ఇక నీటి కేటాయింపుల్లేవ్‌  | Sakshi
Sakshi News home page

ఇక నీటి కేటాయింపుల్లేవ్‌ 

Published Sat, Mar 25 2023 2:47 AM

Updates of Krishna Water Disputes - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల కేటాయింపులను జరపమని, ప్రాజెక్టుల వారీగా ఇప్పటికే నిర్దిష్ట కేటాయింపులు జరగని పక్షంలో ఆ మేరకు కేటాయింపులు మాత్రమే చేస్తామని బ్రిజేష్కుమార్‌ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌–2 మరోసారి స్పష్టం చేసింది. అంతర్రాష్ట్ర నదీ జలాల వివాద పరిష్కార చట్టం (ఐఎస్‌ఆర్‌డబ్ల్యూ) 1956లోని సెక్షన్‌ –3, 5 కింద కృష్ణా జలాల కేటాయింపులను ట్రిబ్యునల్‌ ఇప్పటికే ముగించిందని తెలిపింది.

ఏపీ పున ర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89 కింద ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు జరిపేందుకు పరిమిత అవకాశాలు మాత్రమే ఉన్నాయని ట్రిబ్యునల్‌ చైర్మన్‌ బ్రిజేష్‌కుమార్‌ వెల్లడించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులు జరుపుతూ 2022లో తెలంగాణ జారీ చేసిన జీవో నెం.246ను సవాలు చేస్తూ ఏపీ దాఖలు చేసిన ఇంటర్‌ లొకేటరీ అప్లికేషన్‌పై శుక్రవారం ఢిల్లీలో కృష్ణా ట్రిబ్యునల్‌–2 విచారణ నిర్వహించింది.

మైనర్‌ ఇరిగేషన్‌లో పొదుపు చేసిన 45 టీఎంసీలు, కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల తరలింపులకు బదులుగా మరో 45 టీఎంసీలను కలిపి మొత్తం 90 టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి పథకానికి తెలంగాణ కేటాయించింది. ఈ అంశంపై నిర్ణయం తీసుకునే అధికారం ట్రిబ్యునల్‌కు ఉందని ఏపీ న్యాయవాది జయదీప్‌ గుప్తా వాదనలు వినిపించగా, నీటి కేటాయింపులపై నిర్ణయాధికారం తమకు లేదని బ్రిజేష్ కుమార్‌ ఆయన వాదనలను తోసిపుచ్చారు.

అపెక్స్‌ కౌన్సిల్‌కు నిర్ణయాధికారం లేదని, కేవలం మధ్యవర్తి పాత్రపోషించాల్సి ఉంటుందని పున ర్విభజన చట్టంలోని సెక్షన్‌ 89ను ఉటంకిస్తూ ఏపీ న్యాయవాది పేర్కొనగా, అపెక్స్‌ కౌన్సిల్‌ విషయాన్ని ట్రిబ్యునల్‌కు రిఫర్‌ చేయవచ్చు అని బ్రిజేష్ తెలిపారు. ప్రాజెక్టుల వారీ గా  కేటాయింపులు జరపనిపక్షంలో ఆపరేషనల్‌ ప్రొ టోకాల్స్‌పై నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదంటూ తెలంగాణ తరఫున సాక్షిగా ఉన్న చేతన్‌ పండిత్‌ పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 

ఏపీ ఆరోపణను తోసిపుచ్చిన  తెలంగాణ న్యాయవాది 
మిషన్‌ కాకతీయ ద్వారా తెలంగాణ 89.15 టీఎంసీలను వినియోగిస్తున్నట్టు జీవోలో పేర్కొందని, వాస్తవానికి 175 టీఎంసీలను వాడుతోందని ఏపీ న్యాయవాది పేర్కొన్నారు. అయితే, 44టీఎంసీలను మాత్రమే మైనర్‌ ఇరిగేషన్‌ ద్వారా వాడుతున్నామని, మిగిలిన 45టీఎంసీలను పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పునః కేటాయింపులు జరిపినట్టు తెలంగాణ కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొంది.

కేఆర్‌ఎంబీ, కృష్ణా బోర్డుకు ఈ ప్రాజెక్టు డీపీఆర్‌లను తె లంగాణ సమర్పించలేదని ఏపీ చేసిన ఆరోపణను తెలంగాణ న్యాయవాది తోసిపుచ్చారు. ఇప్పటికే డీపీఆర్‌ను సమర్పించామని, పరిశీలన దశలో ఉందని అన్నారు. కాగా, పాలమూరు ఎత్తిపోతల పనులను కొనసాగిం చేందుకు ఇటీవల సుప్రీం కోర్టు అనుమతించిన నేపథ్యంలో.. ప్రాజెక్టు తాజా పురోగతిపై నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కేఆర్‌ఎంబీ ఆదేశించింది. 

Advertisement
 
Advertisement
 
Advertisement