
ప్రతి ముగ్గురిలో ఒక్కరికే చోటు
మేనేజర్ బాధ్యతల్లో 24 శాతమే
సముచిత స్థానంతో సత్ఫలితాలు
మెకిన్సే అండ్ కంపెనీ నివేదిక వెల్లడి
ముంబై: ప్రైవేటు రంగంలో ఎంట్రీలెవల్ (ఆరంభ స్థాయి) ఉద్యోగాలు, మేనేజర్ స్థాయి ఉద్యోగాల్లో మహిళలకు సముచిత స్థానం దక్కడం లేదు. ప్రతి మూడు ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లో ఒకే మహిళ ఉంటుంటే.. నిర్వహణ బాధ్యతల్లో మహిళల స్థానం 24 శాతంగా ఉన్నట్టు మెకిన్సే అండ్ కంపెనీ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. పట్టభద్రుల్లో సగం మంది మహిళలు ఉంటుంటే.. ప్రైవేటు సంఘటిత రంగంలో ఉద్యోగం పొందడం, ఉన్నత పదవులను అధిరోహించడం, వాటిని నిలుపుకునే విషయంలో వారు వ్యవస్థీకృత అడ్డంకులను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. ఆరంభ స్థాయి, మేనేజర్ ఉద్యోగాల్లో స్త్రీ–పురుష ఉద్యోగుల మధ్య ఉన్న అంతరాన్ని ఈ నివేదిక ప్రస్తావించింది.
భారత్, నైజీరియా, కెన్యా వ్యాప్తంగా 324 సంస్థల ఉద్యోగ డేటాను మెకిన్సే అండ్ కంపెనీ విశ్లేషించింది. ఇందులో భారత్ నుంచి 77 ప్రైవేటు సంస్థల డేటా కూడా ఉంది. ఇక భారత్‌లో ఎంట్రీలెవల్ ఉద్యోగాల విషయంలో స్త్రీ–పురుషుల మధ్య వయసులోనూ అంతరం నెలకొన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. మహిళల సగటు వయసు 39 ఏళ్లుగా ఉంటే, పురుషుల వయసు 32 ఏళ్లుగా ఉంది. మెకిన్సే విశ్లేíÙంచిన అన్ని దేశాల్లోనూ ఈ వయసు అంతరం భారత్‌లోనే ఎక్కువగా ఉంది. దీని ఆధారంగా భారత్‌లో ఎక్కువ మంది మహిళలు ప్రైవేటు రంగంలో ఉపాధిని ఆలస్యంగా ప్రారంభిస్తున్నట్టు తెలుస్తోందని ఈ నివేదిక పేర్కొంది.
పదోన్నతులూ తక్కువే..
పురుషులతో పోల్చి చూస్తే ఎంట్రీలెవల్ ఉద్యోగాల్లోని మహిళలకు పదోన్నతులు తక్కువగానే దక్కుతున్నాయి. స్త్రీలతో పోల్చి చూసినప్పుడు 2.4 రెట్లు అధికంగా పురుషులకు మేనేజర్ పదవులను అలంకరిస్తున్నారు. అంతేకాదు పురుషులతో పోల్చి చూస్తే మహిళలు 1.3 రెట్లు అధికంగా ఈ ఉద్యో గాలను వీడుతున్నారు. పెద్దగా పదోన్నతులు ఇవ్వకుండా, మహిళలను ఎంట్రీ లెవల్ ఉద్యోగాల్లోనే అట్టిపెట్టుకోవడం అన్నది వారి కెరీర్ పురోగతికి అవరోధమని ఈ నివేదిక పేర్కొంది. ‘‘పని ప్రదేశాల్లో లింగ సమానత్వం అన్నది నైతిక లేదా సామాజిక అవసరమే కాదు. ఇదొక వ్యూహాత్మకం కూడా. 2035 నాటికి భారత్ 8 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్న లక్ష్యం నేపథ్యంలో మహిళలను సంఘటిత రంగంలో పూర్తి స్థాయిలో మమేకం చేయడం అన్నది అభివృద్ధికి పు నాది అవుతుంది. చాలా సంస్థలు వైవిధ్యమైన నిర్వహణ, బృందాల ఆవశ్యకతను గుర్తించినప్పటికీ పురోగతి ఆశించిన మేర లేదు’’అని మెకిన్సే అండ్ కంపెనీ సీనియర్ పార్ట్‌నర్ వివేక్ పండిట్ తెలిపారు.