
అవాంఛనీయ సందేశాలను తగ్గించడానికి మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తోంది. పరిచయం లేని వ్యక్తులకు పంపే మెసేజ్‌లపై పరిమితి విధింపును పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా కొత్తవారికి ఒకసారి మెసేజ్ పంపితే దానికి అటు నుంచి రిప్లై రాకపోతే అలాంటి ప్రతి అవుట్ గోయింగ్ సందేశాన్నీ లెక్కిస్తారు. ఇవి నెలలో ఒక పరిమితి చేరుకున్నాక ఇక ఆ నెలలో కొత్తవారికి మెసేజ్ పంపేందుకు వీలుండదు.
అయితే ఈ పరిమితి ఎంత ఉంటుంది అన్నంది వాట్సాప్ ఇంకా వెల్లడించలేదు. మార్కెట్లలో వేర్వేరు పరిమితులను వాట్సాప్ పరీక్షిస్తోంది. ఒక నెలలో రిప్లై రాని కొత్త మెసేజ్‌లు పరిమితికి చేరువకాగానే యూజర్లను అప్రమత్తం చేసేందుకు బ్యానర్ లేదా పాప్-అప్ రూపంలో హెచ్చరిక కనిపిస్తుంది.
పెద్ద వాల్యూమ్ బ్రాడ్ కాస్టర్లు, బిజినెస్ ఖాతాల నుంచే మెసేజ్‌లు సాధారణ యూజర్ల ఇన్ బాక్స్ లను మంచెత్తకుండా నిరోధించడం దీని ఉద్దేశం. తెలిసినవారికి అంటే కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్నవారికి మెసేజ్‌లు పంపే సాధారణ వినియోగదారులపై దీని ప్రభావం ఉండదని వాట్సాప్ వర్గాలు తెలిపినట్లు ‘టెక్ క్రంచ్’ పేర్కొంది.