
దేశీ సంస్థల్లో మహిళలకు పెరుగుతున్న ప్రాధాన్యం
నాయకత్వ హోదాలో 20 శాతానికి చేరిన ప్రాతినిధ్యం
అవతార్, సెరామౌంట్ అధ్యయనంలో వెల్లడి
భారతీయ కంపెనీల్లో నాయకత్వ హోదాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా మొత్తం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో వారి ప్రాతినిధ్యం 20 శాతానికి చేరింది. భారత్‌లో మహిళలు ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమ కంపెనీలపై వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ అవతార్, టాలెంట్ సర్వీసెస్ సంస్థ సెరామౌంట్ నిర్వహించిన 10వ విడత అధ్యయనంలో ఇది వెల్లడైంది.
ఈ అధ్యయనం ప్రకారం అత్యుత్తమ కంపెనీల్లో మహిళల ఉద్యోగుల వాటా 35.7 శాతం స్థాయిలో స్థిరంగా ఉంది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రొఫెషనల్ సర్వీసుల రంగం (44.6 శాతం) ముందంజలో ఉంది. ఐటీఈఎస్ (41.7 శాతం), ఫార్మా (25 శాతం), ఎఫ్‌ఎంసీజీ (23 శాతం), తయారీ (12 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహిళల అట్రిషన్ రేటు (ఉద్యోగం నుంచి తప్పుకోవడం) పురుషులతో దాదాపు సమానంగా 20 శాతం స్థాయిలో ఉంది. మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కించుకోవడమే మహిళలు, పురుషుల అట్రిషన్‌కి ప్రధాన కారణంగా ఉంటోంది.
అయితే, మహిళల విషయానికొస్తే పిల్లల సంరక్షణకంటే ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలే ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి మరో కీలక కారణంగా నిలుస్తోంది. 2016లో కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 25 శాతంగా ఉండగా ప్రస్తుతం 35.7 శాతానికి పెరగడం, నాయకత్వ హోదాల్లో మహిళల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి చేరడం మంచి పరిణామమని అవతార్ వ్యవస్థాపకురాలు సౌందర్య రాజేశ్ తెలిపారు. ఈ అధ్యయనానికి దేశవ్యాప్తంగా 365 కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 125 కంపెనీలకు జాబితాలో చోటు దక్కింది. ఆటోమోటివ్, కెమికల్స్, బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), మీడియా, ఫార్మా తదితర రంగ సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి.
మహిళలకు టాప్ 10 బెస్ట్ కంపెనీలు..
మహిళలకు టాప్ 10 కంపెనీల జాబితాలో యాక్సెంచర్ సొల్యూషన్స్, ఏఎక్స్‌ఏ ఎక్స్‌ఎల్ ఇండియా బిజినెస్ సరీ్వసెస్, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వేదాంత, ఈవై, కేపీఎంజీ ఇండియా, మాస్టర్‌కార్డ్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు (అక్షర క్రమంలో) ఉన్నాయి.