వారి ప్రాణత్యాగం దేశ ధైర్యసాహసాలు, వీరత్వం, శౌర్యానికి ప్రతీక
2035 నాటికి వలసవాద మనస్తత్వం పూర్తిగా వదిలించుకోవాలి
‘వికసిత్ భారత్’ లక్ష్య సాధన బాధ్యత యువతపై ఉంది
‘వీర్ బాల్ దివస్’లో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు
న్యూఢిల్లీ: సిక్కుల పదో మత గురువు గురు గోవింద్ సింగ్ వారసులు బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్ దేశం కోసం మహోన్నత త్యాగం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆనాటి మొగల్ పాలకుల క్రూరత్వం, మతోన్మాదం, ఉగ్ర భావజాలానికి వ్యతిరేకంగా వారు చేసిన ప్రాణ త్యాగం భారతదేశ అసమాన ధైర్యసాహసాలు, వీరత్వం, శౌర్యానికి అత్యున్నత ప్రతీక అని ఉద్ఘాటించారు.
గురు గోవింద్ సింగ్ వారసుల త్యాగాన్ని స్మరిస్తూ శుక్రవారం నిర్వహించిన ‘వీర్ బాల్ దివస్’లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పీడనకు వ్యతిరేకంగా ఇద్దరు యువరాజులు సాగించిన పోరాటాన్ని దేశం ఎప్పటికీ స్మరించుకుంటుందని అన్నారు. వారు మనకు గర్వకారణమని చెప్పారు. వయసు, ప్రతికూల పరిస్థితులను సైతం లెక్కచేయకుండా పోరాడుతూ దేశం కోసం ప్రాణాలు వదిలారని పేర్కొన్నారు. చిన్న వయసులోనే మొగల్ పాలకులకు ఎదురొడ్డి నిలిచారని తెలిపారు. బాబా జోరావర్ సింగ్, బాబా ఫతే సింగ్‌లను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగితే సాధించలేనిది ఏమీ ఉండదని యువతకు ప్రధానమంత్రి పిలుపునిచ్చారు.
నిజాలను అణచివేశారు
‘‘సిక్కు యువరాజుల త్యాగాల గురించి దేశంలో ప్రతి ఒక్కరికీ తెలిసి ఉండాలి. దురదృష్టవశాత్తూ ఆ పరిస్థితి కనిపించడం లేదు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా వలసవాద ఆలోచనావిధానం కొనసాగుతుండడం విచారకరం. వలసవాద మనస్తత్వానికి బ్రిటిష్ రాజకీయ నాయకుడు మెకాలే ఆద్యుడు. ఇప్పటికీ దాన్ని వదిలించుకోలేకపోతున్నాం. దశాబ్దాలపాటు నిజాలను అణచివేశారు.
బ్రిటిష్ కాలంనాటి ఆలోచనా విధానం నుంచి విముక్తి పొందాలన్నదే మన అసలైన సంకల్పం. భారతీయుల ధైర్య సాహసాలు, త్యాగాలు ఇకపై అణచివేతకు గురికాకూడదు. వారి గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవాలను గ్రహించాలి. మెకాలే కుట్రకు 2035 నాటికి 200 ఏళ్లు పూర్తవుతాయి. మరో పదేళ్లలో వలసవాద మనస్తత్వం నుంచి పూర్తిగా విముక్తి చెందాలి. అదే మన లక్ష్యం. అప్పుడు మనం స్వదేశీ సంప్రదాయాలు, సంస్కృతులను గర్వకారణంగా భావిస్తాం. ‘స్వయం సమృద్ధి’మార్గంలో ముందుకు పయనిస్తాం’’ అని మోదీ అన్నారు.
భాషల వైవిధ్యమే మన బలం
జెన్ జెడ్ (1997 నుంచి 2021 మధ్య జని్మంచినవారు), జెన్ అల్ఫా(2010 నుంచి 2025 మధ్య జని్మంచినవారు) భుజస్కందాలపై పెద్ద బాధ్యత ఉంది. ‘వికసిత్ భారత్’అనే లక్ష్య సాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపించాలి. వారి నైపుణ్యాన్ని, విశ్వాసాన్ని అర్థం చేసుకున్నా. వారిపై నాకు సంపూర్ణంగా నమ్మకంగా ఉంది. వలసవాద మనస్తత్వాన్ని వదిలించుకుంటే మన భాషల వైవిధ్యమే మనకు బలంగా మారుతుంది.
ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో 160 మంది ఎంపీలు వారి మాతృభాషలో ప్రసంగించారు. తమిళం, మరాఠీ, బంగ్లా వంటి భాషల్లో ప్రసంగాలు సాగాయి. వేర్వేరు కీలక రంగాల్లో అద్భుతమైన ప్రతిభా పాటవాలు ప్రదర్శించినవారికి ప్రతిఏటా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారాలు అందజేస్తున్నాం, ఈ ఏడాది 20 మందికి ప్రదానం చేశాం’’అని ప్రధానమంత్రి మోదీ చెప్పారు.


