కుస్తీమే సవాల్‌ | World Wrestling Championship from today | Sakshi
Sakshi News home page

కుస్తీమే సవాల్‌

Oct 24 2026 4:38 AM | Updated on Oct 24 2026 4:38 AM

World Wrestling Championship from today

నేటి నుంచి ప్రపంచ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌

భారత ఆశలన్నీ సుజీత్‌పైనే 

హైలైట్‌గా పురుషుల ఫ్రీస్టయిల్‌ 97 కేజీల విభాగం

సాదులయెవ్, కైల్‌ స్నైడర్‌లపై అందరి దృష్టి

అస్తానా (కజకిస్తాన్‌): వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర ఉన్న ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో ఇప్పటి వరకు భారత్‌కు ఒకే ఒక్క స్వర్ణ పతకం లభించింది. 2010లో మాస్కో వేదికగా జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత దిగ్గజం సుశీల్‌ కుమార్‌ పురుషుల ఫ్రీస్టయిల్‌ 66 కేజీల విభాగంలో పసిడి పతకం సాధించి జగజ్జేతగా అవతరించాడు. సుశీల్‌ తర్వాత మరే భారత రెజ్లర్‌ స్వర్ణ పతకం సాధించలేకపోయాడు. అంతా అనుకున్నట్లు జరిగితే 16 ఏళ్ల పసిడి పతక నిరీక్షణకు ఈసారి తెర పడే అవకాశం ఉంది. అస్తానాలో నేటి నుంచి నవంబర్‌ 1వ తేదీ వరకు ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ జరగనుంది. 

భారత్‌ నుంచి మొత్తం 30 మంది రెజ్లర్లు బరిలో ఉన్నారు. ఇటీవల ఆసియా క్రీడల్లో పురుషుల ఫ్రీస్టయిల్‌ 65 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలిచిన సుజీత్‌ కల్కాల్‌పై భారత బృందం ఎన్నో ఆశలు పెట్టుకుంది. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న సుజీత్‌ తన స్థాయికి తగ్గట్టు ఆడితే పసిడి పతకం గెలిచే అవకాశం ఉంది. సుజీత్‌కు డిఫెండింగ్‌ చాంపియన్‌ రెహమాన్‌ మూసా అమూజాద్‌ (ఇరాన్‌) నుంచి గట్టిపోటీ లభించనుంది. గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ క్వార్టర్‌ ఫైనల్లో అమూజాద్‌ చేతిలో 5–6తో ఓడిపోయిన సుజీత్‌.. ఆ తర్వాత ‘రెపిచాజ్‌’ బౌట్‌లో అమెరికా రెజ్లర్‌ రియల్‌ వుడ్స్‌ చేతిలో 5–7తో ఓటమి పాలయ్యాడు. 

గత ప్రపంచ చాంపియన్‌షిప్‌ తర్వాత సుజీత్‌ బరిలోకి దిగిన 23 బౌట్స్‌లలో విజయం సాధించడం విశేషం. పారిస్‌ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన అమన్‌ సెహ్రావత్‌ (57 కేజీలు) ఈసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరంగా ఉన్నాడు. మహిళల ఫ్రీస్టయిల్‌లో అంతిమ్‌ కూడా ఈ మెగా టోర్నీలో ఆడటం లేదు. ఒలింపిక్స్‌ జరిగే ఏడాది మినహా ప్రతి ఏడాది ప్రపంచ సీనియర్‌ రెజ్లింగ్‌ చాంపియన్‌షిప్‌ను నిర్వహిస్తారు.

పురుషుల ఫ్రీస్టయిల్‌ విభాగంలో ఇరాన్, జపాన్, అమెరికా, అజర్‌బైజాన్‌... గ్రీకో రోమన్‌ విభాగంలో ఇరాన్, అజర్‌బైజాన్, ఉజ్బెకిస్తాన్‌... మహిళల విభాగంలో జపాన్‌ రెజ్లర్లు ఆధిపత్యం చలాయిస్తారు. ఈసారి పురుషుల ఫ్రీస్టయిల్‌ 97 కేజీల విభాగం హైలైట్‌గా నిలవనుంది. రష్యా స్టార్‌ సాదులయెవ్‌తోపాటు డిఫెండింగ్‌ చాంపియన్‌ కైల్‌ స్నైడర్‌ (అమెరికా), హసన్‌ యజ్దాని (ఇరాన్‌), అరాశ్‌  యోషిదా (జపాన్‌) బౌట్‌ల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement