source: X
జింబాబ్వే వెటరన్ బ్యాటర్ బ్రెండన్ టేలర్ అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. షార్జా వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో తొలి టెస్ట్‌లో వరుసగా 131, 82 పరుగులు చేసిన టేలర్.. నిన్న ప్రారంభమైన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో మరో సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు.
తొలి రోజు ఆట ముగిసే సమయానికి 96 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు ఓపెనర్ ఇన్నోసెంట్ కైయా (96) కూడా సత్తా చాటడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 250 పరుగులు చేసింది. టేలర్‌కు జతగా వికెట్‌కీపర్ తఫద్జవా త్సిగ (2) క్రీజ్‌లో ఉన్నాడు.
ఓ దశలో జింబాబ్వే ఇన్నింగ్స్ ఇంతకంటే చాలా మెరుగ్గా ఉండింది. కైయా మరో ఓపెనర్ బెన్ కర్రన్ (44) తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించగా.. కైయా-టేలర్ రెండో వికెట్‌కు 102 పరుగులు జోడించారు. ఈ దశలో ఆఫ్ఘన్ స్పిన్నర్ నసీర్ ఖాన్ ఒక్కసారిగా చెలరేగిపోయాడు.
స్వల్ప వ్యవధిలో 4 వికెట్లు పడగొట్టి జింబాబ్వే ఇన్నింగ్స్‌ను దెబ్బతీశాడు. అయినా టేలర్ అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి, సిరీస్‌లో రెండో సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఆఫ్ఘన్ బౌలర్లలో నసీర్ ఖాన్‌తో పాటు జియా ఉర్ రహ్మాన్ (1-28) వికెట్ తీశాడు.
మిగతా జింబాబ్వే బ్యాటర్లలో బ్రియాన్ బెన్నెట్ డకౌట్ కాగా.. వెస్లీ మెదెవెరె 3, అన్టుమ్ నఖ్వీ 8 పరుగులకు ఔటయ్యారు. కాగా, ఈ సిరీస్ తొలి టెస్ట్‌లో ఇరు జట్ల బ్యాటర్లు పోటాపోటీగా పరుగులు చేయడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.
ఇదీ చదవండి: రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు మిస్.. పాక్ బ్యాటర్ అరుదైన రికార్


