అండర్–23 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడంపై సందిగ్ధత
న్యూఢిల్లీ: అండర్–23 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు పాల్గొనడంపై సందిగ్ధత నెలకొంది. ఈ నెల 12 నుంచి 18 వరకు అమెరికాలోని లాస్‌వేగస్ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుండగా... అందులో పాల్గొనాల్సిన పలువురు భారత రెజ్లర్ల వీసాలు తిరస్కరణకు గురయ్యాయి. రెజ్లర్ల వయసు 20 ఏళ్ల లోపు ఉండటం... వారు నిరుద్యోగులు అనే కారణాలతో అమెరికా ఎంబసీ... యువ రెజ్లర్లకు వీసాలు నిరాకరించింది. అండర్–17 ప్రపంచ చాంపియన్ నేహా సాంగ్వాన్ సహా పలువురు రెజ్లర్లు బుధవారం వీసా ఇంటర్వ్యూ కోసం అమెరికా రాయబార కార్యాలయానికి వెళ్లగా... వారికి పాస్‌పోర్ట్‌లు తిరిగి ఇచ్చేశారు.
దీంతో భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) ఈ అంశంపై దృష్టి సారించింది. రెజ్లర్ల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశం కావడంతో వారికి వీసాలు మంజూరు చేయాలని కోరింది. ‘వీసా అపాయింట్‌మెంట్ కోసం 24 మంది అభ్యర్థులు ఎంబసీకి హాజరయ్యారు. వీరిలో 16 మంది రెజ్లర్లు ఉన్నారు. వారి ఉద్యోగ స్థితి, 20 ఏళ్ల లోపు వయసు కారణంగా 9 మంది రెజ్లర్లకు వీసాలు నిరాకరించారు’ అని డబ్ల్యూఎఫ్‌ఐ తెలిపింది. ఈ మేరకు అమెరికా ఎంబసీకి డబ్ల్యూఎఫ్‌ఐ ఓ లేఖ రాసింది.
ఏజ్ గ్రూప్ టోర్నమెంట్‌లో పాల్గొననున్న రెజ్లర్ల వయసు 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉంటుందని... వారంతా క్రీడా కెరీర్‌ను కొనసాగించాలనుకుంటున్నారని... వారికి ఎలాంటి ఉద్యోగాలు లేవని అందులో పేర్కొంది. తిరస్కరించిన వారి దరఖాస్తులను తిరిగి పరిశీలించాలని కోరింది. అలాగే గురువారం ఇంటర్వ్యూకు హాజరు కానున్న వారి విషయంలోనూ ఈ సూచనలు పాటించాలని అభ్యర్థించింది. వీసా తిరస్కరణకు గురైన వారిలో నేహా సాంగ్వాన్‌తో పాటు సమర్థ గజానన్ మహాకావే, ధీరజ్ కుమార్ మలిక్, సచిన్ కుమార్, నిఖిల్, హర్దీప్, పర్వీన్, అహల్య శత్రుఘ్న షిండే, నేహా శర్మ ఉన్నారు.


