ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘డ్రాగన్’. ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. నెక్ట్స్ షెడ్యూల్‌ను గుజరాత్ లేదా శ్రీలంకలో జరిపేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోందని సమాచారం.
మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్‌పై నందమూరి కల్యాణ్ రామ్, నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, కొసరాజు హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది జూన్ 11న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఆల్రెడీ ప్రకటించారు. అయితే ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తాజాగా వినిపిస్తోంది.
అంతేకాదు... రెండు భాగాలను ఒకేసారి చిత్రీకరించి, నెలల వ్యవధిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని భోగట్టా. వచ్చే ఏడాది జూన్ 11న ‘డ్రాగన్ పార్ట్ 1’ని విడుదల చేసి, డిసెంబరు మొదటి వారంలో పార్ట్ 2ని రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఒకవేళ ‘డ్రాగన్ 2’ విడుదల డిసెంబరులో సాధ్యపడక పోతే, 2028 వేసవిలో రిలీజ్ చేస్తారట. ఈ అంశాలపై అధికారిక సమాచారం అందాల్సి ఉంది.


