టెల్‌అవీవ్: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ యత్నాన్ని కో–పైలెట్ కత్తిపోట్లను సైతం ఎదుర్కొని అడ్డుకున్న భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్‌ను ఇజ్రాయెల్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని అందించనున్నట్లు అధ్యక్షుడు ఐసాక్ హెర్జోగ్ తెలిపారు.
ఈ హైజాక్ ఘటనను అడ్డుకున్న ఆరుగురు ఇజ్రాయెలీలు టాలి మానెస్, జ్వికా మానెస్, యానివ్ హయూన్, షోటా ముసాయెవ్, అసాఫ్ రాజౌన్, ఓర్ పార్డిలోవ్‌లకు గురువారం ఆయన ‘ప్రెసిడెన్షియల్ అవార్డ్ ఫర్ సివిలియన్ హీరోయిజమ్’ను అందించారు. జెరూసలెంలో ఏర్పాటైన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇజ్రాయెలీ హీరోలను ఈ రోజు సత్కరించుకున్నామని, భారతీయ కెప్టెన్ మచ్ఛార్ త్వరగా కోలుకోవాలని కాంక్షిస్తున్నామని తెలిపారు.
మచ్ఛార్ తెగువ, స్థైర్యం, వృత్తిపరమైన నిబద్ధతల కారణంగానే ఓ విధ్వంస చర్యకు అడ్డుకట్ట పడిందని, పూర్తిగా కోలుకున్న తరువాత అతడికి ఇజ్రాయెల్ తరఫున అవార్డు అందించడం తనకు ఎంతో గర్వకారణమని ఆయన చెప్పారు. అక్టోబరు ఏడవ తేదీ నాటి హమాస్ దాడుల తరువాత అధ్యక్షుడు హర్జోగ్ ఏర్పాటు చేసిన అత్యుతన్న పౌర పురస్కారం ఇది. ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో ప్రాణాలకు తెగించి అసాధారణ ధైర్య సాహసాలను ప్రదర్శించే వారిని గుర్తించేందుకు, గౌరవించేందుకు ఈ అవార్డు ఏర్పాటైనట్లు అధ్యక్ష కార్యాలయం తెలిపింది.


