సమాజ్‌వాదీ పారీ్టతో పొత్తు చర్చలకు సారథ్యం
కనీసం 125 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని యోచన
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నేపథ్యంలో సమాజ్‌వాదీ పారీ్ట(ఎస్పీ)తో పొత్తు చర్చలకు కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సారథ్యం వహించే అవకాశాలున్నాయి. ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్‌తో జరిగే చర్చల్లో ఆమె క్రియాశీల పాత్ర పోషించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ప్రియాంక గాంధీ సుమారు మూడు గంటలపాటు సమావేశమయ్యారు.
దాదాపు 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలు, గత ఎన్నికల ఫలితాలు, ఈసారి గెలుపు అవకాశాలపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. వీటిని మూడు విభాగాలుగా వర్గీకరించి, సీట్ల జాబితాను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పొత్తులో భాగంగా కనీసం 125 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. పరిస్థితిని బట్టి 150 స్థానాలు కోరే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన నియోజకవర్గాలతోపాటు, పార్టీ సీనియర్ నేతలకు పట్టున్న ప్రాంతాలపైనా ప్రియాంక ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.
రాయ్‌బరేలీ, అమేథీ, సహారాన్‌పూర్ వంటి ప్రాంతాల్లో కాంగ్రెస్‌కు బలం ఉన్న కొన్ని అసెంబ్లీ స్థానాల కోసం పట్టుబట్టనున్నట్లు సమాచారం. 2024 లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలను ప్రాతిపదికగా తీసుకొని నియోజకవర్గాలను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కనీసం ఒక అసెంబ్లీ స్థానంలో పోటీ చేయాలని ప్రియాంక వ్యూహం రచిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సీట్ల సర్దుబాటుపై నవంబరులోగా స్పష్టత తీసుకొచ్చే దిశగా ఆమె కసరత్తు చేస్తున్నారు. త్వరలో మిత్రపక్షాలతో కీలక చర్చలు ప్రారంభం కానున్నట్లు తెలిసింది.


