ఢిల్లీ: జంతర్ మంతర్ వద్ద నిరసనకు సంబంధించిన కేసులో కాక్రోచ్ జనతా పార్టీ కీలక నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలకు ఢిల్లీ పోలీసుల క్రైమ్ బ్రాంచ్ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 22 గురువారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. మరో నేత అజింక్య షిండేను కూడా విచారణకు పిలిచింది.
గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజౌరీ గార్డెన్‌లోని క్రైమ్ బ్రాంచ్ కార్యాలయంలో హాజరుకావాలని నేతలను పోలీసులు ఆదేశించారు. వారం రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో ఉండి బుధవారం తీహార్ జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే ఈ సమన్లు జారీ కావడం గమనార్హం. జంతర్ మంతర్ వద్ద నిరసనకు సంబంధించి సీజేపీ నేతలపై నమోదైన రెండు కేసులను ఈ వారంలో ఢిల్లీ పోలీసులు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశారు. ఆ సమయంలో సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.
అక్టోబర్ 13న సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకా, అజింక్య షిండేతో పాటు సీజేపీకి చెందిన మరో 11 మంది జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు. అయితే, జంతర్ మంతర్‌ను నిరసనల కోసం నిర్దేశించిన ప్రదేశాల జాబితా నుంచి తొలగించిన నేపథ్యంలో వారు ప్రైవేటు స్థలంలోకి చొరబడి అక్కడి నుంచి నిరసన ప్రదేశానికి చేరుకున్నారని పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసులు నమోదు చేశారు.
ఇదీ చదవండి: బీజేపీపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు..


