మహబూబాబాద్: జిల్లాలో తొమ్మిది ఎత్తిపోతల పథకాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిలో ఒకటి మాత్రం పాక్షికంగా పనిచేస్తుండగా.. మిగిలిన ఎనిమిది పని చేయడం లేదు. గూడూరు మండలం బొల్లెపల్లిలో రూ.20 కోట్లతో పథకం పనులు జరిగినప్పటికీ గ్యాస్ కంపెనీ నుంచి ఎన్‌ఓసీ రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. కాగా, శిథిలావస్థకు చేరిన వాటి సరి చేయాలని రైతులు పలుమార్లు నీటిపారుదలశాఖ కార్యాలయంలో వినతులు ఇచ్చారు. ఎట్టకేలకు పునఃనిర్మాణాల కోసం రూ.20 కోట్లు అవసరమని అంచనా వేసి ప్రతిపాదలు పంపారు.
ఎస్సీ కార్యాలయం పరిధిలో
మూడు డివిజన్‌లు..
జిల్లా కేంద్రంలోని నీటి పారుదల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయం పరిధిలో మూడు (మానుకోట, మరిపెడ, నెక్కొండ) డివిజన్‌లు ఉన్నాయి. ఆయా డివిజన్‌ల పరిధి మండలాల్లో 18 ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. వాటి పరిధిలో 8,183 ఎకరాల ఆయకట్టు ఉంది.
శిథిలావస్థలో 9పథకాలు..
గార్ల మండలంలోని అంజనాపురం, బుద్దారం, రాంపూర్ పథకాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కురవి మండలంలోని లక్ష్మీనారాయణపురం, రాజోలు, బంగారిగూడెం, గూడూరు మండలంలోని అయోధ్యాపురం, మానుకోట మండలంలోని గాంధీపురం, రెడ్యాల పథకాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. దీంతో ఆయా పథకాల కింద సాగులో ఉన్న రైతులు పంటలు నష్టపోతున్నారు.
రూ.20 కోట్ల ప్రతిపాదనలు..
శిథిలావస్థకు చేరుకున్న ఎత్తిపోతల పథకాల పునఃనిర్మాణం కోసం రూ.20కోట్లు అవసరమని ఇటీవల ఇరిగేషన్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు తయారు చేశారు. త్వరలోనే నిధులు మంజూరై, పనులు ప్రారంభమవుతాయని సంబంధిత అధి కారులు చెబుతున్నారు. ఆపరేషన్ మెయింటనెన్స్ కమిటీ నిర్ణయంతో నిధులు మంజూరు అవుతాయని, కమిటీలో ఈఎన్‌సీ, సీఈలు ఉంటారని, వారు ఎస్టిమేషన్ ఫొటోలు ఇతరత్రా పరిశీలించి నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కమిటీ నిర్ణయం ప్రకారం కొన్ని పథకాలు త్వరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
ఎన్‌ఓసీ లేక నిరుపయోగం..
గూడూరు మండలంలోని బొల్లెపల్లి పథకం నిర్మాణం కోసం 2021లో రూ.20 కోట్లు మంజూరు చేశారు. దాదాపు 90శాతం పనులు ప్రారంభమయ్యాని అధికారులు తెలిపారు. కాగా ఓ గ్యాస్ కంపెనీ నుంచి అక్కడ ఎన్‌ఓసీ రావడం లేదని, దీంతో మిగిలిన పనులు ప్రారంభం కాక ఉపయోగంలోకి రాలేదు. దాని కింద 1,565 ఎకరాల ఆయకట్టు ఉంది.
పథకాలు ఎక్కడెక్కడంటే..
మానుకోట మండలం రెడ్యాలలో మున్నేరు వాగుపై ఒక ఎత్తిపోతల పథకం, అదేవాగుపై గాంధీపురంలో మరోటి ఉంది.
గూడూరు మండలం అయోధ్యాపురంలో మున్నేరు వాగుపై, బొల్లెపల్లిలో పాకాల వాగుపై పథకాలు ఉన్నాయి.
కురవి మండలంలోని బంగారిగూడెం, పెద్దతండా, రాజోలు, గుండ్రాతిమడుగు, కొత్తూరు, లక్ష్మీనారాయణపురంలో మున్నేరు వాగుపై పథకాలు ఉన్నాయి.
డోర్నకల్ మండల కేంద్రం, గొల్లచర్ల, అందనాలపాడులో మున్నేరు వాగుపై పథకాలు ఉన్నాయి.
బయ్యారం మండలం చోక్లాతండా శివారు, బాలాజీ పేటలో వట్టి వాగుపై ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి.
గార్ల మండలం అంజనాపురం గ్రామ శివారు, బుద్దారం, రాంపురంలో పాకాల వాగుపై ఉన్నాయి.
జిల్లాలో శిథిలావస్థకు చేరిన 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలు
మరమ్మతుల కోసం రూ.20 కోట్ల ప్రతిపాదనలు
త్వరగా పునఃనిర్మాణాలు చేయాలని ఆయకట్టు రైతుల విజ్ఞప్తి


