breaking news
Civic Sense
-
‘మెట్రో’లో చిల్లర చేష్టలు.. లక్షకు పైగా ఫిర్యాదులు
బెంగళూరు: రైలు, బస్సు, విమాన ప్రయాణాల్లో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా మెలగడమనేది కనీస బాధ్యత అని చెబుతుంటారు. అయితే బెంగళూరు ‘నమ్మ మెట్రో’లో ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తూ, కలవర పెడుతోంది. ప్రయాణికుల పౌర స్పృహ (Civic Sense) ప్రశ్నార్థకంగా మారుతోంది.హెడ్ఫోన్లు లేకుండా బిగ్గరగా సంగీతం వినడం, రిజర్వ్ చేసిన సీట్లను ఆక్రమించుకోవడం, రైలులో ఆహారం తీసుకోవడం తదితర సుమారు లక్షకు పైగా ఉల్లంఘనల కేసులు గత ఏడాది కాలంలో బెంగళూరు ‘నమ్మ మెట్రో’ నమోదయ్యాయి. ప్రయాణికుల నుంచి నిత్యం వస్తున్న ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న మెట్రో అధికారులు, ఈ గణాంకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. క్రమశిక్షణ లేని ప్రయాణికుల వల్ల తోటి వారికి కలుగుతున్న ఇబ్బందులను అరికట్టేందుకు భారీ ఎత్తున జరిమానాలు విధించేందుకు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్పీఎల్)సిద్ధమైంది.నివేదికల ప్రకారం సుమారు 57,538 మంది ప్రయాణికులు హెడ్ఫోన్లు లేకుండా బిగ్గరగా పాటలు పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించారు. అలాగే, తమకు కేటాయించని రిజర్వ్డ్ సీట్లను 37,038 మంది ఆక్రమించుకోగా, 1,907 మంది రైలులో భోజనం చేస్తూ పట్టుబడ్డారు. వీటితో పాటు, 1,677 మంది నిబంధనలకు విరుద్ధంగా గుట్కా, పాన్ వంటి పొగాకు ఉత్పత్తులను తీసుకున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇటువంటి చర్యలు ప్రయాణికుల మధ్య వాగ్వాదాలకు, ఘర్షణలకు దారితీస్తున్నాయని, కొన్ని సందర్భాల్లో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.మెట్రో రైల్వే (ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్) యాక్ట్, 2002 ప్రకారం ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఏ చర్య అయినా శిక్షార్హమని బీఎంఆర్సీఎల్ స్పష్టం చేసింది. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, దివ్యాంగుల కోసం కేటాయించిన సీట్లను ఇతరులు ఆక్రమించుకుని, అడిగినా ఖాళీ చేయనివారిపై కఠినంగా వ్యవహరించనున్నట్లు అధికారులు తెలిపారు. మెట్రో అనేది సామాజిక బాధ్యతతో కూడిన పబ్లిక్ స్పేస్ అని, ఇక్కడ తోటి ప్రయాణికులకు గౌరవం ఇవ్వడం ప్రతీ ఒక్కరి కనీస ధర్మమని ‘నమ్మ మెట్రో’ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది.బాధ్యతాయుతమైన ప్రయాణ సంస్కృతిని ప్రోత్సహించేందుకు బీఎంఆర్సీఎల్ ఒక ప్రత్యేక అవగాహన డ్రైవ్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా, ప్రతి మెట్రో రైలులో ఇద్దరు హోంగార్డులతో కూడిన ప్రత్యేక బృందాలను నియమించింది. వీరు నిరంతరం రైలులో తిరుగుతూ, నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తారు. నిబంధనలు అతిక్రమించే వారికి హెచ్చరికలు జారీ చేయడంతో పాటు, అవసరమైతే అక్కడికక్కడే జరిమానాలు విధించేలా చర్యలు చేపట్టనున్నారు.ఇది కూడా చదవండి: ఏఐ ‘దొంగ’ ఫొటోలు.. కంగుతిన్న పర్యాటకులు -
పట్టాలు తప్పని పారిశుధ్యం!
