ట్రైన్ చిత్ర పోస్టర్
తమిళసినిమా: నటుడు విజయ్ సేతుపతి అభిమానులను చాలా కాలంగా ఎదురు చూసేలా చేసిన చిత్రం ట్రైన్. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల తేదీ ఖరారైంది. మిష్కిన్ కథ, దర్శకత్వం, సంగీతం బాధ్యతలను నిర్వహించిన చిత్రం ట్రైన్. విజయ్ సేతుపతి, శృతిహాసన్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని వీ క్రియేషనన్స్ పతాకంపై కలైపులి ఎస్. థాను నిర్మించారు. దర్శకుడు కేఎస్ రవికుమార్, కలైయరసన్, యూకీ సేతు, నరేన్, నాజర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిశంబర్ 4వ తేదీన తెరపైకి రానుంది. ఇది రైలు పయనంలో 5 గంటల పాటు జరిగే కథాంశంతో రూపొందిన కథా చిత్రం అని యూనిట్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఈ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం ఉదయం చైన్నె, తిరువేర్కాడు లోని స్టూడియోలో నిర్వహించారు. కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ ట్రైన్ గొప్ప చిత్రం కాకపోవచ్చు. అయితే చిత్ర ట్రైలర్ తో రజనీకాంత్ చిత్రాలను దాటవేశాం. అదే చాలా ఆనందంగా ఉంది అని పేర్కొన్నారు. నటుడు విజయ్ సేతుపతి మాట్లాడుతూ ‘‘ రైలు కంటే వేగంగా ఈ చిత్రం కథ, కథనాలు పరుగెడుతాయి. 5 గంటల పయనంలో ప్రతీకారం, కోపం, మరణాలు, బిడ్డ పుట్టడం, అందమైన ప్రేమ వంటి పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకుంటాయి. చిత్రం ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతూ ప్రేక్షకులను సీటు ఎడ్జ్ నా కూర్చోబెడతాయి. దర్శకుడు మిష్కిన్ బాణీలో ప్రేమ మానవత్వం వంటి అంశాలు ఇందులో చోటు చేసుకుంటాయ విజయ్ సేతుపతి పేర్కొన్నారు. కాగా ఈ చిత్రంలో నటి శృతిహాసన్ ఒక పాట పాడటం విశేషం.


