ఆర్డర్లు పంపొద్దని వీడియో చేస్తున్న వీరమణి
సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌కు నెటిజన్ల షాక్
కొంపముంచినక్యాష్ ఆన్డెలివరీ ప్రాంక్ ఆర్డర్లు
వాటిలో రూ. 70 కోట్ల యుద్ధ ట్యాంకు కూడా..
నెటిజన్ల వేధింపులతోఇల్లు వదిలి పరారీ
సాక్షి, స్పెషల్ డెస్క్ : హాస్యానికైనా సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు, చిరునామాను బహిరంగంగా పంచుకుంటే ఎంతటి ఇబ్బందులు ఎదురవుతాయో నిరూపించే విచిత్రమైన ఘటన తమిళనాడులోని మదురైలో చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా అభిమానులను స్వీట్ బాక్స్ కోరిన ఓ ఇన్‌స్ట్రాగామ్ ఇన్ఫ్లూయెన్సర్ నెటిజన్ల వేధింపులు తాళలేక చివరకు బుధవారం ఊరొదిలి పారిపోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
అసలేం జరిగింది?: మదురైకి చెందిన వీరమణి అనే ఇన్‌స్ట్రాగామ్ ఇన్ఫ్లూయెన్సర్ క్రమం తప్పకుండా వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. గతంలో కేరళ పర్యటన కోసం నెటిజన్లను సాయం కోరగా వారు రూ.6 వేలు సమకూర్చారు. ఆ ఉత్సాహంతోనే.. ఈసారి దీపావళికి ఎవరైనా స్వీట్ బాక్స్ పంపిస్తారన్న ఆశతో తన ఇంటి చిరునామా, ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది.
ఆయన చిరునామాను ఆసరాగా చేసుకున్న కొందరు నెటిజన్లు, ప్రాంక్‌స్టర్లు వీరమణి పేరు మీద విచ్చలవిడిగా ఈ–కామర్స్ పోర్టల్స్, ఫుడ్ యాప్‌లలో ‘క్యాష్ ఆన్ డెలివరీ’ఆర్డర్లు బుక్ చేయటం ప్రారంభించారు. దీంతో నిమిషాల వ్యవధిలోనే ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్ఫోన్లు, రూ.1.69 లక్షల విలువైన టీవీలు వంటి ఖరీదైన గృహోపకరణాలతో డెలివరీ బాయ్స్ ఆయన ఇంటి దగ్గర బారులు తీరారు. మరోవైపు స్విగ్గీ, జొమాటోల నుంచి నిరంతరాయంగా తినుబండారాల ఆర్డర్లు రావటం కూడా ప్రారంభమైంది. ఏకంగా రూ.70 కోట్ల విలువైన మిలిటరీ యుద్ధ ట్యాంక్ (టీ–90), జేసీబీలు బుక్ చేసినట్లు కూడా ఫేక్ స్క్రీన్షాట్లు వైరల్ అయ్యాయి.
ఇంటికి తాళం వేసి..
అరగంటలోనే 15 ఆర్డర్లు వస్తున్నాయని, ఆ బిల్లులు కట్టేంత స్తోమత తనకు లేదని వీరమణి చివరకు ఇన్‌స్ట్రాగామ్ ద్వారా వాపోయాడు. ‘డెలివరీ బాయ్స్ దూరం నుంచి కష్టపడి వస్తున్నారు. నా దగ్గర అంత డబ్బు లేదు, మీ కాళ్లు పట్టుకుంటాను.. దయచేసి ఇలాంటి పనులు ఆపండి’అంటూ చేతులెత్తి వేడుకున్నాడు. ఆయన ఎంత బతిమాలినా ఆకతాయిల ఆగడాలు ఆగకపోవడంతో, డెలివరీ బాయ్‌ల నిలదీతలు, చుట్టుపక్కల వారి ఆగ్రహం భరించలేక చివరకు వీరమణి తన ఇంటికి తాళం వేసి ఊరు విడిచి వెళ్లిపోయాడు. బస్సులో ఊరు దాటి వెళ్తున్న దృశ్యాలను సైతం సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆన్లైన్లో వ్యక్తిగత ఫోన్ నంబర్లు, ఇంటి చిరునామాలను హాస్యానికైనా సరే బహిర్గతం చేయటం ఎన్ని చిక్కు సమస్యలకు దారితీస్తుందో చెప్పటానికి వీరమణి ఘనకార్యం చెప్పకనే చెబుతోంది.


