దేశంలోనే అతిపెద్ద బహుళరంగ ప్రదర్శనకు పకడ్బందీ ఏర్పాట్లు
ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సీఎం రేవంత్ ఆదేశం
డిసెంబర్ 7–9 మధ్య జరిగే సదస్సుకు భారీ సంఖ్యలో ప్రతినిధులు హాజరయ్యే చాన్స్
ఎలాంటి ఇబ్బందీ ఎదురవకుండా ఫేషియల్ రికగ్నిషన్ ఎంట్రీ
సాక్షి, హైదరాబాద్: ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్– 2026కు అనేక రంగాల నుంచి 1,000కి పైగా కంపెనీలు పాల్గొననున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. పెద్దయెత్తున ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉన్నందున పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద బహుళ–రంగ ఎక్స్‌పోగా ఈ సదస్సును నిర్వహిస్తున్నట్టు చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లపై సోమవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలోని బోధి పెవిలియన్‌లో మంత్రి శ్రీధర్‌బాబు, ఇతర ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు.
డిసెంబర్ 7–9 మధ్య భారత్ ఫ్యూచర్ సిటీలోని యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించనున్న సదస్సు ఏర్పాట్ల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వేదిక, వివిధ సమావేశ మందిరాలు, అంతర్జాతీయ ప్రతినిధులకు ఆహా్వనాలు, కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు. రక్షా ఎక్స్‌పో, ఇండియా జాయ్, స్టార్టప్ పెవిలియన్, ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఎక్స్‌పో, వ్యవసాయ అనుబంధ రంగాల ప్రదర్శన, తెలంగాణ పెవిలియన్, ఎడ్యుకేషన్ ఎక్స్‌పో, క్లైమేట్ కాంక్లేవ్‌ల నిర్వహణపై పలు సూచనలు చేశారు.
తెలంగాణ ప్రతిబింబించేలా..
‘పెట్టుబడులు, పరిశ్రమలు, ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలు, ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తూ సదస్సు నిర్వహిస్తాం. హాజరయ్యే ప్రతినిధుల ప్రవేశం కోసం ఫేషి యల్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడాలి. ఆహా్వనాలు పంపే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతినిధులతో అత్యంత మర్యాదగా వ్యవహరించేలా విధుల్లో ఉన్న అధికారులకు శిక్షణ ఇవ్వాలి. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, కాకతీయుల శిల్పకళ, సమ్మక్క సారలమ్మ ఆలయంలో ఉన్న తోరణాల నమూనాలు, సోమశిల ఆలయం, నిర్మల్ పెయింటింగ్స్, రాష్ట్రానికి చెందిన భౌగోళిక గుర్తింపు ఉన్న ఉత్పత్తులు, చేనేత, రాష్ట్ర అభివృద్ధి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర భవిష్యత్ ప్రణాళికలను ప్రతిబింబించేలా ఏర్పాట్లు చేయాలి.
ఫుడ్..ఇతర స్టాల్స్, రక్షా ఎక్స్‌పో, ఎయిర్ షో
ముఖ్యమైన ప్రతినిధులకు ఆహ్వానాలు పంపే బాధ్యతను డిప్యూటీ సీఎం భట్టి , మంత్రులు ఉత్తమ్, శ్రీధర్‌బాబులకు అప్పగించాలి. ఇతర రాష్ట్రాల సీఎంలను కూడా ఆహా్వనించాలి. పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలి. 30 ఫుడ్ స్టాల్స్, వివిధ చేనేత వ్రస్తాల ప్రదర్శనకు ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు కానున్నాయి. రక్షా ఎక్స్‌పోలో భాగంగా డిసెంబర్ 7న ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే పురస్కరించుకుని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఎయిర్ షోతో పాటు ఇతర కార్యక్రమాలను వీక్షించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు అవకాశం కల్పించాలి..’అని సీఎం చెప్పారు.
వివిధ ప్రదర్శనలు..ప్రత్యేక చర్చలు
ట్రైబల్ సమ్మిట్‌లో భాగంగా భారతీయ, వివిధ దేశాల్లోని తెగలకు సంబంధించిన బృందాలు సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. క్లైమేట్ కాంక్లేవ్‌లో భాగంగా సద్గురు జగ్గీ వాసుదేవ్, ఐక్యరాజ్య సమితి ప్రతినిధులు, వివిధ ప్రపంచ స్థాయి నిపుణులు ప్రసంగిస్తారు. స్థానికంగా ఉన్న ఇక్రిశాట్ వంటి సంస్థల నుంచి శాస్త్రవేత్తలు, స్టార్టప్స్, స్వచ్ఛంద సంస్థలను కూడా భాగస్వాములను చేయనున్నారు.
గ్రీన్ ఎకానమీకి సంబంధించిన పెట్టుబడులపై సమ్మిట్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు. ఎడ్యుకేషన్ కాంక్లేవ్‌లో భాగంగా యూకే పెవిలియన్, యూరోపియన్ పెవిలియన్‌తో పాటు ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల ప్రదర్శనలు ఉంటాయి. అలాగే ఇండియన్ స్కూల్ అఫ్ బిజినెస్, ఐఐటీ హైదరాబాద్, నల్సార్ యూనివర్సిటీ, యూనివర్సిటీ అఫ్ హైదరాబాద్ సహా తెలంగాణలోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల ప్రతినిధులు అంతర్జాతీయ అతిథులతో మాట్లాడుకునే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు.
చర్చల్లో పాల్గొననున్న సీఎం
సీఎం రేవంత్‌రెడ్డి డిసెంబర్ 7న అంతర్జాతీయ విద్యావేత్తలు, నిపుణులతో ‘భవిష్యత్ పాఠశాలలు’అనే అంశంపై ప్రత్యేక చర్చలో పాల్గొంటారు. డిసెంబర్ 8న ‘విద్యా సంస్థల కోసం సంస్కరణలు’అనే అంశంపై చర్చలో పాల్గొంటారు. ఇండియా జాయ్ కాంక్లేవ్‌లో దాదాపు 150 యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగ కంపెనీలు పాల్గొంటాయి.
ఎడోబ్, సోనీ, యూబీసాఫ్ట్ వంటి ప్రముఖ సంస్థలు ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి కంపెనీల సీఈవోలు, ఎండీలు, పెట్టుబడిదారులు, వివిధ దేశాలకు సంబంధించిన రాయబారులు దాదాపు 1,500 మంది సమ్మిట్‌కు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. సాధా రణ పౌరులు, ఔత్సాహికులు సైతం డిసెంబర్ 10–13 తేదీల్లో గ్లోబల్ సమ్మిట్‌ను సందర్శించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: వారి పదేళ్ల పాలనలో అప్పుల ఊబిలోకి..


