వెండితెరపై వెలిగిన అమ్మ
అమ్మ అనే పదం సృష్టిలో అత్యంత మధురమైనది. నవ మాసాలు మోసి, కన్న బిడ్డల భవిష్యత్తు కోసం తపించే మాతృమూర్తి త్యాగానికి వెల కట్టలేము. భారతీయ సంస్కృతి మాతృదేవో భవ అని అమ్మకు పవిత్ర స్థానం ఇచ్చింది. సినిమాలలో కథ ఏదైనప్పటికీ ‘అమ్మ’ పాత్రలకు అత్యున్నత స్థానం ఉందని ఆయా చిత్రాలు నిరూపించాయి. తల్లే ప్రధాన భూమిక పోషించిన చిత్రాలు నాటి నుండి నేటి వరకు చూస్తే సంఖ్యాపరంగా తక్కువే అయినప్పటికీ తీసిన ప్రతి చిత్రం అమ్మ ఔన్నత్యం, ప్రేమ, త్యాగాల గురించి చెప్పాయి. ΄పౌరాణిక, జానపద, సాంఘికమనే భేదం లేకుండా అమ్మకు సంబంధించిన సినిమాలు రావడం విశేషం.పురాణాల్లో మాతృభక్తి ‘భూకైలాస్’ (1958)లో తల్లిప్రేమ కోసం శివుని మెప్పించి ఆత్మలింగం తెస్తాడు రావణుడు. ‘శ్రీకృష్ణ పాండవీయం’ (1966)లో ద్రౌపదిని గెలుచుకుని అర్జునుడు ఇంటికి రాగానే తల్లి కుంతి ఆజ్ఞ మేరకు ద్రౌపదిని పెళ్లాడతారు పాండవులు. తల్లి మాటకు గల విలువను ఈ సన్నివేశం నిరూపిస్తుంది. ‘భక్తప్రహ్లాద’ (1967)లో భర్త హిరణ్య కశిపుని క్రూరత్వానికి, కొడుకు ప్రహ్లాదుని ప్రాణ సంకటస్థితికి మధ్య నలిగి΄ోయే తల్లి లీలావతి బిడ్డను రక్షించుకోవడానికి పడే తపనను, మనోవేదనను అద్భుతంగా చూపించారు. కన్నప్రేమ కంటే పెంచిన ప్రేమ ఏమాత్రం తక్కువ కాదని ‘యశోద కృష్ణ’ (1975) చెప్పింది.కుటుంబానికి వెన్నెముక అమ్మ‘కన్నతల్లి’ (1953)లో కొడుకుల సుఖం కోసం తల్లి ఈ లోకం నుంచే దూరమవుతుంది. ‘తల్లి ప్రేమ’ (1968)లో కేశవరావు తమ్ముడి భార్య పురిటిలోనే బిడ్డను కోల్పోతుంది. అప్పుడే మగబిడ్డకు జన్మనిచ్చిన కేశవరావు భార్య తోటికోడలు స్పృహలోకి రాకముందే తన బిడ్డను ఇస్తుంది. తల్లి త్యాగాన్ని చూపించిన చిత్రమిది. సావిత్రి స్వీయదర్శకత్వంలో వచ్చిన ‘మాతృదేవత’ (1969) ఒక ఆదర్శవంతమైన గృహిణి తన కుటుంబాన్ని ఎలా నిలబెట్టుకుంటుందో చూపిస్తుంది. ‘అమ్మ కోసం’ (1970)లో తన కొడు కుల మధ్య విభేదాలు తలెత్తినపుడు ఆ తల్లి పడే మానసిక సంఘర్షణను చూపించారు. రేఖ రెండో హీరోయిన్గా నటించిన తొలి తెలుగు చిత్రమిదే. ఆ తర్వాత ఆమె టాలీవుడ్ వైపు రాలేదు.