
ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టీకరణ
బిహార్‌లో ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ ప్రారంభం
75 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.10 వేల చొప్పున బదిలీ
పట్నా: బిహార్‌లో మహిళా సాధికారత కోసం ఎన్డీయే ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’ను వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ పథకం 75 లక్షల మంది పేద మహిళల బ్యాంకు ఖాతాల్లోకి రూ.10,000 చొప్పున బదిలీ చేశారు. రూ.7,500 కోట్లతో ఈ పథకానికి బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 75 లక్షల మంది లబి్ధదారులకు త్వరలో అదనంగా రూ.2 లక్షల చొప్పున అందజేయబోతున్నామని ప్రధాని వెల్లడించారు. అలాగే నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తామన్నారు. వారు స్వయం ఉపాధి పొందవచ్చని సూచించారు.
‘ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజన’పై మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. బిహార్ మహిళల ప్రగతి కోసం నితీశ్ కుమార్ ప్రభుత్వం కీలకమైన అడుగు ముందుకు వేసిందని అన్నారు. మన అక్కచెల్లెమ్మలు, ఆడబిడ్డలు ఉద్యోగాలు సంపాదిస్తే, స్వయం ఉపాధి పొందితే వారి కలలకు రెక్కలొచ్చినట్లేనని చెప్పారు. సమాజంలో వారి గౌరవం మరింత పెరుగుతుందని ఉద్ఘాటించారు. 11 ఏళ్ల క్రితం తాము తీసుకున్న ‘జన్‌ధన్ ఖాతాల’ సంకల్పం వల్లే ఈరోజు 75 లక్షల మంది మహిళల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం సాధ్యమైందని వివరించారు.
మహిళలకు ఇద్దరు సోదరులు
బిహార్ మహిళలకు నితీశ్ కుమార్, నరేంద్ర మోదీ అనే ఇద్దరు సోదరులు ఉన్నారని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. తమ సోదరీమణుల బాగు కోసం నిరంతరం కష్టపడి పని చేస్తున్నామని వెల్లడించారు. ఈ పథకాన్ని ఈ రోజు ప్రారంభించడం పట్ల గరి్వస్తున్నానని స్పష్టంచేశారు. ఇటీవలే ప్రారంభించిన ‘జీవిక నిధి సఖ్ సహకారి సంఘ్’ను ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనతో అనుసంధానిస్తామని ప్రకటించారు. పీఎం ఉజ్వల యోజన, ఉచిత రేషన్ సరుకుల పంపిణీ, ఆయుష్మాన్ భారత్ వంటి పథకాలతో 8.5 కోట్ల మంది బిహారీల జీవితాలు మెరుగయ్యాయని పేర్కొన్నారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను లఖ్‌పతీ దీదీలుగా మార్చాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని వెల్లడించారు. ఇప్పటికే 2 కోట్ల మందికిపైగా మహిళలు లఖ్‌పతీ దీదీలుగా మారారని ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు.