బెంగళూరు కేఫ్‌లో గంట దాటితే రూ. వెయ్యి!
ముచ్చట్లన్నాక ముగింపు ఉండాలి, కానీ బెంగళూరు కేఫ్‌లలో కూర్చునే ‘జ్ఞానులకి’కాలజ్ఞానమే ఉండదు. కప్పు కాఫీ ఆర్డర్ ఇచ్చి, ఆ ఆవిరి ఆరిపోయేలోపే ప్రపంచ సమస్యలన్నీ పరిష్కరించేద్దామని ఫిక్స్ అయిపోతారు. స్టార్టప్ చర్చలకు, ఆఫీస్ మీటింగ్‌లకు అడ్డాగా మార్చేస్తారు. ఇలాంటి ‘మీటింగ్’రాయుళ్లకి చుక్కలు చూపిస్తూ ఒక కేఫ్ యజమాని అదిరిపోయే చెక్ పెట్టాడు. శోభిత్ బక్లీవాల్ అనే వ్యక్తి ‘ఎక్స్’లో ఈ నోటీసు ఫొటోను షేర్ చేశారు.
నోటీసు సారాంశం ఏమనగా..
‘మీటింగ్స్ నాట్ అలౌడ్..’.. అంటే ఇకపై అక్కడ ‘స్టార్టప్ ఐడియాల’గురించి తీవ్ర చర్చోపచర్చలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీ ముచ్చట్లు గంట దాటితే.. నిమిషానికి ఒక లెక్క కాదు, ఏకంగా గంటకు రూ.1000 వదిలించుకోవలసిందే.. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. కేఫ్‌కి వెళ్లేది కాఫీ తాగడానికి కాదు, నెట్ ఫ్రీగా వస్తుందని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘యూనికార్న్’కంపెనీలు పెట్టేయడానికి! గంటల తరబడి టేబుల్ ఆక్రమించేసి, పాపం యజమాని కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంటారు. రాజకీయాలు, సినిమాలు, ఆఫీస్ గాసిప్స్.. వీటన్నింటినీ ఒక చిన్న కాఫీ కప్పు సాక్షిగా గంటల తరబడి తెగ చర్చించేసుకోవడం వీరికి అలవాటు. ఇప్పుడు ఆ ముచ్చట్లు సాగాలంటే.. ముచ్చట తీరాలంటే.. వెయ్యి రూపాయలు వదలాల్సిందే.
కప్పు కాఫీ.. కబుర్లు బోలెడు
కొందరికైతే ఆ కేఫ్ టేబులే వాళ్ల ఆఫీస్ డెస్‌్క.. ఆర్డర్ ఇచ్చేది చిన్న సమోసా, కానీ బిల్డప్ మాత్రం బిల్‌గేట్స్ రేంజ్‌లో ఉంటుంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ‘గంటకు వెయ్యి అంటే.. ఆ బిల్లు చూశాక ముచ్చట్లు పెట్టుకునే వారికి గుండె ఆగిపోవడం ఖాయం!’.. అని ఒకరంటే.. ‘పాపం కేఫ్ యజమాని ఎంత కసి మీద ఉన్నాడో.. ఆ వెయ్యి రూపాయల చార్జి చూస్తేనే అర్థమవుతోంది!’.. అని ఇంకొకరు నవ్వుకున్నారు. మొత్తానికి, ఆ కేఫ్‌కి వెళ్లేవారు ఇకపై ‘వాచ్’చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవాలి. లేదంటే కాఫీ కంటే ఎక్కువ బిల్లు ముచ్చట్లకే కట్టాల్సి వస్తుంది సుమా..