సాధారణంగా మన ఊళ్లలో రైల్వే స్టేషన్ అంటే ఎలా ఉంటుంది? ప్లాట్‌ఫాం నిండా పల్లీల తొక్కలు, పాన్‌పరాగ్ ఉమ్ములు, పట్టా ల మీద ప్లాస్టిక్ కవర్లు, దుర్గంధం.. ప్రయాణికులకు అనుభవమే. కానీ, సోషల్ మీడియాలో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న ఒక వీడియో చూస్తే.. ‘ఇది మన దేశంలోనేనా?’.. అని ముక్కున వేలేసుకోవడం ఖాయం! మచ్చుకైనా కానరాని చెత్త అస్సాంకు చెందిన రేజావుల్ అనే యువకుడు కేరళలోని కన్నూర్ రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి దృశ్యాలు చూసి ఆశ్చర్యం నుంచి తేరుకోలేకపోయాడు. వెంటనే కెమెరా తీసి ప్లాట్‌ఫాం నుంచి రైలు పట్టాల వరకు మొత్తం వీడియో తీశాడు. ప్లాట్‌ఫాం మీద అద్దంలా మెరుస్తున్న పలకలు ఒకెత్తయితే, సాధారణంగా చెత్తాచెదారంతో నిండిపోయే పట్టాల మీద.. కనీసం చిన్న కాగితం ముక్క కూడా కనిపించకపోవడం విశేషం. ‘ఏక్ భీ కచ్రా నహీ మిలేగా’ (ఇక్కడ ఒక్కటంటే ఒక్క చెత్త ముక్క కూడా మీకు దొరకదు!)’అని ఆ కుర్రాడు తన వీడియోలో కొనియాడాడు. మిలియన్ల వ్యూస్.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ వీడియో గంటల్లోనే వైరలై మిలియన్ల వ్యూస్‌ను కొల్లగొట్టింది. ఇది కేవలం రైల్వే అధికారుల ఘనత మాత్రమే కాదు, అక్కడి ప్రజల పౌర బాధ్యత (సివిక్ సెన్స్)కు నిదర్శనమని నెటిజన్లు నీరాజనాలు పడుతున్నారు. ప్రభుత్వం ఎన్ని చట్టాలు చేసి నా, ప్రజలు సహకరించకపోతే ఏ ప్రాంతం శుభ్రంగా ఉండదని ఈ వీడియో నిరూపించింది. శుభ్రత అనేది వనరుల మీద కాదు, మనుషుల ఆలోచనా విధానం మీద ఆధారపడి ఉంటుందని కేరళ ప్రజలు చాటిచెప్పారు. మిగతా రాష్ట్రాల వారు కూడా కన్నూర్ స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకోవాలంటూ నెటిజన్లు వ్యాఖ్యలతో హోరెత్తిస్తున్నారు. పాలనా యంత్రాంగం పని కాదిది.. మన అందరి బా ధ్యతని కన్నూర్ స్టేషన్ గట్టిగా నినదిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వందే భారత్ రైళ్లకు పెరిగిన ‘చెత్త’ తాకిడి
మనోళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే. గంటలో అమెరికాను అనకాపల్లిని చేసేస్తారు.. ఓ తెలుగు సినిమాలో సరదా సంభాషణ కోసం ఉపయోగించిన డైలాగ్ ఇది. అయితే.. మనోళ్ల చేతలు ఎలా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాస్త కాస్ట్లీ ప్రయాణంగా చెప్పుకుంటున్న వందే భారత్ రైళ్లను క్రమక్రమంగా చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు. మొన్నీమధ్యే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హౌరా–గువాహటి మధ్య పట్టాలపై ఇది పరుగులు పెట్టింది. ఈ నెలల 22 నుంచి పూర్తి స్థాయిలో ఇది నడవనుంది. అయితే ప్రారంభించిన కొన్ని గంటలకే ఆ రైలు చెత్తాచెదారంతో నిండిపోయింది. సివిక్ సెన్స్(పబ్లిక్ ప్లేస్ల్లో ఎలా వ్యవహరించాలనే స్పృహ) అనేది మరిచి.. ప్లాస్టిక్ ప్యాకెట్లు, స్పూన్లను బోగీల్లోనే పడేశారు అందులో ప్రయాణించినవాళ్లు. విదేశాల్లోలా మన దగ్గరా రైళ్లు.. దేశంలో హైటెక్ రైలు అంటూ సోషల్ మీడియాలో వందే భారత్ స్పీర్ ఎక్స్‌ప్రెస్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో ఇటు ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం. పబ్లిక్ ప్రాపర్టీకి గౌరవించేవాళ్లు.. మాన్సర్స్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించాలి అంటూ రైల్వే అధికారులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ, పైసలు కాస్త ఎక్కువైనా ఫర్వాలేదని ప్రయాణిస్తున్నవాళ్లు తమ అలవాట్లను మాత్రం కొనసాగిస్తున్నారు. వందే భారత్ రైళ్లలో చెత్త వ్యవహారంపై సోషల్ మీడియాలో ఇలా చర్చ నడుస్తోంది.. ఇది కాస్ట్లీ ప్రయాణమే అయినా.. చీప్ మెంటాలిటీ వల్ల చెత్త కుప్పగా మారుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సివిక్ సెన్స్ లేకపోతే ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కూడా వేస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్టలా మారింది అని ఇంకొకరు అన్నారు. వందే భారత్ స్లీపర్ వైరల్ వీడియోపై రైల్వే అధికారి ఒకరు స్పందిస్తూ.. రైళ్ల శుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం తగదని.. అదే సమయంలో శుభ్రత కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను కట్టడిచేయాలంటే కఠిన మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారాయన. View this post on Instagram A post shared by I LOVE BONGAIGAON (@ilovebongaigaon) -
దీన్ని సివిక్ సెన్స్ అంటారా..రోడ్డుపై రచ్చ
రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనల్ని ఇండియాలో చాలామందివాహనదారులు అస్సలు లెక్క చేయరు.. ఫ్రీ లెఫ్ట్ వదిలేయండి.. దాన్ని ఆక్రమిస్తే జరిమానా అని స్వయంగా ట్రాఫిక్ అధికారులు హెచ్చరిస్తున్నా సరే అస్సలు పట్టించుకోరు. ఏదో కొంపలు మునిగిపోయినట్టు ముందుకు పోతారు. ట్రాఫిక్ని జాం చేస్తారు. మరికొంతమంది సోషల్ మీడియా, రీల్స్ పిచ్చోళ్లు ఉంటారు. మినిమం సివిక్ సెన్స్ పాటించకుండా రోడ్డు మధ్యలోనే షూటింగ్ లంటూ, పిచ్చి పిచ్చి డ్యాన్స్‌లు చేస్తూ ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తూ ఉంటారు. ఇపుడు రహదారిపై కనీస మర్యాద పాటించని జంట గురంచి తెలుసుకుందాం. వీరికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట సందడిగా మారింది. హైవే మధ్యలో హాయిగా భోజనం తయారు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పౌరుల రోడ్డు మర్యాదలు, భద్రతా అవగాహనపై కొత్త విమర్శలకు తావిస్తోంది.Civic sense is a rare luxury in India , something not everyone seems able to afford. Take this scene for example: a family has started cooking right in the middle of road , turning the area messy. Tell me honestly, is this acceptable? pic.twitter.com/Xytjpv2DlS— The Nalanda Index (@Nalanda_index) December 8, 2025నలంద ఇండెక్స్ ద్వారా X హ్యాండిల్ పోస్ట్ చేసిన ఈ వీడియోలో తమ కారు రోడ్డు పక్కన పార్క్ చేసి వంట చేయడాన్ని చూడొచ్చు. సిలిండర్, వంటపాత్రలు, కూరగాయలు, కిరాణా సరుకులు సంచులను రోడ్డుపై చెల్లాచెదురుగా పడవేసిన వైనం నెట్టింట చర్చకు దారితీసింది.ఇండియాలో సివిక్ సెన్స్ అనేది చాలా అరుదు. ఉదాహరణకు ఇక్కడ చూడండి : ఒక కుటుంబం రోడ్డు మధ్యలో వంట మొదలు పెట్టేసింది. అక్కడంతా చిరాకు చేసి పడేసింది అని క్యాప్షన్‌తో ఈ వీడియో పోస్ట్ అయింది. అయితే ఇదే విషయంపై ఇలారోడ్డుపై వంట చేయడం, ప్రాణాలకు ప్రమాదం కదా ఆమెను ప్రశ్నిస్తే.. ఆ మహిళ ఎలాంటి సంకోచం లేకుండా ఇలా సమాధానం ఇచ్చింది “మేము రోడ్డు పక్కన వంట చేయకూడదని కూడా మాకు తెలుసు,కానీ అది రోడ్డు (ఎదురుగా ఉన్న లేన్ వైపు చూపిస్తూ) అని చెప్పింది. ఇది సర్వీసు రోడ్డు విశ్రాంతి ప్రాంతం. ఈ ప్లేస్ విశ్రాంతి, వంట కోసం ఉద్దేశించబడింది.” అని సమాధానం చెప్పింది తాపీగా చపాతీలు చేస్తూ. పక్కనే ఒక చిన్నారిని కూడా గమనించవచ్చు.ఈ వీడియో విభిన్న వాదనలకు ఆజ్యం పోసింది. ఇలాంటి వాళ్లని ట్రాఫిక్ పోలీసులు గుర్తించి జరిమానా విధించాలి, ఇది ఆమోదయోగ్యం కాదు అని, ఇలా రోడ్డు వంట చేసుకొని తినడం ప్రజా స్థలాన్ని ఇతరులకు ఆరోగ్యం, భద్రతా సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోందని కొంతమంది వ్యాఖ్యానించారు. ఆ రహదారి గుండా ఏవాహనాలు పోవడం లేదు కదా, అందుకే ఆ జంట అలా చేసిందని మరికొందరు సమర్ధించారు. ఇలాంటి కుటుంబాలకు సరియైన స్థలాన్ని, సపోర్ట్ అందించాలని మరొక వినియోగదారు వ్యాఖ్యానించారు. -
సివిక్ సెన్స్‌తో వ్యవహరిస్తున్నారా?
సెల్ఫ్ చెక్ మనదేశంలో సివిక్సెన్స్ పట్ల ధ్యాస చాలా తక్కువే. రకరకాల సామాజికనేపథ్యాలే దీనికి కారణం కావచ్చు. ఎటువంటి నేపథ్యం నుంచి వచ్చినా నాగరక ప్రపంచంలో కనీస సామాజిక జ్ఞానం లేకుండా వ్యవహరించరాదు. 1. సివిక్ సెన్స్‌ను పాటించడం అంటే సమాజంలో వ్యక్తిగా పాటించాల్సిన విలువలను గౌరవించడమే... అని మీ అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 2. రోడ్ల మీద ఉమ్మడం వంటి సామాజిక జ్ఞానం లేని ప్రవర్తనతో మీకు కలిగిన అసౌకర్యాన్ని మీరు ఇతరులకి కలిగించకూడదని భావిస్తారు. ఎ. అవును బి. కాదు 3. మీ ఇంటిని శుభ్రం చేసుకుని ఆ చెత్తను చాలా సాధారణంగా మీది కాని ఏ ప్రదేశంలోనైనా పడేయడానికి వెనుకాడరు. ఎ. కాదు బి. అవును 4. పార్కుల వంటి పబ్లిక్ ప్రదేశాలను ఎంట్రీ టికెట్ ఇచ్చాం కాబట్టి ఎలాగైనా వాడవచ్చు అనుకోకుండా నియమాలను పాటిస్తారు. ఎ. అవును బి. కాదు 5. మీరు ఉద్దేశపూరకంగా సామాజిక స్పృహను ఉల్లంఘించనప్పటికీ పొరపాటున మీ కారణంగా మరొకరు అసౌకర్యానికి గురయినట్లు గమనిస్తే వెంటనే వారికి క్షమాపణ చెబుతారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వాడేసిన బ్యాండేజ్‌లు, స్వైన్ ఫ్లూ నిరోధక మాస్కుల వంటి వాటిని యథేచ్ఛగా పారేయడం ద్వారా అవి ఇతరులను అనారోగ్యానికి గురి చేస్తాయి కాబట్టి నియమిత పద్ధతిలోనే వాటిని డెస్ట్రాయ్ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. సివిక్ సెన్స్‌తో వ్యవహరించడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 8. తమతోపాటు, సమాజాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిల్లలకు చెబుతారు. అలాగే తోటి పిల్లల సామాజిక నేపథ్యాన్ని విమర్శించడం తప్పని కూడా చెబుతుంటారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు సామాజిక జ్ఞానంతో ఇతరులకు ఆదర్శంగా ఉన్నారని అర్థం. ‘బి’లు ఎక్కువైతే మీరు సామాజికంగా మీ బాధ్యతలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదనుకోవాలి. సమాజంలో పౌరులుగా సామాజిక విలువలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని గుర్తించండి.


