందుకు ప్రత్యక్ష తార్కాణం.. మన జిల్లాలో చేపట్టిన హంద్రీ-నీవా పనులే. 1996 మధ్యంతర లోక్‌సభ ఎన్నికలకు ముందు ఐదు టీఎంసీల సామర్థ్యంతో కేవలం తాగునీటి కోసం హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం కోసం ఉరవకొండలో పునాదిరాయి వేశారు. కానీ.. తట్టెడు మట్టి కూడా ఎత్తలేదు. ఇంతలోనే 1999 సాధారణ ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి 30 టీఎంసీల సామర్థ్యంతో హంద్రీ-నీవాకు ఆత్మకూరు వద్ద శంకుస్థాపన చేశారు. రెండు మూడు మీటర్ల మేర కాలువ తవ్వి.. ఆ తర్వాత ఆ పనులను గాలికొదిలేశారు. హంద్రీ-నీవాను చంద్రబాబు ఆనాడే పూర్తిచేసి ఉంటే.. ఈ రోజున బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఆ ప్రాజెక్టుకు నికర జలాలు కేటాయించి ఉండేదని నీటిపారుదలరంగ నిపుణులు స్పష్టీకరిస్తున్నారు. ఇది దుర్భిక్ష ‘అనంత’ను సుభిక్షం చేసేదని చెబుతున్నారు. చంద్రబాబు నిర్లక్ష్యం ఫలితంగా బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ జిల్లా రైతులకు గొడ్డలిపెట్టు వంటి తీర్పును వెలువరించింది. కృష్ణా నదిలో 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,293 టీఎంసీల జలాలు లభిస్తాయని అంచనా వేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మన రాష్ట్రానికి 1005, కర్ణాటకకు 911, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది. ఆలమట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుకునే అధికారాన్ని కర్ణాటకకు కట్టబెట్టింది. ఇది హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకం ఆయకట్టు రైతులకు అశనిపాతంగా మారింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 2010 డిసెంబర్ 31న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పుడే కిరణ్ సర్కారు మేల్కొని ఉంటే.. ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదనే అభిప్రాయం నిపుణుల్లో బలంగా వ్యక్తమవుతోంది. ఇప్పుడెలా..? దుర్భిక్ష రాయలసీమ జిల్లాలను సుభిక్షం చేయాలన్న లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హంద్రీ-నీవా సుజల స్రవంతి పథకాన్ని చేపట్టారు. రూ.6,8850 కోట్లతో అంచనా వ్యయంతో శ్రీశైలం జలాశయం నుంచి 40 టీఎంసీలను ఎత్తిపోసి రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. ఇందులో మన జిల్లా పరిధిలోనే 3.45 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా పథకాన్ని రూపొందించారు. హంద్రీ-నీవాకు కేటాయించిన 40 టీఎంసీలను శ్రీశైలం రిజర్వాయర్‌కు వరద వచ్చే 120 రోజుల్లో రోజుకు మూడున్నర వేల క్యూసెక్కులకు తగ్గకుండా నీటిని ఎత్తిపోసుకోవచ్చునని పేర్కొన్నారు. కృష్ణా జలాల పంపిణీ వివాదం బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ విచారిస్తోన్న నేపథ్యంలో.. హంద్రీ-నీవాకు మిగులు జలాలు కేటాయించారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చిన తర్వాత రాష్ట్రానికి కేటాయించిన నికర జలాల మంజూరులో హంద్రీ-నీవాకు తొలి ప్రాధాన్యం ఇస్తామని అప్పట్లో వైఎస్ హామీ ఇచ్చారు. హంద్రీ-నీవా పనులను శరవేగంగా పూర్తి చేసేందుకు వైఎస్ భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు పనులపై రూ.4,700 కోట్లకుపైగా ఖర్చు చేశారు. గతేడాది నవంబర్ 18న శ్రీశైలం నుంచి హంద్రీ-నీవా కాలువల్లోకి ట్రయల్ రన్ ద్వారా నీటిని ఎత్తిపోశారు. ఈ ఏడాది ఇప్పటిదాకా 4.5 టీఎంసీలను హంద్రీ-నీవా కాలువల్లోకి ఎత్తిపోస్తే.. మన జిల్లా పరిధిలోని జీడిపల్లి రిజర్వాయర్‌కు 1.5 టీఎంసీలు చేరాయి. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మిగులు జలాలను కూడా మూడు రాష్ట్రాలకు పంపిణీ చేసిన నేపథ్యంలో.. మన రాష్ట్రానికి అదనంగా కేటాయించిన 200 టీఎంసీల నికర జలాల్లో హంద్రీ-నీవా వాటా ఎంత అన్నది తేల్చాల్సి ఉంది. ఇకపోతే ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచితే.. ఆ డ్యామ్ నిండి, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులు నిండిన తర్వాతనే శ్రీశైలం రిజర్వాయర్‌లోకి కృష్ణా జలాలు వస్తాయి. ప్రస్తుతం ఆగస్టు మొదటి వారం నాటికే శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగులకు చేరుతోంది. కానీ.. ఆలమట్టి ఎత్తు పెంచితే.. సెప్టెంబరు మొదటి వారానికి గానీ శ్రీశైలం రిజర్వాయర్‌లో 854 అడుగులకు నీళ్లు చేరవు. 854 అడుగులకు నీళ్లు చేరితేగానీ హంద్రీ-నీవా కాలువల్లోకి నీటిని ఎత్తిపోయలేని దుస్థితి నెలకొంటుంది. దీన్ని బట్టి చూస్తే హంద్రీ-నీవా ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పవన్నది విశదమవుతోంది. -
ఆశలు ఆవిరి
కడప కలెక్టరేట్, న్యూస్‌లైన్ : కృష్ణానది జలాల వివాదాలపై ఏర్పాటు చేసిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పు జిల్లా రైతాంగం పాలిట శరాఘాతంలా మారింది. జలయజ్ఞం ఫలాలపై అన్నదాతలు పెట్టుకున్న ఆశలు ఒక్కసారిగా ఆవిరైపోయాయి. మిగులు జలాలపై ఆధారపడి వేల కోట్ల రూపాయలతో చేపట్టిన గాలేరు-నగరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్టుల భవిత ప్రశ్నార్థకమైంది. కేసీ కెనాల్ ఆయకట్టుపై సైతం నీలి నీడలు ప్రసరిస్తున్నాయి. ప్రాజెక్టుల నిర్మాణాల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం, ట్రిబ్యునల్ ఎదుట సమర్థవంతంగా వాదనలు వినిపించడంలో వైఫల్యం ఫలితమే ఈ తీర్పనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రాయలసీమ ఉద్యమ ఫలితంగా నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 38 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మూడు లక్షల 20 వేల ఎకరాలకు నీరందించాలనేదే లక్ష్యం. వందలాది గ్రామాల దాహార్తిని తీర్చేందుకు కూడా ఈ పథకం ఉద్దేశించబడింది. 1989 చివరిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డిజైన్‌లో మార్పులు చేయడంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు హయాంలో ఈ ప్రాజెక్టును ఏకంగా అటకెక్కించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఈ ప్రాజెక్టు పునరుజ్జీవం పొందింది. తెలంగాణ నేతల అసంబద్ద ఆరోపణలను లెక్కచేయకుండా ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల వరదను ప్రవహింపజేశారు. దీంతో పనులు శరవేగంగా సాగాయి. ఈ ప్రాజెక్టులో అంతర్బాగమైన గండికోట రిజర్వాయర్ 27 టీఎంసీల సామర్థ్యంతో నిర్మాణం పూర్తి చేసుకుంది. మొదటి దశ కింద 35 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1413.42 కోట్ల రూపాయలు విడుదల చేయగా, ఇప్పటివరకు 1205.32 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. నిత్య కరువు పీడిత ప్రాంతమైన పులివెందుల నియోజకవర్గంలో 47.500 ఎకరాలకు నీరందించే గండికోట లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి 712.31 కోట్ల రూపాయలు విడుదల కాగా, ఇప్పటికి 660.80 కోట్లు ఖర్చు చేశారు. అలాగే 20,750 ఎకరాలకు నీరందించే గండికోట-సీబీఆర్ పథకానికి 1461.355 కోట్ల రూపాయలు కేటాయించగా, ఇప్పటికి 1174.40 కోట్లు ఖర్చు చేశారు. ఇక గాలేరు-నగరి రెండవ దశ కింద లక్షా 32 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు 1000.88 కోట్ల రూపాయలు కేటాయించగా, 147.34 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చయ్యాయి. జిల్లాకు ప్రాణప్రదమైన ఈ ప్రాజెక్టు ఉనికి ట్రిబ్యునల్ తీర్పు వల్ల అంధకారంలో పడిపోయింది. ఇటీవలే గండికోట రిజర్వాయర్‌కు కృష్ణా జలాలను కొద్దిమేర తరలించారు. తమకు పునరావాసం కల్పించనందున ఐదు గ్రామాల ప్రజలు అభ్యంతరాలు తెలుపడంతో నీటి సరఫరా ఆగింది. బహుశా గండికోట రిజర్వాయర్‌కు నీటి తరలింపు ఇదే మొదటి, ఆఖరుదేమో అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 40 టీఎంసీల సామర్థ్యంతో రాయలసీమ నాలుగు జిల్లాల్లో 6,02,500 ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యంతో చేపట్టిన హంద్రీ-నీవా ద్వారా జిల్లాలోని రాయచోటి, లక్కిరెడ్డిపల్లె ప్రాంతాల్లో 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించారు. కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన ఈ ప్రాజెక్టు భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడింది. ఇక వెలిగొండ ప్రాజెక్టు ద్వారా బద్వేలు నియోజకవర్గంలోని కొంత ఆయకట్టుకు నీరందడం దుర్లభంగా మారింది. పురాతన కేసీ కెనాల్ భవితపై కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. తుంగభద్ర నుంచి నీరు సక్రమంగా సరఫరా కాకపోవడం వల్ల జిల్లా ఆయకట్టు అవసరాల కోసం కొన్నేళ్లుగా శ్రీశైలం నుంచి నీటిని సరఫరా చేస్తున్నారు. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ అల్మట్టి ఎత్తును 524.256 మీటర్లకు పెంచుకోవడానికి కరా్ణాటకకు అనుమతి ఇచ్చిన నేపధ్యంలో కృష్ణానీరు సరిపడు స్థాయిలో శ్రీశైలం రిజర్వాయర్‌కు చేరుకుంటాయన్నది ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో కేసీ ఆయకట్టుకు సైతం గడ్డురోజులు దాపురించనున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
కృష్ణా జలాల్లో ఏపీకి అన్యాయం: వాసిరెడ్డి పద్మ
-
సింహపురి ఎడారే!
కృష్ణా మిగులు జలాలపై దిగువ రాష్ట్రానికి హక్కు లేదని, మిగులు జలాలు వాడుకునే హక్కు ఎగువ రాష్ట్రాలదేనని శుక్రవారం బ్రజేశ్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు జిల్లా రైతాంగానికి తీవ్ర వేదనను మిగిల్చింది. పెన్నా, కృష్ణా మిగులు జలాలపై ఆధారపడిన జిల్లాలోని సోమశిల, కండలేరు జలాశయాలు, వాటి పరిధిలోని 10 లక్షల ఎకరాల ఆయకట్టు ఎడారిగా మారనుంది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలకు సైతం తిండిగింజలు అందించి అన్నంపెట్టే సింహపురి ఇకపై గుక్కెడు తాగునీటికి సైతం అలమటించే పరిస్థితి తలెత్తనుంది. దీంతో ఇక్కడి రైతాంగంలో తీవ్ర ఆందోళన నెలకొంది. సాక్షి, నెల్లూరు: కృష్ణా, గోదావరి తర్వాత అత్యధికంగా వరిసాగు చేసేది నెల్లూరు జిల్లాలోనే. జిల్లా వ్యవసాయం మొత్తం 78 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన సోమశిల, 68 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కండలేరు జలాశయాలపైనే ఆధారపడి ఉంది. కృష్ణా జలాల్లో చెన్నై తాగునీటి అవసరాలకు కేటాయించిన 15 టీఎంసీల నీరు మినహా జిల్లాకు నికర జలాలు అంటూ చుక్కనీటి కేటాయింపులు లేవు. అంతా వర్షపు నీరు, కృష్ణా మిగులు జలాలు తప్ప. సోమశిల: సోమశిలకు ప్రధాన నీటివనరు పెన్నానది. అయితే రానురానూ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో పెన్నాద్వారా నీళ్లొచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. దీంతో రెండుమూడేళ్ల కొకసారికూడా సోమశిల కింద పూర్తి ఆయకట్టు సాగులోకి వచ్చే పరిస్థితి లేదు. ఇక ఉన్న ఆధారమంతా కృష్ణా మిగులు జలాలే. వర్షాలు, వరదనీరు అధికంగా ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు నుంచి పెన్నామీదుగా సోమశిలకూ, అక్కడి నుంచి కండలేరుకూ నీరు చేరుతోంది. దీంతో పాటు కడప జిల్లాలోని కేసీకెనాల్ ఆయకట్టు రీజనరేషన్ వాటర్ సైతం పెన్నాద్వారా సోమశిలకు చేరుతోంది. ఈ నీటితో సోమశిల పరిధిలో పెన్నాడెల్టా, మిగిలిన ప్రాంతాల్లో దాదాపు 7 లక్షల ఎకరాలు, కండలేరు పరిధిలో అధికారికంగా 2.75 లక్షల ఎకరాలు అనధికారికంగా 3 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 లక్షల ఎకరాలు ఒక్క కారులోనే సాగవుతోంది. ఇది కాక చెరువుల ఆక్రమణలు, శివాయీలు, అనాదీన పొలాలు అన్నీ కలుపుకుంటే 15 నుంచి 20 శాతం ఆయకట్టు అదనంగా ఉంటుంది. నీళ్లు ఆశించిన మేరకు చేరితే రెండోపంట సైతం మరో 5 లక్షల ఎకరాలకు తగ్గకుండా సాగవుతుంది. మొత్తంగా కాలం కనికరిస్తే జిల్లాలో ఏడాదికి 15 లక్షల ఎకరాలలో వరిసాగవుతుంది. దీంతో జిల్లా ప్రజలేగాక రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలవారికి సింహపురి నుంచే తిండి గింజలు సరఫరా అవుతాయి. బ్రజేశ్ తీర్పుతో.. మిగులు జలాలపై దిగువరాష్ట్రానికి హక్కులేదని బ్రజేశ్‌కుమార్ వెలువరించిన తీర్పుతో ఇక కృష్ణా మిగులు జలాలు దక్కే పరిస్థితి ఉండదు. దీంతో జిల్లాలో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొననుంది. సోమశిల, కండలేరు పరిధిలో లక్షలాది ఎకరాల ఆయకట్టు బీళ్లుగా మారనుండగా మెట్ట ప్రాంతాల్లో తాగునీరు కూడా సక్రమంగా అందే పరిస్థితి ఉండదు. పర్యవసానంగా లక్షలాది మందికి అన్నంపెట్టిన సింహపురి రైతులకు తిండి గింజలు దొరికే పరిస్థితి ఉండదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలయజ్ఞం భగ్నమే బ్రజేశ్ తీర్పుతో జిల్లాలో జలయజ్ఞం పనులు ఆగిపోనున్నాయి. ఇటీవలే 15 వందల కోట్లతో సోమశిల హైలెవల్ కెనాల్‌కు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ పథకం వల్ల ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో మరో 90 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండడంతో పాటు పెద్ద ఎత్తున తాగునీటి అవసరాలకు ఈ నీటిని వినియోగించేలా అధికారులు అంచనాలు సిద్ధం చేశారు. బ్రజేశ్ తీర్పుతో ఈ పథకం ప్రశ్నార్థకంగా మారనుంది. సోమశిలకు అంచనా మేరకు 48 టీఎంసీల నీరు అవసరమైనా భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా వరద నీటిని నిలువ ఉంచుకోవాలన్న ఆలోచనతో కోట్లు వెచ్చించి వైఎస్సార్ హయాంలో 78 టీఎంసీల కెపాసిటీ సామర్థ్యంతో రిజర్వాయర్‌ను విస్తరించారు. ఇక కండలేరుదీ అదే పరిస్థితి. 30 టీఎంసీల నీరు అవసరమైనా వరదనీటిని నిలువ ఉంచుకొనేందుకు వీలుగా 68 టీఎంసీల సామర్థ్యంతో కండలేరును ఆధునికీకరించారు. వీటితో పాటు జిల్లాలో వందలకోట్లతో పెన్నా, సంగం బ్యారేజీలతో పాటు పలు జలయజ్ఞవ పనులు జరుగుతున్నాయి. అయితే బ్రజేష్ తీర్పుతో ఇవన్నీ బూడిదలో పోసిన పన్నీరు కానున్నాయి. జలయజ్ఞం నిరుపయోగంగా మారనుంది. దీంతో సింహపురి రైతన్నల భవితవ్యం అంధకారం కానుంది. బ్రజేష్ ఏకపక్షంగా ఆంధ్రరాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా, కర్ణాటక ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పు వెలువరించారు. ముఖ్యంగా ఆల్మట్టి ఎత్తు పెంచుకోవడం సబబే అని పేర్కొనడంపై జిల్లా ప్రజల్లో ముఖ్యంగా రైతాంగంలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికైనా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు స్పందించి కృష్ణా మిగులు జలాల సాధన కోసం కృషి చేయాలని వారు కోరుతున్నారు. -
'రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పు'
కృష్ణా జలాల వినియోగంపై బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం ఏమీ జరగలేదని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ట్రిబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి అన్యాయం జరిగిందనడం తప్పని వ్యాఖ్యానించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక ట్రిబ్యునల్ ముందుకు వెళ్తామని ఆయన స్పష్టం చేశారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం జనవరిలో ఏర్పడుతుందని పాల్వాయి గోవర్థన్ రెడ్డి జోస్యం చెప్పారు. డిసెంబర్ 10వ తేదీన తెలంగాణ బిల్లు శాసనసభకు వస్తుందని తెలిపారు. మూడు రోజులపాటు టి. బిల్లుపై అసెంబ్లీలో చర్చ జరుగుతుందని వెల్లడించారు. -
