మనోళ్లు తల్చుకుంటే ఏదైనా సాధ్యమే. గంటలో అమెరికాను అనకాపల్లిని చేసేస్తారు.. ఓ తెలుగు సినిమాలో సరదా సంభాషణ కోసం ఉపయోగించిన డైలాగ్ ఇది. అయితే.. మనోళ్ల చేతలు ఎలా ఉంటాయో చెప్పే ఉదాహరణ ఒకటి ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. కాస్త కాస్ట్‌లీ ప్రయాణంగా చెప్పుకుంటున్న వందే భారత్ రైళ్లను క్రమక్రమంగా చెత్త కుప్పలుగా మార్చేస్తున్నారు.
మొన్నీమధ్యే దేశంలోనే తొలి వందే భారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. హౌరా–గువాహటి మధ్య పట్టాలపై ఇది పరుగులు పెట్టింది. ఈ నెలల 22 నుంచి పూర్తి స్థాయిలో ఇది నడవనుంది. అయితే ప్రారంభించిన కొన్ని గంటలకే ఆ రైలు చెత్తాచెదారంతో నిండిపోయింది. సివిక్ సెన్స్(పబ్లిక్ ప్లేస్‌ల్లో ఎలా వ్యవహరించాలనే స్పృహ) అనేది మరిచి.. ప్లాస్టిక్ ప్యాకెట్లు, స్పూన్లను బోగీల్లోనే పడేశారు అందులో ప్రయాణించినవాళ్లు.
విదేశాల్లోలా మన దగ్గరా రైళ్లు.. దేశంలో హైటెక్ రైలు అంటూ సోషల్ మీడియాలో వందే భారత్ స్పీర్ ఎక్స్‌ప్రెస్ ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా అదే సమయంలో ఇటు ఈ వీడియో వైరల్ కావడం గమనార్హం.
పబ్లిక్ ప్రాపర్టీకి గౌరవించేవాళ్లు.. మాన్సర్స్ ఉన్నవాళ్లు మాత్రమే ఈ రైళ్లలో ప్రయాణించాలి అంటూ రైల్వే అధికారులు మొదటి నుంచి మొత్తుకుంటున్నారు. కానీ, పైసలు కాస్త ఎక్కువైనా ఫర్వాలేదని ప్రయాణిస్తున్నవాళ్లు తమ అలవాట్లను మాత్రం కొనసాగిస్తున్నారు. వందే భారత్ రైళ్లలో చెత్త వ్యవహారంపై సోషల్ మీడియాలో ఇలా చర్చ నడుస్తోంది..
ఇది కాస్ట్‌లీ ప్రయాణమే అయినా.. చీప్ మెంటాలిటీ వల్ల చెత్త కుప్పగా మారుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. సివిక్ సెన్స్ లేకపోతే ప్రపంచ స్థాయి మౌలిక వసతులు కూడా వేస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు రోడ్డు పక్కన ఉన్న చెత్త బుట్టలా మారింది అని ఇంకొకరు అన్నారు. వందే భారత్ స్లీపర్ వైరల్ వీడియోపై రైల్వే అధికారి ఒకరు స్పందిస్తూ.. రైళ్ల శుభ్రత విషయంలో సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడం తగదని.. అదే సమయంలో శుభ్రత కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యత అని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను కట్టడిచేయాలంటే కఠిన మార్గాలను అనుసరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారాయన.


