హీరోకు కష్టం వస్తే కన్నీరు కారుస్తారు.. మరి కేన్సర్‌ వస్తే

Blockbuster Movies Of CANCER Hit Formula - Sakshi

హీరోకు కష్టం వస్తే ప్రేక్షకులు కన్నీరు కారుస్తారు. హీరోకు కేన్సర్‌ వస్తే భరించగలరా? తెలుగు సినిమాకే కాదు భారతీయ సినిమాకు కూడా ‘కేన్సర్‌’ ఒక హిట్‌ ఫార్ములాగా నిలిచింది. ‘కేన్సర్‌’ అని తెలిశాక జీవితాన్ని చూసే పద్ధతి, చేసే త్యాగం, పోరాడే తెగువ, నిలుపుకునే ఆశ... ఇవన్నీ సినిమా కథలుగా మారి బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచాయి. నేడు ‘వరల్డ్‌ కేన్సర్‌ డే’ సందర్భంగా ఆ సినిమాల తలపులు... జ్ఞాపకాలు...

పూర్వం తెలుగు ప్రేక్షకులకు గుండెపోటు మాత్రమే తెలుసు. అది కూడా గుమ్మడి వల్ల. ఆయనే గుండె పట్టుకుని చనిపోతూ ఉండేవారు సినిమాలో. కేన్సర్‌ చాలా ఆధునిక జబ్బు. దానికి కొత్తల్లో తగిన చికిత్స లేకపోవడం విషాదం.  ప్రాణరక్షణకు గ్యారంటీ ఉందని చెప్పలేని స్థితి. మృత్యువు దాపున ఉన్నట్టే అన్న భావన ఉంటుంది. ఇది తెలుగు సినిమా కథకు డ్రామా తీసుకురాగలదని సినిమా దర్శకులు కనిపెట్టారు. పూర్వం టి.బి వంటి వ్యాధుల మీద సినిమాలు ఉన్నా కేన్సర్‌లో ఉండే తక్షణ ప్రాణ భయం సినిమా కథల్లో మలుపులకు కారణమైంది.

ప్రేమాభిషేకం

పాత ‘దేవదాసు’లో దేవదాసు తాగి తాగి చనిపోతాడు. పార్వతిని వదులుకోవాల్సి రావడమే కారణం. ‘ప్రేమాభిషేకం’లో హీరోయిన్‌ను వదలుకోవడానికి పాతకాలం కాదు. ఆధునిక కాలం. ఇద్దరూ పారిపోయి పెళ్లి చేసుకోవచ్చు. కాని కేన్సర్‌ కథను మలుపు తిప్పింది. తనకు కేన్సర్‌ వచ్చిందన్న కారణంతో అక్కినేని తాను ప్రేమించిన శ్రీదేవిని దూరం పెడతాడు. ఆమెను మర్చిపోవడానికి తాగుతాడు. బంగారం లాంటి భవిష్యత్తు ఒక జబ్బు వల్ల బుగ్గిపాలు అవుతుంది.

డాక్టర్లు కాపాడలేని ఈ రోగం ఒక ప్రేమికుడి త్యాగానికి కారణమవుతుంది. దర్శకుడు దాసరి అల్లిన ఈ కథ ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది. సామాన్య ప్రేక్షకుడికి కేన్సర్‌ అనే వ్యాధి ఉన్నట్టు తెలియచేసింది. ‘ప్రేమాభిషేకం’ సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యింది. అందులోని పాటలు, మాటలు జనం నేటికీ మర్చిపోలేదు. ‘ఆగదు ఏ నిమిషము నీ కోసము’ అని పాట. మనం ఆరోగ్య జాగ్రత్తలు పాటిస్తూ జాగ్రత్త గా ఉండాల్సిందే. మనకు అనారోగ్యం వస్తే అయ్యో అని లోకం ఆగదు. మన జీవితమే స్తంభిస్తుంది.

గీతాంజలి

హీరో హీరోయిన్లలో ఒకరికి కేన్సర్‌ వస్తేనే ప్రేక్షకులు ఆ సినిమాను చూడాలా వద్దా అని ఆలోచిస్తారు. ఇక ఇద్దరికీ కేన్సర్‌ వస్తే చూస్తారా? ఫ్లాప్‌ చేస్తారు. కాని దర్శకుడు మణిరత్నం ఈ కథను చెప్పి హిట్‌ కొట్టాడు. గిరిజకు, నాగార్జునకు కేన్సర్‌ వచ్చిందని చెప్పి వారు కొద్దిరోజుల్లో చనిపోతారని చెప్పి ఏడుపులు పెడబొబ్బలు లేకుండా కథ నడిపించాడు. మృత్యువు ఎవరికైనా రావాల్సిందే... వీరికి తొందరగా రానుంది... ఈలోపు అన్నింటినీ కోల్పోవడం కంటే జీవితంలో ఉండే ప్రేమను, తోడును ఆనందించ వచ్చు కదా అని కథను చెప్పాడు. ‘గీతాంజలి’ మొదటగా స్లోగా ఎత్తుకున్నా మెల్లగా క్లాసిక్‌ రేంజ్‌కు వెళ్లింది. ఇళయరాజా పాటలు, వేటూరి సాహిత్యం... ‘రాలేటి పువ్వులా రాగాలలో’... అని ఒక అందమైన ప్రేమకథను చెప్పింది. గిరిజ ఈ ఒక్క సినిమా కోసమే పుట్టిందని ప్రేక్షకులు అనుకున్నారు. మళ్లీ ఆమె నటించలేదు.

సుందరకాండ
దర్శకుడు కె.భాగ్యరాజ్‌ కొత్త కొత్త కథలు కనిపెట్టడంలో మేధావి. ఒక స్టూడెంట్‌కు కేన్సర్‌ వస్తే తాను సుమంగళిగా చనిపోవాలని తన లెక్చరర్‌నే ప్రేమించి తాళి కట్టించుకోవాలని అనుకుంటుంది. అయితే ఇదంతా చివరలో తెలుస్తుంది. మొదట అంతా ఆ స్టూడెంట్‌ ఆ లెక్చరర్‌ వెంట పడితే అమాయకుడు, మంచివాడు అయిన ఆ లెక్చరర్‌ ఎలా తిప్పలు పడ్డాడో నవ్వులతో చెబుతాడు దర్శకుడు. తమిళంలో హిట్‌ అయిన ఈ సినిమా తెలుగులో కూడా వెంకటేశ్‌ హీరోగా రాఘవేంద్రరావు దర్శకత్వంలో అంతే పెద్ద హిట్‌ అయ్యింది.

‘సుందరాకాండకు సందడే సండది’ అని కలెక్షన్ల సందడి సృష్టించింది. ఈ సినిమాలో కూడా స్టూడెంట్‌ పాత్ర వేసిన అపర్ణ ఆ తర్వాత ఇతర చిత్రాల్లో చేసిన ఒకటి రెండు పాత్రల కంటే ఈ ఒక్క పాత్రతోనే అందరికీ గుర్తుండిపోయింది. కేన్సర్‌కు లేడీస్‌ సెంటిమెంట్‌కు ముడిపెట్టడంతో ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చిందని అనుకోవాలి. ‘నీ మజిలీ మూడునాళ్లే ఈ జీవయాత్రలో... ఒక పూటలోనే రాలు పూలు ఎన్నో’ అని తాత్త్వికంగా వేటూరి రాసిన పాట మనల్ని గాంభీర్యంలో పడేస్తుంది. మృత్యువు సమీపిస్తేనే జీవితం రుచి తెలుస్తుంది. అది గమనికలో పెట్టుకుని అందరినీ ప్రేమించమని తాత్త్వికులు చెబుతుంటారు.

మాతృదేవోభవ
కన్నీరు... కన్నీరు.. కన్నీరు.. కారిన ప్రతి కన్నీటిబొట్టు కాసులను కురిపించడం అంటే ఏమిటో ఈ సినిమా చెప్పింది. ఇందులో నలుగురు పిల్లలు ఉన్న తల్లిదండ్రుల్లో తండ్రి నాజర్‌ అనుకోకుండా చనిపోతాడు. కుటుంబం కష్టాల్లో పడింది అనుకుంటే తల్లికి కేన్సర్‌ వస్తుంది. ఇప్పుడు ఆ పిల్లలు ఏం కావాలి? ఆ తల్లి ఆ పిల్లలకు ఒక నీడ కోసం సాగించే అన్వేషణ గుండెల్ని పిండేస్తుంది. నటి మాధవి చేసిన మంచి పాత్రల్లో ఇది ఒకటి. ఈ సినిమా చూసినవారు కష్టాల్లో ఉన్న కుటుంబాలకు కొద్దో గొప్పో సాయం చేయాలని ఏ దిక్కూ లేని పిల్లలను ఎలాగోలా ఆదుకోవాలని అనుకుంటారు. అంత ప్రభావం చూపుతుందీ సినిమా. ‘వేణువై వచ్చాను భువనానికి... గాలినైపోతాను గగనానికి’ అని వేటూరి రాశారు. అందరం ఏదో ఒకనాడు గాలిగా మారాల్సిందే. కాని ఈ గాలిని పీల్చి బతికే రోజుల్లో కాసిన్నైనా మంచి పరిమళాలు వెదజల్లగలిగితే ధన్యత.

చక్రం.. జానీ..

హిందీ ‘ఆనంద్‌’ స్ఫూర్తితో ‘చక్రం’ తీశారు డైరెక్టర్‌ కృష్ణవంశీ. కాని అప్పటికే మాస్‌ సినిమా ఇమేజ్‌ వచ్చిన ప్రభాస్‌ కేన్సర్‌తో బాధపడటం ప్రేక్షకులు అంతగా మెచ్చలేకపోయారు. మృత్యువు అనే ఒక పెద్ద వాస్తవానికి తల వొంచితే రోజువారి చిన్న చిన్న స్పర్థలు, పట్టుదలలు, పంతాలు నిలువవనీ వాటికి అతి తక్కువ విలువ ఇస్తామని ఈ సినిమా చెబుతుంది. ‘జగమంత కుటుంబం నాదీ... ఏకాకి జీవితం నాది’ పాట ఈ సినిమా నుంచి వచ్చి నిలిచింది. ‘జానీ’ సినిమా కూడా కేన్సర్‌ కథాంశం ఉన్నా జనం మెప్పు పొందలేకపోయింది. భార్య కేన్సర్‌ బారిన పడితే హీరో ఆమె చికిత్సకు కావాల్సిన డబ్బు కోసం ఫైట్స్‌ చేస్తుంటాడు. ఈ ‘యాక్షన్‌–సెంటిమెంట్‌’ సరైన తాలుమేలుతో లేదు. ఆ తర్వాత వచ్చిన ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’లో తల్లికి కేన్సర్‌ వస్తే పిల్లలు బాధ్యతను ఎరగడం చూపించాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల.

ప్రతిరోజూ పండగే...

ఇటీవల కేన్సర్‌ను మెయిన్‌ పాయింట్‌గా చేసుకుని హిట్‌ కొట్టిన సినిమా ‘ప్రతిరోజూ పండగనే’. ఇంటి పెద్దకు కేన్సర్‌ వస్తే పిల్లలు ‘ముసలాడు ఎప్పుడు పోతాడా’ అన్నంత మెటీరియలిస్టులుగా మారడంలోని బండతనాన్ని, అమానవీయతను నవ్వులలో పెట్టి ప్రశ్నించడం వల్ల ఈ సినిమా నిలిచింది. సత్యరాజ్‌ ఈ పాత్రను పండించడం, తండ్రి గొప్పదనాన్ని మర్చిపోయిన కొడుకుగా రావు రమేశ్‌ సెటైర్లు సినిమాకు ప్లస్‌ అయ్యాయి.

బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్‌ కథలు ఉండకపోవచ్చు. కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్‌ ప్రపంచంలో పడి ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. సమయాన్ని ఫోన్‌లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్‌ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా.

బహుశా రాబోయే రోజుల్లో కేన్సర్‌ కథలు ఉండకపోవచ్చు. కేన్సర్‌ను దాదాపుగా జయించే దారిలో మనిషి ఉన్నాడు. కనుక కథలు ఇకపై మారవచ్చు. మనిషి ఇవాళ డిజిటల్‌ ప్రపంచం వల్ల ఒంటరితనం అనే కేన్సర్‌లో పడటం సినిమా కథ కావచ్చు. మొత్తం సమయాన్ని ఫోన్‌లో కూరేస్తూ ఇంట్లోని సభ్యులు కూడా మాట్లాడుకోకపోవడానికి మించిన కేన్సర్‌ లేదని చెప్పే కథలే ఇకపై రావచ్చు. వాటి అవసరం ఉంది కూడా.

– సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top