త్యాగానికి మరో పేరు అమ్మ‘అమ్మ మాట’ (1972)లో తన తండ్రిని జైలుకు పంపిన వ్యక్తిపై పగ తీర్చుకోవాలనుకునే కొడుకు తన తల్లికి ఇచ్చిన మాట కోసం ఆ పగను అణచుకుంటాడు. ‘బంగారు తల్లి’ (1972)లో భర్త పోయాక కొడుకులను ప్రయోజకులను చేయడం కోసం తల్లి పడే తపన, శ్రమ, హృద్యం! ‘కన్నతల్లి (1973) కన్నబిడ్డ ఎక్కడ ఉన్నా రప్పించుకొనే శక్తి మాతృప్రేమకే ఉందని నిరూపించింది.ఆధునిక చిత్రాల్లో అమ్మ ఔన్నత్యం‘అమ్మ రాజీనామా’ (1991)లో తల్లి రాత్రింబవళ్లు భర్త, పిల్లల కోసం శ్రమిస్తుంది. కానీ పిల్లలు ఆమెను పనిమనిషిలా చూస్తూ, సేవలను గుర్తించరు. దాంతో ఆమె తన బాధ్యతలకు ‘రాజీనామా’ చేసి, తన విలువ తెలిసొచ్చేలా చేస్తుంది. ‘మాతృదేవో భవ’ (1993)లో కేన్సర్ వ్యాధితో తాను త్వరలో చని΄ోతానని తెలిసిన ఒక తల్లి, అనాథలు కాబోతున్న తన నలుగురు బిడ్డలను వేర్వేరు ఇళ్లకు దత్తత ఇస్తూ, పడిన క్షోభ కరుణరసాత్మకం. ‘యమలీల’ (1994)లో యముడు సైతం తల్లి ప్రేమకు కరిగి, ఒక తల్లి అంత్యకాలం ముగిసినప్పటికీ దీర్ఘాయుష్షు ప్రసాదిస్తాడు.కొత్త మిలీనియంలో కొత్త అమ్మ ‘అమ్మా నాన్న ఓ తమిళ అమ్మాయి’ (2003)లో తల్లీకొడుకుల మధ్య బంధం స్నేహపూర్వకంగా ఉంటుంది. ‘ఛత్రపతి’ (2005), ‘నాని’ (2004) చిత్రాలు తల్లి ప్రేమకు ఉదాహరణలు. ‘బాహుబలి’ (2015)లో శివగామి తాను నీళ్లలో మునిగి΄ోతున్నా, చేయి పైకెత్తి బిడ్డను కాపాడే దృశ్యం మాతృశక్తికి నిదర్శనం. ‘బిచ్చగాడు’ (2016)లో భర్త మరణానంతరం ఒంటరిగానే వ్యాపారాన్ని అభివృద్ధి చేసి, కొడుకును ప్రయోజకుడిని చేసిన తల్లి ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. ‘హాయ్ నాన్న’ (2023) చిత్రం ఒక తండ్రి ఎంత ప్రేమను పంచినా, తల్లి ప్రేమే ఒక బిడ్డకు అసలైన బలమని నిరూపిస్తుంది.అమ్మను మించిన దైవం లేదునిజానికి తల్లి పాత్ర లేకుండా ఏ కథా ఉండదు, ఏ చిత్రమూ ఉండదు. ‘కుపుత్రో జాయేత్... క్వచిదపి కుమాతా న భవతి’ అన్నట్లు లోకంలో చెడ్డ కొడుకు లుంటారేమో గానీ, చెడ్డ తల్లి ఎక్కడా ఉండదని ఆది శంకరుల వారి మాట! ‘అమ్మను మించిన దైవం లేదు. దేవుడు అంతటా ఉండలేక తల్లులను సృష్టించాడు’ అని ప్రసిద్ధ రచయిత రుడ్ యార్డ్ కిప్లింగ్ చెప్పిన మాట అక్షర సత్యం. ఈ ఉదాత్త భావనతోనే మన సిన్మాలు అమ్మను వెండితెరపై వెన్నెల సంతకంలా చిత్రించి, అమ్మకు నిజమైన నీరాజనం అందించాయి.– డాక్టర్ వి.వి. రామారావు (రచయిత, గాయకుడు, వ్యాఖ్యాత)