విజయం చేజారింది! | New Zealand rescued a draw on the final day of the first test against India | Sakshi
Sakshi News home page

విజయం చేజారింది!

Nov 24 2026 6:24 AM | Updated on Nov 24 2026 6:24 AM

 New Zealand rescued a draw on the final day of the first test against India

భారత్, న్యూజిలాండ్‌ తొలి టెస్టు ‘డ్రా’ 

రెండో ఇన్నింగ్స్‌లో కివీస్‌ 239/5

43 ఓవర్ల పాటు పోరాడిన మిచెల్, ఫిలిప్స్‌ 

శుక్రవారం నుంచి క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు

90 ఓవర్లు... 8 వికెట్లు... వెలింగ్టన్‌ టెస్టు చివరి రోజు భారత్‌ లక్ష్యం ఇది... కివీస్‌ బ్యాటర్లు ప్రతిఘటించినా తొలి 32 ఓవర్లలో 3 వికెట్లు తీయడంతో గెలుపు ఆశలు చిగురించాయి... లక్ష్యం మిగిలిన 58 ఓవర్లలో 5 వికెట్లు తీస్తే చాలు... కానీ ఇక్కడే భారత బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. ఏమాత్రం అనుకూలించని పిచ్‌పై ఎంతగా ప్రయతి్నంచినా వారు ప్రభావం చూపలేకపోయారు. 

43 ఓవర్ల ప్రయత్నం తర్వాత కూడా మరో వికెట్‌ తీయలేకపోవడంతో ఇక తమ వల్ల కాదన్నట్లుగా గిల్‌ ‘షేక్‌ హ్యాండ్‌’ ఇచ్చి ఆటను ముగించాడు. టీమిండియా విజయానికి అడ్డు పడిన మిచెల్, ఫిలిప్స్‌ చిరునవ్వులు చిందించగా... మన బృందం తీవ్ర నిరాశతో మైదానం వీడింది. ఆఖరి రోజు బౌలింగ్‌ వైఫల్యంతో శ్రీలంకతో గత టెస్టును ‘డ్రా’గా ముగించిన భారత్‌ ఇప్పుడే దానినే పునరావృతం చేసి కీలకమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌íÙప్‌ (డబ్ల్యూటీసీ) పాయింట్లు చేజార్చుకుంది.

వెలింగ్టన్‌: భారత్, న్యూజిలాండ్‌ మధ్య జరిగిన మొదటి టెస్టు ‘డ్రా’గా ముగిసింది. చివరి రోజు కివీస్‌ను ఆలౌట్‌ చేయడంలో భారత్‌ విఫలమైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 119/2తో సోమవారం ఆట కొనసాగించిన న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ముగిసే సమయానికి తమ రెండో ఇన్నింగ్స్‌లో 120 ఓవర్లలో 5 వికెట్లకు 239 పరుగులు చేసింది. మిచెల్‌ (186 బంతుల్లో 49 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌), గ్లెన్‌ ఫిలిప్స్‌ (126 బంతుల్లో 26 నాటౌట్‌; 2 ఫోర్లు) పోరాడి కివీస్‌ను ఓటమి నుంచి తప్పించారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు అభేద్యంగా 63 పరుగులే జోడించినా... ఏకంగా 259 బంతులు ఆడారు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన హెన్రీ నికోల్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య క్రైస్ట్‌చర్చ్‌లో రెండో టెస్టు జరుగుతుంది.

డిఫెన్స్‌... డిఫెన్స్‌... 
భారత్‌ స్కోరుకంటే ఇంకా 233 పరుగులు వెనుకబడిన స్థితిలో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ ఆట ఆరంభం నుంచి ‘డ్రా’ కోసమే ఆడింది. బ్యాటర్లంతా పరుగులు తీయడం గురించి ఆలోచించకుండా డిఫెన్స్‌పైనే దృష్టి పెట్టారు. ఫలితంగా తొలి 10 ఓవర్లలో 13 పరుగులే వచ్చాయి. అయితే  డెవాన్‌ కాన్వే (165 బంతుల్లో 65; 7 ఫోర్లు)ను అవుట్‌ చేసి సుందర్‌ తొలి బ్రేక్‌ ఇచ్చాడు. కాన్వే, రచిన్‌ రవీంద్ర (129 బంతుల్లో 37; 4 ఫోర్లు) మూడో వికెట్‌కు జోడించిన 72 పరుగుల కోసం 202 బంతులు ఆడారు! కొద్దిసేపటికే రచిన్‌ను ప్రసిధ్‌ వెనక్కి పంపించాడు. తొలి సెషన్‌లో కివీస్‌ 26 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 38 పరుగులే చేసింది. 

లంచ్‌ తర్వాత బ్లన్‌డెల్‌ (15) కూడా ఎక్కువ సేపు నిలవలేదు. ఈ దశలో మరో 58 ఓవర్లు మిగిలి ఉండటంతో భారత్‌ గెలుపుపై గురి పెట్టింది. అయితే మిచెల్, ఫిలిప్స్‌ కలిసి దీనిని సమర్థంగా అడ్డుకున్నారు. వీరిద్దరు ఎలాంటి తడబాటు లేకుండా పట్టుదలగా నిలబడ్డారు. టీ విరామానికి ముందు 43 బంతుల పాటు బ్యాటర్లు పరుగే తీయకపోగా, విరామం తర్వాత కూడా ఒకదశలో ఇదే తరహాలో వరుసగా 43 బంతుల పాటు పరుగు రాబట్టలేదు! చివరకు జైస్వాల్, పడిక్కల్, జురేల్‌లతో కూడా బౌలింగ్‌ వేయించిన భారత్‌ వికెట్‌ తీయలేక చేతులెత్తేసింది. చివరి రోజు మొత్తం 75 ఓవర్లు ఆడిన కివీస్‌ 120 పరుగులు మాత్రమే చేసింది.

రనౌట్‌ చాన్స్‌ మిస్‌... 
క్రీజ్‌లో పోరాటంలో మిచెల్‌కు కాస్త అదృష్టం కూడా కలిసొచ్చింది. అతను 12 పరుగుల వద్ద ఉన్నప్పుడు సుందర్‌ బౌలింగ్‌లో మిడాన్‌ దిశగా ఆడి పరుగు కోసం సగం పిచ్‌ దాటి వచ్చాడు. మరోవైపు నుంచి బ్లెన్‌డెల్‌ స్పందించనే లేదు. ఫీల్డర్‌ ఆకాశ్‌దీప్‌ బంతిని అందుకొని విసిరి ఉంటే కచ్చితంగా రనౌట్‌ అయ్యేవాడు. కానీ ఆకాశ్‌దీప్‌ బంతిని సరిగా అందుకోవడంలో విఫలం కావడంతో మిచెల్‌ వెనక్కి వెళ్లగలిగాడు. ఈ వికెట్‌ పడి ఉంటే భారత్‌ గెలిచేందుకు మంచి అవకాశం ఉండేదేమో! ఆ తర్వాత మిచెల్‌ 24 వద్ద ఉన్నప్పుడు కష్టసాధ్యమైన క్యాచ్‌ను పడిక్కల్‌ కూడా వదిలేశాడు.

15 ఓవర్లు ముందుగా ఎందుకు?
కివీస్‌ బ్యాటర్లు పట్టుదలగా ఆడి టెస్టును కాపాడుకోగలిగారనేది వాస్తవం. కానీ భారత్‌ కోణంలో చూస్తే ‘డ్రా’ను ప్రతిపాదించడంలో జట్టు వ్యవహరించిన తీరు చర్చనీయాంశం. మూడో సెషన్‌లో మరో గంట సమయం మిగిలి ఉంది. ఎలాంటి వెలుతురు సమస్య లేదు కాబట్టి మిగిలిన 15 ఓవర్లు కచ్చితంగా వేయవచ్చు. పిచ్‌ ఏమాత్రం స్పందించడం లేదు, బౌలర్లు అలసిపోయారు అనేది వాస్తవమే అయినా మనం ‘డ్రా’ కోరడంలో అర్థం ఏముంది? ఆఖరి బంతి వరకు ఆడకుండా మ్యాచ్‌ను ముగించి వెళ్లిపోవాల్సిన అత్యవసర పని అయితే ఏమీ లేదు కదా.

ఏదైనా భిన్నంగా ప్రయత్నిస్తూ చివరి వరకు ఆడితే నష్టమేముంది. క్రికెట్‌లో 90 బంతుల్లో ఏదైనా జరగవచ్చు... 5 వికెట్లు దక్కవా! ఏదైనా అనూహ్య బంతితో ఒక వికెట్‌ పడితే మిగిలిన వారెవరూ బ్యాటింగ్‌ చేయగల సమర్థులు కూడా కాదు. ‘డ్రా’ నిర్ణయానికి కాస్త ముందు ఐదు ఓవర్ల పాటు గిల్‌ మైదానం వీడి డ్రెస్సింగ్‌ రూమ్‌కు వెళ్లి వచ్చాడు. ఆ సమయంలో కోచ్‌ గంభీర్‌తో మాట్లాడిన తీరు చూస్తే అతనితో చర్చించిన తర్వాతే నిర్ణయం ప్రకటించినట్లు అనిపించింది.

‘డబ్ల్యూటీసీ’ మరింత కష్టం... 
తాజా టెస్టు ఫలితంతో భారత్‌ డబ్ల్యూటీసీలో ఫైనల్‌ చేరే అవకాశాలు మరింత కష్టంగా మారాయి. ప్రస్తుతం 50.00 పాయింట్ల శాతంతో భారత్‌ ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. మిగిలిన 6 టెస్టులూ గెలిస్తేనే ఆపై ఇతర జట్ల ఫలితాలపై అవకాశాలు ఆధారపడి ఉంటాయి. 5 విజయాలు, 1 ఓటమి లేదా 5 విజయాలు, 1 ‘డ్రా’ అయినా సరే ముందంజ వేయడం అసాధ్యమే!

స్కోరు వివరాలు
న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 368; భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 720/9 డిక్లేర్డ్డ్‌; న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (సి) పంత్‌ (బి) బుమ్రా 0; కాన్వే (సి) పంత్‌ (బి) సుందర్‌ 65; నికోల్స్‌ (సి) జురేల్‌ (బి) ప్రసిధ్‌ 31; రచిన్‌ (సి) రాహుల్‌ (బి) ప్రసిధ్‌ 37; మిచెల్‌ (నాటౌట్‌) 49; బ్లన్‌డెల్‌ (సి) పంత్‌ (బి) కంబోజ్‌ 15; ఫిలిప్స్‌ (నాటౌట్‌) 26; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (120 ఓవర్లలో 5 వికెట్లకు) 239. 

వికెట్ల పతనం: 1–0, 2–60, 3–132, 4–139, 5–176. 

బౌలింగ్‌: బుమ్రా 20–7–42–1, ఆకాశ్‌దీప్‌ 20–6–47–0, కంబోజ్‌ 22–5–45–1, ప్రసిధ్‌ 19–10–23–2, సుందర్‌ 35–14–65–1, పడిక్కల్‌ 1–0–2–0, జైస్వాల్‌ 2–0–4–0, జురేల్‌ 1–0–1–0.

పిచ్‌లో ఏమాత్రం జీవం లేదు. కాస్త బౌలింగ్‌కు సహకరించినా సరే మేం ఆటను కొనసాగించేవాళ్లం. మరో 5–10 ఓవర్లు ఆడినా ఫలితం ఉండకపోయేది. ఈ మ్యాచ్‌లో ప్రతీ పేసర్‌ దాదాపు 50 ఓవర్ల చొప్పున బౌలింగ్‌ చేసి తీవ్రంగా అలసిపోయారు. తర్వాతి టెస్టుకు ఎక్కువ సమయం లేదు కాబట్టి వారికి తగినంత విరామం అవసరమని భావించాం. బంతి 25–30 ఓవర్లకే మెత్తబడిపోతుంటే బౌలర్లు ఏం చేయగలరు. ఇలాంటి స్థితిలో బంతికి మెరుపు తెచ్చేందుకు సలైవా వాడటం సరైందని నేను భావిస్తా. కోవిడ్‌ ముగిసి చాలా ఏళ్లయింది కాబట్టి దీనిపై నిషేధాన్ని తొలగించాలి.
– శుబ్‌మన్‌ గిల్, భారత కెప్టెన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement