వణికించిన ఒక్క నిర్ణయం! కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్ | Indonesia Stocks Crash MSCI Downgrade 19 Billion Outflow Fears | Sakshi
Sakshi News home page

వణికించిన ఒక్క నిర్ణయం! కుప్పకూలిన ఇండోనేషియా స్టాక్ మార్కెట్.. 28 ఏళ్లలో ఎన్నడూ లేనంత పతనం

Oct 17 2026 6:25 PM | Updated on Oct 17 2026 7:13 PM

Indonesia Stocks Crash MSCI Downgrade 19 Billion Outflow Fears

ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌ కుప్పకూలింది. ఇండెక్స్ ప్రొవైడర్ ఎంఎస్‌సీఐ (MSCI) తీసుకున్న కీలక నిర్ణయం ఇండోనేషియా స్టాక్ మార్కెట్‌ను కుదిపేసింది. దేశాన్ని ప్రస్తుత ఎమర్జింగ్ మార్కెట్ (అభివృద్ధి చెందుతున్న మార్కెట్) హోదా నుంచి స్టాండలోన్ మార్కెట్ స్థాయికి మార్చే ప్రతిపాదన వెలువడటంతో శుక్రవారం (అక్టోబర్ 16) అక్కడి షేర్లు భారీగా పతనమయ్యాయి. జకార్తా కాంపోజిట్ ఇండెక్స్ ఒక దశలో 11.57 శాతం వరకు పడిపోయింది. 1998 జనవరి తర్వాత ఇదే అతిపెద్ద ఒక్కరోజు పతనం. ఈ పరిణామం అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో  ఆందోళన పెంచడంతో పాటు, ఇండోనేషియా మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడులు తరలిపోయే ప్రమాదాన్ని తెరపైకి తెచ్చింది.

ట్రేడింగ్ నిలిపివేత.. బ్యాంకింగ్ షేర్లకూ భారీ దెబ్బ

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే అమ్మకాల ఒత్తిడి తీవ్రరూపం దాల్చింది. మార్కెట్ దాదాపు 8 శాతం నష్టంతో ప్రారంభం కావడంతో నిబంధనల ప్రకారం 30 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అనంతరం తిరిగి ప్రారంభమైనప్పటికీ అమ్మకాలు తగ్గలేదు. బ్యాంక్ సెంట్రల్ ఆసియా, బ్యాంక్ రాక్యాత్ ఇండోనేషియా, బ్యాంక్ మందిరి వంటి ప్రధాన బ్యాంకుల షేర్లు సుమారు 15 శాతం వరకు నష్టపోయాయి.

మరోవైపు, అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండోనేషియా కరెన్సీ రూపియా విలువ కూడా బలహీనపడింది. ఈ ఏడాది ఇప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఇండోనేషియా ఈక్విటీ మార్కెట్‌కు తాజా పరిణామం మరింత గట్టి ఎదురుదెబ్బగా మారింది.

ఎంఎస్‌సీఐ ఎందుకీ నిర్ణయం తీసుకుంది?

ప్రపంచవ్యాప్తంగా అనేక పెట్టుబడి సంస్థలు, మ్యూచువల్ ఫండ్లు, ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్లు (ఈటీఎఫ్‌లు) తమ పెట్టుబడుల కేటాయింపులకు ఎంఎస్‌సీఐ సూచీలను ప్రామాణికంగా తీసుకుంటాయి. అందువల్ల ఒక దేశానికి ఎంఎస్‌సీఐ ఇచ్చే మార్కెట్ హోదా అంతర్జాతీయ పెట్టుబడుల ప్రవాహంపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఇండోనేషియా మార్కెట్‌లో షేర్ల యాజమాన్య వివరాలు తగినంత పారదర్శకంగా లేకపోవడం, కొద్దిమంది చేతుల్లో వాటాలు అధికంగా కేంద్రీకృతం కావడం, సమన్వయంతో ట్రేడింగ్ చేస్తున్నారనే అనుమానాలు వంటి అంశాలపై ఎంఎస్‌సీఐ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు స్థానిక నియంత్రణ సంస్థలు సంస్కరణలు ప్రకటించినప్పటికీ, మార్కెట్ పనితీరులో గణనీయమైన మెరుగుదల కనిపించలేదని అంతర్జాతీయ పెట్టుబడిదారుల అభిప్రాయాలను ఉటంకించింది.

దీంతో ఇండోనేషియాను ఎమర్జింగ్ మార్కెట్ నుంచి ఫ్రాంటియర్ మార్కెట్‌గా మార్చే అవకాశాన్ని పరిశీలిస్తున్న దశను దాటి, మరింత దిగువ స్థాయిగా పరిగణించే స్టాండలోన్ మార్కెట్ హోదాకు మార్చే ప్రతిపాదనను ఎంఎస్‌సీఐ ముందుకు తెచ్చింది.

యూబీఎస్ (UBS) అంచనా ప్రకారం, ఈ మార్పు అమలైతే పాసివ్ ఫండ్ల నుంచి సుమారు 4 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉంది. క్రియాశీల పెట్టుబడిదారులు కూడా తమ పెట్టుబడులను ఉపసంహరించుకుంటే అదనంగా 15 బిలియన్ డాలర్ల వరకు అవుట్‌ఫ్లోలు నమోదయ్యే అవకాశం ఉంది. అంటే మొత్తం 19 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు తరలిపోయే ప్రమాదం ఉందన్నమాట.

ఇదీ చదవండి: రైల్వే కౌంటర్ టికెట్లకు ఇక కొత్త సదుపాయం.. ఈ 27 నుంచే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement