Photo Credit: Twitter
సెంచూరియన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా పేసర్ కగిసో రబాడ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. మ్యాచ్‌లో 9 ఓవర్లు వేసిన రబాడ 23 పరుగులిచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. తద్వారా సెంచూరియన్ వేదికలో అత్యధిక వికెట్లు పడగొట్టిన సౌతాఫ్రికా పేసర్‌గా రబాడ తొలి స్థానానికి చేరుకున్నాడు.
ఇప్పటివరకు దిగ్గజ పేసర్ డేల్ స్టెయిన్ 59 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, తాజాగా రబాడ మూడు వికెట్లు తీయడం ద్వారా సెంచూరియన్‌లో ఆడిన 10 టెస్టుల్లో 62 వికెట్లతో టాప్ లేపాడు. ఇక మరో మాజీ పేసర్ మఖాయ ఎన్తిని 50 వికెట్లు తీసి మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రబాడ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 8 వికెట్లు తీశాడు. ఇందులో ఒక ఐదు వికెట్ల హాల్ కూడా ఉంది. ఈ నేపథ్యంలో రబాడ వాండరర్స్ స్టేడియంలో నాలుగోసారి ఐదు వికెట్ల హాల్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో డేల్ స్టెయిన్, ఎన్తిని సరసన నిలిచాడు.
ఓవరాల్‌గా రబాడ 77 టెస్టుల్లో 361 వికెట్లు పడగొట్టగా, బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టుల్లో 11 ఇన్నింగ్స్‌లు కలిపి 40 వికెట్లు తీసిన రబాడ ఐదుసార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేయడం విశేషం. ఇక మ్యాచ్ విషయానికొస్తే, సఫారీ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 91 పరుగులకే కుప్పకూలింది.
బంగ్లా బ్యాటర్లలో మహ్ఫిజుల్ ఇస్లామ్ (23), తౌహిద్ హృదోయ్ (19), మోమినుల్ హక్ (23) రెండంకెల స్కోరు సాధించారు. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ, మార్కో జాన్సెన్ చెరో 3 వికెట్లు తీయగా, అన్రిచ్ నోర్ట్జే 2, వియాన్ ముల్డర్, సిమోన్ హార్మర్ ఒక్కో వికెట్ తీశారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన సౌతాఫ్రికా తొలిరోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లలో వికెట్ నష్టపోయి 88 పరుగులు చేసింది. మార్క్యూస్ అకెర్మన్ (46 నాటౌట్), టోనీ డి జార్జి (9 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
ఇదీ చదవండి: 'బ్రో.. నాకు కొంచెం లిప్ బామ్ ఇవ్వు!'