'తెలంగాణపై ముందుకెళ్తే మెరుపు సమ్మె'
కృష్ణా జలాల వివాదంపై బ్రిజేష్ కుమార్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నట్లు ఏపీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌బాబు వెల్లడించారు. శుక్రవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ప్రక్రియపై ముందుకెళ్తే మెరుపు సమ్మె చేస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అందులో ఎటువంటి సందేహం లేదని చెప్పారు. అవసరమైతే చట్టాన్ని కూడా చేతుల్లోకి తీసుకునేందుకు వెనకాడబోమని ఆయన పునరుద్ఘాటించారు. విభజనను నిరసిస్తు 66 రోజులు సమ్మె చేశామని ఆయన గుర్తు చశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని ఆయన యూపీఏ సర్కార్‌ను డిమాండ్ చేశారు. విభజనతో సీమాంధ్రకు తీవ్ర అన్యాయం జరుగుతున్న ఆ ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులను తమ పదవులను వీడకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీమాంధ్ర మంత్రుల అనుసరిస్తున్న వైఖరి సిగ్గు చేటు అని అశోక్ బాబు వ్యాఖ్యానించారు. -
కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రెండు నెలలు వాయిదా!
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు వాయిదా పడింది. బ్రజేష్‌కుమార్ అధ్యక్షతలోని ప్రస్తుత ట్రిబ్యునల్ గడువు సోమవారంతోనే ముగిసింది. అయితే, తీర్పు ప్రకటించేందుకు వ్యవధి కావాలని ట్రిబ్యునల్ కోరడంతో గడువును మరో రెండునెలలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. తాజా గడువు ప్రకారం నవంబర్ నెలాఖరుకు ట్రిబ్యునల్ తన తుదితీర్పు వెల్లడించాల్సి ఉంది. కృష్ణా జలాల పంపిణీపై ఆంధ్రప్రదేశ్, మహారాష్ర్ట, కర్నాటక రాష్ట్రాల మధ్య వివాద పరిష్కారంకోసం సుమారు తొమ్మిదేళ్ల క్రితం ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌వుుందు ఇప్పటికే ఆయా రాష్ట్రాల వాదనలు పూర్తయ్యూరుు. 2010 డిసెంబర్ 2న మధ్యంతర తీర్పును కూడా ట్రిబ్యునల్ ప్రకటించింది. అరుుతే, ఈ తీర్పులో పలు అంశాలు మన రాష్ట్రానికి నష్టం కలిగించేవిగా ఉన్నాయి. కర్నాటకలో ఆలమట్టి డ్యాం ఎత్తునకు అనుమతి ఇవ్వడం, మిగులు జలాలను గుర్తించి, వాటిని ఎగువ రాష్ట్రాలకు పంపిణీ చేయడం వంటి అంశాల్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తీర్పులో సవరణలను చేయాలని రాష్ర్టప్రభుత్వం ట్రిబ్యునల్‌ను కోరింది. తీర్పులోని పలు అంశాలపై ఎగువ రాష్ట్రాలు కూడా సవరణలు కోరాయి. దాంతో సవరణలపై ఆయా రాష్ట్రాల వాదనలను ట్రిబ్యునల్ గత మూడేళ్ల నుంచి విన్నది. గత నెలలో కూడా జరిగిన ట్రిబ్యునల్ సమావేశంతో వాదనలు పూర్తయ్యాయి....తీర్పును ప్రకటిస్తామని ఈ సమావేశాల సందర్భంగా ట్రిబ్యునల్ ప్రకటించింది. సెప్టెంబర్ చివరి నాటికి తీర్పు వెలువడుతుందని భావిస్తున్న నేపథ్యంలో తీర్పును ప్రకటనకు మరో రెండునెలల గడువును ట్రిబ్యునల్ కోరింది. దాంతో నవంబర్ 30వరకు గడువును పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. -
ముందుగా రాష్ట్రానికి 459 టీఎంసీలు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా నది నీటిని వాడుకునే విషయంలో ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ ప్రతిపాదన వల్ల రాష్ట్రానికి కొంతలో కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎగువ ప్రాంతం నుంచి మనకు రావాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే ఎగువ రాష్ట్రాలు నీటిని వాడుకోవాలని ట్రిబ్యునల్ తాజాగా సూచించింది. ఈ ప్రతిపాదనపై మూడు రాష్ట్రాలు ఈ నెల 24, 25 తేదీల్లో ప్రత్యేకంగా సమావేశమై చర్చించనున్నాయి. ఈ చర్చల సారాంశాన్ని 26న ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. కృష్ణా నదిలో 75 శాతం డిపెండబులిటీ ప్రకారం 2,130 టీఎంసీల నీరు ఉన్నట్టు ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నీటిలో మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మన రాష్ట్రానికి 811 టీఎంసీల నీటిని కేటాయించింది. అయితే మన రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల నీటిలో ఎగువ ప్రాంతం (మహారాష్ట్ర, కర్ణాటక) నుంచి 459 టీఎంసీలు రావాల్సి ఉంది. మిగిలిన 352 టీఎంసీల నీరు మన రాష్ట్రంలోని కృష్ణా పరివాహక ప్రాంతంలో కురిసే వర్షపు నీరు ద్వారా రావాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రాజెక్టులు నిండిన తర్వాతే మన రాష్ర్టంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. అయితే 65 శాతం డిపెండబులిటీ ప్రకారం కృష్ణా నదిలో 2,578 టీఎంసీల నీరు ఉన్నట్టు బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని ట్రిబ్యునల్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనినే పరిగణనలోకి తీసుకుని మూడు రాష్ట్రాలకు అదనపు కేటాయింపుల్ని కూడా చేసింది. అంటే...ఇప్పటివరకు మనకే వాడుకునే స్వేచ్ఛ ఉన్న మిగులు జలాల్ని ఎగువ రాష్ట్రాలు కూడా ఉపయోగించుకునే విధంగా మధ్యంతర తీర్పును వెల్లడించారు. దీనిపై మన రాష్ర్టం తీవ్రంగా అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దాంతో 75 శాతం డిపెండబులిటీ నీటి లభ్యత ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సిన 459 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేసిన తర్వాతే....65 శాతం డిపెండబులిటీ నీటిని (మిగులు జలాలు) ఎగువ రాష్ట్రాలు ఉపయోగించుకోవాలని ట్రిబ్యునల్ సూచించింది. రాష్ట్రానికి కొంత మేలే... నిపుణులు: ట్రిబ్యునల్ సూచనల మేరకు ఎగువ రాష్ట్రాలు మిగులు జలాలను వాడుకోవాలంటే.. మనకు ముందుగా నికర జలాలను విడుదల చేయాల్సి ఉంటుంది. తద్వారా రాష్ట్రానికి కొంత మేలు జరుగుతుందని నీటిపారుదల శాఖ నిపుణులు పేర్కొంటున్నారు. కాగా ట్రిబ్యునల్ సూచించిన ఈ కొత్త ప్రతిపాదనపై ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలనే విషయమై ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. ఈ ప్రతిపాదన వల్ల కలిగే లాభ నష్టాలను అంచనా వేస్తూ అధికారులు ప్రభుత్వానికి ఒక నివేదికను అందజేయనున్నారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ప్రకారం ఈ నెల 24, 25వ తేదీల్లో జరిగే సమావేశంలో అధికారులు రాష్ట్ర అభిప్రాయాన్ని చెప్పనున్నారు. తుది తీర్పు దిశలో ట్రిబ్యునల్: బ్రిజేశ్‌కుమార్ ఆధ్వర్యంలోని కృష్ణా ట్రిబ్యునల్ తుది తీర్పును వెల్లడించడానికి సిద్ధమవుతోంది. 2010 డిసెంబర్లో ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. దానిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో సవరణల కోసం ఈ మూడేళ్లు ప్రత్యేక సమావేశాలను నిర్వహించి, ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు విన్నారు. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ట్రిబ్యునల్ తాజా గడువు సెప్టెంబర్‌తో ముగియనుంది. ఆ లోపు తుది తీర్పును వెల్లడించాలని ట్రిబ్యునల్ భావిస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 26న ప్రత్యేక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు.