నర్సింహులపేట: ఎస్‌ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటరు ఆన్‌లైన్ నమోదు సక్రమంగా చేపట్టాలని అదనపు కలెక్టర్ అనిల్‌కుమార్ అన్నారు. గురువారం మండలంలోని పాండ్యాతండాలో కొనసాగుతున్న సర్ ప్రక్రియను పరిశీలించారు. ఓటరు వివరాలతో పూర్తి చేసిన ఫారాలు, ఆన్‌లైన్ నమోదును పరిశీలించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో సమీక్ష చేశారు. పవన్‌కుమార్, తహసీల్దార్ రమేశ్‌బాబు, డీటీ సుధాకర్‌నాయక్, కిరణ్, బీఎల్‌ఓలు పాల్గొన్నారు.
కూరగాయలు పండించాలి
మహబూబాబాద్ రూరల్: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూరగాయలు పండించాలని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న అన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో కూరగాయల పంటల సాగుపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. మరియన్న మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరుతడి, కూరగాయల పంటలు సాగు చేయాలని సూచించారు. ఆయిల్ పామ్ తోటలు, పండ్ల తోటల్లో అంతర పంటలు పండించాలని సూచించారు. రైతులు పంట మార్పిడి వైపు అడుగులు వేయాలని, ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యాన అధికారులు శాంతిప్రియ, శాంతిప్రియదర్శిని, ఫీల్డ్ అధికారి శ్రీకాంత్, కార్యాలయ సిబ్బంది జ్యోత్స్న, కిశోర్, కరుణాకర్, రామకృష్ణ, సుమతి, అరుణ, సుకన్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఆహార భద్రత నిబంధనలు పాటించాలి
మహబూబాబాద్: జిల్లాలోని బిర్యానీ సెంటర్లు, రెస్టారెంట్లు, క్యాంటీన్లు, ఆయా షాపుల యజమానులు ఆహార భద్రత నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఫుడ్‌సేఫ్టీ అధికారి ధర్మేందర్ హెచ్చరించారు. మున్సిపాలిటీ, ఫుడ్‌సేఫ్టీ అధికారుల ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలోని పలు బిర్యానీ సెంటర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా ధర్మేందర్ మాట్లాడుతూ.. ఆరోగ్యానికి హానిచేసే కెమికల్స్ ఉపయోగించవద్దని, ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడొద్దన్నారు. పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. నిబంధనలు అతిక్రమించిన బిర్యానీ సెంటర్ల యజమానులకు రూ.22,000 జరిమానా విధించామన్నారు. కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.
ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించలేదు
హన్మకొండ: హైదరాబాద్ రూట్‌లో ఎక్స్‌ప్రెస్ బస్సులు తగ్గించారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీజీఎస్ ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ ఎస్.భవానీప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వరంగల్–హైదరాబాద్ (ఉప్పల్, జేబీఎస్, జగద్గిరిగుట్ట, కూకట్‌పల్లి, బీహెచ్‌ఎల్) మార్గంలో ప్రస్తుతం మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సులు ప్రతీ 20 నిమిషాలకు ఒక సర్వీస్ చొప్పున నడుస్తున్నట్లు వివరించారు. హనుమకొండ బస్ స్టేషన్ నుంచి మొదటి బస్సు ఉదయం 4:30 గంటలకు, చివరి బస్సు రాత్రి 8:30 గంటలకు బయల్దేరుతుందని.. రోజుకు మొత్తం 49 ట్రిప్పులు నడుస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా హనుమకొండ నుంచి జనగామకు ప్రతీ 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున 53 ట్రిప్పులు.. జనగామ నుంచి ఉప్పల్‌కు ప్రతీ 16 నిమిషాలకు ఒక బస్సు చొప్పున మొత్తం 60 ట్రిప్పులు నడుపుతున్నట్లు వివరించారు. మహాలక్ష్మి పథకం దృష్టిలో పెట్టుకొని కరీంనగర్, కాళేశ్వరం, ఖమ్మం, సిద్దిపేట రూట్లలో అదనంగా బస్సు ట్రిప్పులు పెంచామన్నారు. ప్రజాప్రతినిధులు ఇచ్చిన వినతులు మేరకు మహాలక్ష్మి పథకం సౌకర్యాన్ని కల్పించేందుకు వివిధ రూట్లలో 77 సర్వీస్ లు నడుపుతున్నామన్నారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నామన్నారు.


